
మాట్లాడుతున్న కంగాటి శ్రీదేవి
కర్నూలు, వెల్దుర్తి: టీడీపీ అంతం పత్తికొండలో వైఎస్సార్‌సీపీ గెలుపుతోనే ప్రారంభమవుతుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గోవర్ధనగిరి గ్రామంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కేఈ కుటుంబంపై ప్రజా వ్యతిరేకత ఎప్పుడో ప్రారంభమైందన్నారు. వారి అవినీతి, అక్రమాలను చూసి టీడీపీ కార్యకర్తలే చీదరించుకుంటున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. తీవ్ర కరువుతో అల్లాడుతూ ప్రజలు వలసబాట పడుతున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. రాజన్య రాజ్యం త్వరలోనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఖబడ్డార్..: ఇటీవల గోవర్ధనగిరి జన్మభూమిలో కేఈ కుటుంబీకులు, మండల నాయకుల విమర్శలపై కంగాటి శ్రీదేవి విరుచుకుపడ్డారు.తమ పార్టీ గురించి, తమ నాయకుడి గురించి, తమ కుటుం బం గురించి అవాకులు చవాకులు పేలితే కబడ్డార్ అంటూ హెచ్చరించారు. దౌర్జన్య పాలన ఎన్నాళ్లో సాగదని, ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. నవరత్నాలను నకలీరత్నాలని చెప్పే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. పింఛన్ రత్నాన్ని దొంగలించిన సీఎం చంద్రబాబు ను ఏమంటారని ప్రశ్నించారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.