head works
-
పోలవరం హెడ్‌వర్క్స్, హైడల్ కేంద్రాలకు ‘రివర్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్ల అంచనా విలువతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్ డాక్యుమెంట్‌ను అప్లోడ్ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచే డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 20వతేదీ ఉదయం 11 గంటల వరకు బిడ్ దాఖలు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలు మాత్రమే బిడ్ దాఖలు చేసుకోవాలనే నిబంధనను అడ్డుపెట్టుకుని నోటిఫికేషన్ జారీచేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి టెండర్ల విధానాన్ని అపహాస్యం చేసింది. పోటీ లేకపోవడం వల్ల అధిక ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంతో ఖజానాపై తీవ్ర భారం పడింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో పోటీపడేలా దేశంలో ఎక్కడ రిజిస్టర్ చేసుకున్న కాంట్రాక్టు సంస్థలైనా సొంతంగా లేదా జాయింట్ వెంచర్‌గా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. బిడ్ దాఖలుకు అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థలు స్వీయ ధ్రువీకరణ హామీపత్రాన్ని సమర్పించాలి. తప్పుడు హామీపత్రం అందచేస్తే కాంట్రాక్టు సంస్థ బ్యాంకు గ్యారంటీ (అంచనా విలువలో 2.5 శాతం అంటే రూ.124.68 కోట్లు), ఈఎండీ(అంచనా విలువ ఒక శాతం అంటే రూ.49.87 కోట్లు)ని వెరసి రూ.174.55 కోట్లను జప్తు చేస్తారు. ► ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్లో నిర్వహించే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పారదర్శకతకు నిలువుటద్దంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఈనెల 21న ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) అందజేయాలి. 23న ఆర్థిక బిడ్ తెరుస్తారు. ► అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థను ఎల్–1గా ఎంపిక చేస్తారు. ► ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎల్–1 సంస్థకే పనులు అప్పగించాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి ప్రతిపాదన పంపి ఆమోదిస్తే టెండర్‌ను ఖరారు చేస్తారు. ► రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో ఎల్–1గా నిలిచిన సంస్థ పేరును గోప్యంగా ఉంచుతారు. కేవలం ఆ సంస్థ కోట్ చేసిన ధరను మాత్రమే టెండర్లో పాల్గొన్న మిగతా సంస్థలకు కనిపించేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ► ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరనే అంచనా విలువగా పరిగణించి ఈనెల 23న మధ్యాహ్నం ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ► ఒక్కో స్లాట్‌ను 15 నిమిషాల చొప్పున విభజించి ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే కాంట్రాక్టర్ ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధర కన్నా 0.5 శాతం తక్కువ కాకుండా కోట్ చేయాలి. ► ఈ–ఆక్షన్‌కు నిర్దేశించిన 2.45 గంటల సమయం ముగిశాక అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా, ఆ తర్వాత తక్కువ ధరకు కోట్ చేసిన వారిని ఎల్–2, ఎల్–3, ఎల్–4, ఎల్–5లుగా ఖరారు చేస్తారు. ► ఈఎండీని జప్తు చేసి ఎల్–2గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరను అంచనా విలువగా పరిగణించి మళ్లీ ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. టెండర్ షెడ్యూలు ఇదీ.. బిడ్ డాక్యుమెంట్ డౌన్లోడ్: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట నుంచి బిడ్ల స్వీకరణ: ఈనెల 5న మధ్యాహ్నం 1 గంట తర్వాత బిడ్ దాఖలుకు తుది గడువు: ఈనెల 20 ఉదయం 11 గంటల్లోగా ప్రీ–బిడ్ మీటింగ్: ఈనెల 11న ఉదయం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ ఎస్ఈ కార్యాలయంలో ప్రీ–బిడ్ సమావేశంలో వ్యక్తమైన సందేహాల నివృత్తి: ఈనెల 16న ప్రీ–క్వాలిఫికేషన్ స్టేజ్: ఈనెల 21న ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్ ఓపెన్: ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఈ–ఆక్షన్(రివర్స్ టెండరింగ్ నిర్వహణ: ఈ నెల 23న ఉదయం మధ్యాహ్నం 1 గంట తర్వాత టెక్నికల్ బిడ్: అక్టోబర్ 1 టెండర్ ఖరారు -
అక్రమ చెల్లింపులకు హైలెవల్ కుట్ర
