Kurnool District: ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు | TDP Leaders Ticket Fight at Kurnool District | Sakshi
Sakshi News home page

Kurnool District: ఫ్యాన్ జోరు.. సైకిల్ బేజారు

Published Sun, Mar 3 2024 10:13 AM | Last Updated on Sun, Mar 3 2024 10:26 AM

TDP Leaders Ticket Fight at Kurnool District - Sakshi

మీసం మెలేసిన వైనం.. చంద్రబాబు  నమ్మించి గొంతుకోశారని ఆవేదన 

ఇండిపెండెంట్‌గా  బరిలో దిగేందుకు నిర్ణయం 

ఆలూరులో ఓ డీఎస్పీకి టిక్కెట్‌ ఇచ్చేందుకు సిద్ధమైన టీడీపీ
 
అదే జరిగితే రాజీనామా బాటలో ఆ పార్టీ ముఖ్య నేతలు 

కర్నూలులో ఇంతియాజ్‌ రాకతో వైఎస్సార్‌సీపీలో జోష్‌..  టీజీ కుటుంబంలో నిర్వేదం 

తక్కిన ఐదు టీడీపీ స్థానాల్లో  కొత్త ముఖాలకు అవకాశం

సార్వత్రిక పోరులో అధికార పార్టీ ప్రచారపర్వంలో దూసుకెళ్తుంటే.. తెలుగుదేశంపార్టీ టిక్కెట్ల తగువులాటలో కొట్టుమిట్టాడుతోంది. డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీపై తిరుగుబాటు చేస్తే, ఎమ్మిగనూరులో టిక్కెట్‌ కోసం జయనాగేశ్వరరెడ్డి వర్గం నిరసన ప్రదర్శనలకు దిగుతోంది. ఆలూరులో పార్టీ కోసం శ్రమించిన వారికి కాకుండా డీఎస్పీని బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే పార్టీకి రాజీనామా చేస్తామని జెండా మోసిన నేతలు చ్చరిస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తిజ్వాల రగులుతోంది. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయంతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: సార్వత్రిక పోరు సమీపిస్తోంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీలో టిక్కెట్ల కేటాయింపు పూర్తి కాని పరిస్థితి. మరోవైపు టిక్కెట్లు ప్రకటించిన స్థానాల్లో నిరసనల వెల్లువ ఆగడం లేదు. డోన్‌లో తనను కాదని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడంతో ధర్మవరం సుబ్బారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తన వర్గంతో బలప్రదర్శనకు దిగి మీసం మెలేశారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతుకోశారని, ముందుగా ప్రకటించినా తనకు టిక్కెట్‌ లేకుండా చేసిన కోట్ల, కేఈ కుటుంబాలకు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలప్రదర్శనలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు ఫ్లెక్సీల్లో కని్పంచకపోవడం గమనార్హం. ఇంటిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సుబ్బారెడ్డి అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే టీడీపీకి కోలుకోలేని దెబ్బే! 

టీజీ కుటుంబంలో నిర్వేదం 
కర్నూలు వైఎస్సార్‌సీపీలో కొత్త జోష్‌ వచ్చింది. కర్నూలు సమన్వయకర్తగా ఇంతియాజ్‌ను నియమించారు. ఈ నియామకం టీజీ కుటుంబంలో నిర్వేదాన్ని నింపింది. ఇంతియాజ్‌ మామ, డాక్టర్‌ ఇస్మాయిల్‌ మైనార్టీ వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. టీజీ కుటుంబం గెలుపులో ఇస్మాయిల్‌ కీలకంగా పని చేశారు. మెజార్టీ మైనార్టీ ఓట్లు టీజీ కుటుంబానికి పోలయ్యేలా చూడటంలో గతంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఇంతియాజ్‌కు టిక్కెట్‌ దక్కడంతో మైనార్టీ వర్గం మొత్తం ఏకమైంది. ఇంతియాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనే చర్చ మైనార్టీ వర్గాల్లో నడుస్తోంది.

