ఆర్డీఎస్ రగడ
గద్వాల: ఆదినుంచీ అదే రగడ.. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) నీటి వివాదం మరోసారి రాజుకుంది. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై హెడ్‌వర్క్స్ వద్ద స్పిల్‌వే గోడపై కాంక్రీట్ పనులను ఆదివారం కర్నూలు రైతుల బృందం అడ్డుకుంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునికీకరణకు రూ.92 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హెడ్‌వర్క్స్‌లో స్పిల్‌వేగోడపై అరడుగు మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది.
రాయిచూర్ జిల్లా వైపు వంద అడుగుల మేర కాంక్రీట్‌ను గతేడాది వేశారు. ప్రస్తుతం కుడివైపు కర్నూలు జిల్లా నుంచి కాంక్రీట్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించాడు. కాగా, విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి నేతృత్వంలో రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నారు.
ఇదీ ఆర్డీఎస్ క(వ్య)థ..!
ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 87,500ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. స్లూయీజ్ రంధ్రాలు కాల్వలు అధ్వానంగా మారడంతో 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీనికితో డు 1992లో ఆర్డీఎస్ స్లూయీజ్ రంధ్రాల కర్రషట్టర్లను రాయలసీమ ప్రాంతానికి చెం దిన కొందరు నాటు బాంబులతో బద్దలుకొట్టారు. స్పందించిన ప్రభుత్వం ఇనుపషట్టర్లను ఏర్పాటు చేయించింది.
ఈ ఘటన అ ప్పట్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతుల మధ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ క్రమంలో కర్నూలు రైతులు తుంగభద్ర నదికి కుడివైపున తాగునీటి పథకాలు, వ్యవసాయ అవసరాలకు నీళ్లు రాకుండా షట్టర్ల ద్వారా అడ్డుకుంటున్నారని, వాటిని తగ్గించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
2002లో అప్పటి ప్రభుత్వం షట్టర్ల వ ద్ద మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరుచేసింది. కర్ణాటక అధికారులు పనులు ప్రారంభించిగా కర్నూలు రైతులు అడ్డుకున్నారు. ఇదిలాఉండగా, దశాబ్దాలు గా నలుగుతున్న ఆర్డీఎస్ సమస్యకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరి ష్కారం చూపుతామని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీఇచ్చారు.
ఆ మాదిరిగానే 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరుచేశారు. ఇందులో కర్ణాటకలో రూ.72 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో రూ.20కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రభుత్వం స్పందించాలి
ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడం సరికాదు. ఎవరికి నష్టం చేసే పనుల్లేవు. కేవలం అక్కడి ప్రాంత రైతుల మెప్పు కోసమే నాయకులు అలా చేస్తున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చిన నిధుల ఆధునికీకరణ పనులు కొనసాగుతుంటే అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సుంకేసుల బ్యారేజీని తొలగించి నీటిమళ్లింపు పథకంలా పాత లెవల్‌లోనే ఉండేలా చర్యలు చేపట్టాలి.
- తనగల సీతారాంరెడ్డి,ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్