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో మరో దోపిడీకి సీఎం చంద్రబాబు తెరతీశారు. అక్టోబర్ 7, 2016 నుంచి జనవరి, 2018 వరకూ చేసిన పనులకు అదనంగా రూ.213 కోట్లు ఇవ్వాలన్న టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ‘ట్రాన్స్ట్రాయ్’ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని ఉన్నత స్థాయి కమిటీపై ఒత్తిడి తెస్తున్నారు. పెంచిన అంచనా వ్యయం మేరకు ట్రాన్స్ట్రాయ్ చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని.. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి కమిటీ స్పష్టం చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించడానికి సంబంధించిన ప్రతిపాదనను మంగళవారం నిర్వహించే కేబినెట్ సమావేశానికి పంపాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే పోలవరం హెడ్ వర్క్స్‌ను రూ.4054 కోట్లకు ట్రాన్స్ట్రాయ్ దక్కించుకుంది. కానీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు ట్రాన్స్‌ట్రాయ్‌తో అక్టోబర్ 7, 2016న జలవనరుల శాఖ అనుబంధ ఒప్పందం (సప్లిమెంటరీ అగ్రిమెంట్) చేసుకుంది. అక్టోబర్ 7, 2016 నుంచి ఆ సంస్థను 60సీ నిబంధన కింద తొలగించే వరకూ.. చేసిన పనులకు రూ.2,362.22 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. అంటే 2015–16 ధరల ఆధారంగా పెంచేసిన అంచనా వ్యయం మేరకే బిల్లులు చెల్లించినట్లుగా స్పష్టమవుతోంది. సబ్ కాంట్రాక్టర్లకు రూ.418 కోట్ల బకాయిలు.. అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి.. మట్టి పనులు త్రివేణి ఎర్త్ మూవర్స్‌కు, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పునాది(డయా ఫ్రమ్ వాల్)పనులు ఎల్అండ్టీ–బావర్, కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్) పనులు కెల్లర్, కాంక్రీట్ పనులు ఫూట్జ్‌మీస్టర్, పెంటా, గేట్ల పనులు బీకెమ్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లులు చెల్లించేటపుడు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. అయితే పనులు చేసిన సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ట్రాయ్ బిల్లులు చెల్లించలేదు. ఇదే అంశంపై సబ్ కాంట్రాక్టు సంస్థలు పలు సందర్భాల్లో ఆందోళన చేశాయి.. ఈ బకాయిలు సుమారు రూ.418 కోట్లకుపైగా ఉంటాయన్నది అంచనా. బకాయిలను చెల్లించకపోవడంతో జనవరి, 2018 నాటికి సబ్ కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. దాంతో.. ట్రాన్స్ట్రాయ్పై 60సీ నిబంధన కింద వేటు వేసి గేట్ల పనులు బీకెమ్‌కు, మిగతా పనులన్నీ నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగించేయడం ద్వారా చంద్రబాబు భారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్ బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు ఫిర్యాదు చేసింది. డీఆర్ఐ రంగంలోకి దిగితే తన కమీషన్ల బాగోతం బయటపడుతుందని ఆందోళనకు గురైన చంద్రబాబు, ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్ల మధ్య బకాయిల పంచాయతీని తేల్చడానికి గత నెల 13న ఈఎన్సీ (ఇంజనీర్–ఇన్–చీఫ్) అధ్యక్షతన నలుగురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి.. పోలవరం హెడ్ వర్క్స్‌లో తాము చేసిన పనులకు జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ల ప్రకారం అదనపు బిల్లులు ఇవ్వాలని ఇటీవల ట్రాన్స్ట్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సెప్టెంబరు 7, 2016న పెంచిన అంచనా వ్యయం ప్రకారం తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని పేర్కొంది. రూ.213 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని కోరింది. ఈ ప్రతిపాదనను ఉన్నత స్థాయి కమిటీకి పంపిన సీఎం చంద్రబాబు.. దానిపై ఆమోదముద్ర వేయాలని ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే చెల్లించామని.. అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు అదనపు బిల్లులు చెల్లించాలని సిఫార్సు చేస్తూ కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపాలని జలవనరుల శాఖను ఆదేశించారు. మంగళవారం నిర్వహించే కేబినెట్లో అదనపు బిల్లులు చెల్లించడానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అదనంగా చెల్లించే బిల్లులతోనే సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన వాటిలో 50 శాతం చెల్లించి వారి మధ్య బకాయిల పంచాయతీని తేల్చేయాలని భావిస్తున్నారు. -
ఆర్డీఎస్ పనులకు సహకరించండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) హెడ్‌వర్క్స్ వద్ద ఆనకట్టను పటిష్ట పరిచేందుకు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు తగులుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం రాయచూర్‌కు వెళ్లి అక్కడి జిల్లా కలెక్టర్ వి.వి.జ్యోష్ణతో సమావేశమయ్యారు. ఆర్డీఎస్ అనకట్ట వద్ద పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నెలకొన్న పరిస్థితులను ఇప్పటికే తమ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు రాయచూర్ కలెక్టర్ జోష్ణ వెల్లడించారు. పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణను అందిస్తామని హామీ ఇచ్చారు. 2006లో ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచన మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట పటిష్ట పరిచాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి నాలుగో ప్యాకేజీ వరకు పనులు నిర్వహించే బాధ్యతను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పటికే రెండు నుంచి నాలుగో ప్యాకేజీ పనులు పూర్తికాగా ఒకటో ప్యాకేజీ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు చెబుతున్నారు. రక్షణ కల్పిస్తే తప్ప ఒకటో ప్యాకేజీ పనులు చేపట్టలేనంటూ కర్ణాటకకు చెందిన కాంట్రాక్టు సంస్థ ప్రభు కన్స్ట్రక్షన్స్ చేతులెత్తేసింది. పని ప్రదేశంలో రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ రాయచూర్ కలెక్టర్, ఎస్పీని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు స్వయంగా వెళ్లి రాయచూర్ కలెక్టర్‌తో జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ భేటీ అయ్యారు. సమావేశంలో రాయచూర్ ఎస్పీ ఎం.ఎన్.నాగరాజు, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ రగడ
గద్వాల: ఆదినుంచీ అదే రగడ.. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) నీటి వివాదం మరోసారి రాజుకుంది. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై హెడ్‌వర్క్స్ వద్ద స్పిల్‌వే గోడపై కాంక్రీట్ పనులను ఆదివారం కర్నూలు రైతుల బృందం అడ్డుకుంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునికీకరణకు రూ.92 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హెడ్‌వర్క్స్‌లో స్పిల్వేగోడపై అరడుగు మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది. రాయిచూర్ జిల్లా వైపు వంద అడుగుల మేర కాంక్రీట్‌ను గతేడాది వేశారు. ప్రస్తుతం కుడివైపు కర్నూలు జిల్లా నుంచి కాంక్రీట్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించాడు. కాగా, విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి నేతృత్వంలో రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఇదీ ఆర్డీఎస్ క(వ్య)థ..! ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 87,500ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. స్లూయీజ్ రంధ్రాలు కాల్వలు అధ్వానంగా మారడంతో 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీనికితో డు 1992లో ఆర్డీఎస్ స్లూయీజ్ రంధ్రాల కర్రషట్టర్లను రాయలసీమ ప్రాంతానికి చెం దిన కొందరు నాటు బాంబులతో బద్దలుకొట్టారు. స్పందించిన ప్రభుత్వం ఇనుపషట్టర్లను ఏర్పాటు చేయించింది. ఈ ఘటన అ ప్పట్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతుల మధ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ క్రమంలో కర్నూలు రైతులు తుంగభద్ర నదికి కుడివైపున తాగునీటి పథకాలు, వ్యవసాయ అవసరాలకు నీళ్లు రాకుండా షట్టర్ల ద్వారా అడ్డుకుంటున్నారని, వాటిని తగ్గించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. 2002లో అప్పటి ప్రభుత్వం షట్టర్ల వ ద్ద మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరుచేసింది. కర్ణాటక అధికారులు పనులు ప్రారంభించిగా కర్నూలు రైతులు అడ్డుకున్నారు. ఇదిలాఉండగా, దశాబ్దాలు గా నలుగుతున్న ఆర్డీఎస్ సమస్యకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరి ష్కారం చూపుతామని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీఇచ్చారు. ఆ మాదిరిగానే 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరుచేశారు. ఇందులో కర్ణాటకలో రూ.72 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో రూ.20కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించాలి ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడం సరికాదు. ఎవరికి నష్టం చేసే పనుల్లేవు. కేవలం అక్కడి ప్రాంత రైతుల మెప్పు కోసమే నాయకులు అలా చేస్తున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చిన నిధుల ఆధునికీకరణ పనులు కొనసాగుతుంటే అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సుంకేసుల బ్యారేజీని తొలగించి నీటిమళ్లింపు పథకంలా పాత లెవల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలి. - తనగల సీతారాంరెడ్డి,ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్