దీంతో మైనార్టీ ఓట్లు పూర్తిగా టీజీ కుటుంబానికి దూరమైనట్లే. ఇంతియాజ్‌కు మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో మంచిపేరు ఉంది. పైగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగుంటుందనే చర్చ విద్యావంతుల్లో కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, మేయర్‌ రామయ్య అంతా సమష్టిగా ఇంతియాజ్‌ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ పరిణామాలతో వైఎస్సార్‌సీపీలో జోష్‌ ఉంటే, టీజీ కుటుంబం నిర్వేదంలో కనిపిస్తోంది. 

ఆలూరులో తలనొప్పిగా పోలీస్‌ పంచాయితీ! 
ఆలూరు టిక్కెట్‌ కోసం కోట్లసుజాతమ్మ తీవ్రంగా యత్నిస్తున్నారు. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమెకు దాదాపుగా టిక్కెట్‌ లేనట్లేనని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ కూడా బోయ వర్గానికి టిక్కెట్‌ ఇవ్వాలనే యోచన చేస్తోంది. ఈ క్రమంలో ఓ డీఎస్పీని సంప్రదించినట్లు తెలుస్తోంది. డీఎస్పీ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాకీ చొక్కా తీసేసి, ఖద్దరు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. డీఎస్పీ చేరికను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుజాతమ్మ, వైకుంఠం, వీరభద్రగౌడ్‌లో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని ముగ్గురూ గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీకి సంబంధం లేని వారికి ఇస్తే తాము కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

ఆ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పునకు నిర్ణయం 
14 నియోజకవర్గాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ తక్కిన 5 స్థానాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలో తిక్కారెడ్డి స్థానంలో రాఘవేంద్రకు, ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి స్థానంలో మాచాని సోమనాథ్, నందికొట్కూరులో ప్రస్తుతం ఉన్న జయసూర్య, కాకరవాడ వెంకటస్వామి, బండి జయరాజు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వీరి ముగ్గురూ కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. పైగా నందికొట్కూరుకు మరో సమస్య తలెత్తింది. 

పాణ్యం, నంద్యాల ఎంపీ స్థానాలు ఆశించి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. కార్యకర్తల సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే పాణ్యం టిక్కెట్‌ ఖరారు చేయడంతో బైరెడ్డి డైలమాలో పడ్డారు. చివరకు నంద్యాల ఎంపీతో పాటు నందికొట్కూరు టిక్కెట్‌ తాము చెప్పిన అభ్యరి్థకి ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నందికొట్కూరు టిక్కెట్‌ ఆశిస్తోన్న ముగ్గురు కాదని మరో వ్యక్తి తెరపైకి వచ్చే అవకాశమూ ఉంది.

 ఇంకోవైపు ఏవీ సుబ్బారెడ్డి, రియల్టర్‌ నరసింహారావు కూడా ఎంపీ టిక్కెట్‌ కోసం గట్టిగానే ప్రయతి్నస్తున్నారు. డబ్బు మూటలే అర్హతగా టీడీపీ చూస్తుండటంతో మాండ్ర శివానందరెడ్డి, ఏవీ కంటే నరసిహంహారావు ఎక్కువగా డబ్బులు పెట్టుకునే శక్తి ఉండటం, బలిజ సామాజికవర్గం కావడంతో ఇతని పేరు కూడా కీలకంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి డబ్బు మూటలు సర్దే కోవెలకుంట్లకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ ఇతని పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇక ఆదోనిలో మీనాక్షినాయుడు కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక సీటైనా కావాలని జనసేన పట్టుబట్టడంతో ఆదోని ఇచ్చే యోచన చేస్తోంది. ఇక్కడ టీజీ విశ్వప్రసాద్‌ లేదా అతను మద్దతు ఇచ్చిన వ్యక్తికి టిక్కెట్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement