బీసీల పంతం.. టీడీపీ అంతం | YSRCP Leaders Relese BC Garjana Poster in Kurnool | Sakshi
Sakshi News home page

బీసీల పంతం.. టీడీపీ అంతం

Published Tue, Feb 12 2019 1:32 PM | Last Updated on Tue, Feb 12 2019 1:42 PM

YSRCP Leaders Relese BC Garjana Poster in Kurnool - Sakshi

బీసీ గర్జన పోస్టర్‌ విడుదల చేస్తున్న బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పుల్లయ్య

కర్నూలు(రాజ్‌విహార్‌): రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అంతం చేయడమే బీసీల పంతం అని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఏలూరులో 17వ తేదీన  చేపట్టనున్న బీసీ గర్జనకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జాబితాలోని అన్ని కులాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వంచించారన్నారు. ఎన్నికల వేళ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో 57 నెలలు ఉన్న ఆయన.. ఎన్నికలకు రెండు నెలల ముందు 22 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదరణ పథకం కింద తుప్పుపట్టిన పనిముట్లు పంపిణీ చేసి బీసీల జీవన ప్రమాణాలను మరింత దిగజార్చారన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతానని చెబుతున్న పథకాలను కాపీ కొట్టడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీల సమస్యలను తెలుసుకుందన్నారు. అందులో భాగంగా 17వ తేదీ ఏలూరులో లక్ష మంది బీసీలతో భారీ బీసీ గర్జన నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ సభలోనే బీసీ డిక్లరేషన్‌ను తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేయనున్నారని స్పష్టం చేశారు.  

బాబు గుండెల్లో రైళ్లు
ఏలూరులో ఈ నెల 17వ తేదీన నిర్వహించే బీసీ గర్జనతో సీఎం చంద్రబాబు నాయుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయని బీసీ అధ్యయన కమిటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పుల్లయ్య అన్నారు. సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలని కోరిన బీసీలను చంద్రబాబు కించపరిచేటా మాట్లాడారన్నారు. నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తారని, మత్స్యకారులకు తాట తీస్తానని హెచ్చరికలు జారీచేసేలా మాట్లాడి వారి మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారన్నారు. అంతేకాక ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని దళితులను కించపరిచేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

వైఎస్‌ జగన్‌తోనే బీసీల సంక్షేమం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఏలూరులో ఈనెల 17వ తేదీన జరిగే బీసీ గర్జనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీసీలు భారీగా తరిలివచ్చి విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని, అయన అధికారంలోకి వస్తే.. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతారని స్పష్టం చేశారు.  కార్యక్రమంలో బీసీ విభాగం నాయకలు నర్సింహులు యాదవ్, హనుమంత రెడ్డి, గోపాల్‌రెడ్డి, శివశంకర్‌ నాయుడు, బుట్టా రంగయ్య, ధనుంజయ ఆచారి, సత్యం యాదవ్, రియల్‌ టైమ్‌ నాగరాజు యాదవ్, గోపినాథ్‌ యాదవ్, ఓసీఎం రంగ, బీసీ నాయకులు డికె రాజశేఖర్, కోనేటి వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌ తదితరుల పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement