
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ కుటుంబానికి అమరావతిలో రూ.5.54 కోట్ల విలువ చేసే 38,002 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదని అఫిడవిట్‌లో చూపారు. తండ్రి డిప్యూటీ సీఎంగా పనిచేసినా కుమారుడికి మాత్రం సొంతిల్లు లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆయన పత్తికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా..తాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట కృష్ణగిరి, కంబాలపాడులలో రూ.19.40 లక్షల విలువ చేసే 12.33 ఎకరాల పొలం, రూ.31.79 లక్షల విలువ చేసే ఫార్చునర్ కారు ఉన్నట్లు చూపారు. భార్యకు రూ.32 లక్షల విలువ చేసే 46.58 తులాల బంగారు, రూ.15 లక్షల విలువ చేసే 16.50 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట రూ. 3,23,18,090 చరాస్తులు, భార్యకు రూ..1,32,14,007 చరాస్తులు ఉన్నట్లు చూపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర రూ.1,19,76,800 అప్పు తీసుకున్నట్లు, తన భార్యకు రూ.19.50 లక్షల అప్పు ఇచ్చినట్లు చెప్పారు. తనపై ఒక్క కేసు కూడా లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు
మంత్రాలయం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.రాఘవేంద్రారెడ్డికి రెండు కార్లు ఉన్నాయి. అంతేగాక అతను, అతని భార్య ఎన్.యశోదమ్మకు దాదాపు 31 ఎకరాల పొలాలు ఉన్నాయి. మాధవరంలో ముగ్గురి భాగస్తుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ అతనిపేరిట ఉంది. అతని ఎలాంటి కేసులు లేవని ఎన్నికల ఆఫిడవిట్‌లో పొందుపరచారు. ఆయనకు రూ.3.92 లక్షల విలువ చేసే 5.6 తులాల బంగారు అభరణాలు, భార్య ఎన్. యశోదమ్మకు రూ.9.10 లక్షల విలువ చేసే 13 తులాల బంగారం అభరణాలు ఉన్నట్లు తెలిపారు. అంతేకాక ఆయన పేరిట రూ.40.70 లక్షల చరాస్తి, భార్యకు రూ.26.26 లక్షల చరాస్తితోపాటు రూ.33 లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన పేరిట స్థిరాస్తులు మాత్రం రూ.2.94 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. కుమారుడు రాకే‹Ùరెడ్డి పేరిట 35 లక్షల స్థిరాస్తి, రూ.20 లక్షల చరాస్తి ఉన్నట్లు చూపారు. రాఘవేంద్రారెడ్డికి రూ.1.68 కోట్ల అప్పులు, భార్యకు రూ.21 లక్షల అప్పు ఉన్నట్లు ప్రకటించారు.
వై.బాలనాగిరెడ్డికి వ్యవసాయ భూములే ఆస్తులు
మంత్రాలయం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వై.బాలనాగిరెడ్డి, ఆయన భార్య జయమ్మకు కలిపి 44.06 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. ఇందులో బాలనాగిరెడ్డి పేరిట 37.45 ఎకరాలు, భార్య పేరిట 6.61 ఎకరాల పొలం ఉంది. ఆయనకు పేరిట ఒకకారు, భార్య పేరిట మరొక కారు ఉంది. ఆయన రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువ చేసే 10 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య పేరిట రూ.4.85 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల విలువ చేసే 5 కేజీల వెండి ఉంది. కాగా, బాలనాగిరెడ్డిపై 2012లో కోసిగి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు విచారణలో ఉంది.
ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు
సెర్ప్ సీఈఓ, సీసీఎల్‌ఏ అదనపు కార్యదర్శిగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఏఎండీ ఇంతియాజ్‌కు సొంత వాహనం లేదు. బుధవారం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునన కర్నూలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడవిట్‌లో తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించారు. తన చరాస్తిగా రూ.41.36 లక్షలు, భార్య సమీనకు చరాస్తిగా రూ.18.42 లక్షలు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో వారికి విలువైన వాహనాలుగాని, ఖరీదైనా వజ్రాలు, బంగారు, వెండి, అభరణాలేవి లేవు. స్థిరాస్తుల్లో ఆయన భార్య సమీనకు కర్నూలులోని ఎన్‌ఆర్ పేటలో 378 చదరపు అడుగుల్లో నిర్మించిన ఇల్లు ఉంది. అలాగే ఆయనకు రాజధాని క్యాపిటల్ సిటీలోని ఐనవోలులో 4500 చదరపు అడుగుల కాళీ స్థలం, ఆయన భార్య సమీనకు కల్లూరులో 2800 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. స్థిరాస్తి విలువలో ఇంతియాజ్‌కు రూ.30 లక్షలు, ఆయన భార్యకు రూ.30 లక్షలు ఉన్నాయి. మొత్తంగా ఆయనకు చరాస్థిరాస్తులు కలిపి రూ. 71,36,560, ఆయన భార్య సమీనకు 68, 42,603 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆయనపై ఎలాంటి కేసులు లేవు.