విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవై రామయ్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక తమ పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, సమన్వయ కర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు మండల కన్వీనర్ రేమట మునిస్వామిపై సోమవారం టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని చెప్పడంతోనే తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఆస్వాధిస్తున్నట్లు చెప్పారు. దీనిని టీడీపీ నాయకులు ఓర్వలేక తమ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. జిల్లా ప్రజలు టీడీపీని నామరూపాలు లేకుండా చేశారని, దీనిని ఆ పార్టీ నాయకులు దృష్టిలో ఉంచుకుని హుందాగా వ్యవహరించాలని సూచించారు. కాదని తమ పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పటి నుంచైనా కక్షలు, కార్పణ్యాలను వీడి ప్రజల మనసును గెలుచుకునేందుకు యత్నించాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు.
దాడులు చేస్తే ఊరుకోం: ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్, సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ముఖ్యంగా కర్నూలు మండలంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓడిపోయామనే అక్కసుతో టీడీపీ నాయకులు దౌర్జాన్యాలు చేస్తే ప్రజలు శాశ్వతంగా సమాధి కడతారని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడుల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రేమట మునిస్వామిపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి 36 వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ ముందున్న ఏకైక లక్ష్యం నవరత్నాలను ఇంటింటికీ తీసుకెళ్లడమేనని, అందులో భాగంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. వచ్చే స్థానికి సంస్థల ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో అన్ని స్థానాలను స్వీప్ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేణుకమ్మ, నాయకులు మునిస్వామి, వెంకటేశ్వర్లు, చిన్న లక్ష్మన్న, సతీష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, గంగాధరరెడ్డి, ఎదురూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment