సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్) హెడ్‌వర్క్స్ వద్ద ఆనకట్టను పటిష్ట పరిచేందుకు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్‌డీఎస్ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు తగులుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం రాయచూర్‌కు వెళ్లి అక్కడి జిల్లా కలెక్టర్ వి.వి.జ్యోష్ణతో సమావేశమయ్యారు.
ఆర్‌డీఎస్ అనకట్ట వద్ద పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌డీఎస్ ఆనకట్ట వద్ద నెలకొన్న పరిస్థితులను ఇప్పటికే తమ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు రాయచూర్ కలెక్టర్ జోష్ణ వెల్లడించారు. పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణను అందిస్తామని హామీ ఇచ్చారు. 2006లో ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచన మేరకు ఆర్‌డీఎస్ ఆనకట్ట పటిష్ట పరిచాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి నాలుగో ప్యాకేజీ వరకు పనులు నిర్వహించే బాధ్యతను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు.
ఇప్పటికే రెండు నుంచి నాలుగో ప్యాకేజీ పనులు పూర్తికాగా ఒకటో ప్యాకేజీ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు చెబుతున్నారు. రక్షణ కల్పిస్తే తప్ప ఒకటో ప్యాకేజీ పనులు చేపట్టలేనంటూ కర్ణాటకకు చెందిన కాంట్రాక్టు సంస్థ ప్రభు కన్‌స్ట్రక్షన్స్ చేతులెత్తేసింది. పని ప్రదేశంలో రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ రాయచూర్ కలెక్టర్, ఎస్పీని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు స్వయంగా వెళ్లి రాయచూర్ కలెక్టర్‌తో జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ భేటీ అయ్యారు. సమావేశంలో రాయచూర్ ఎస్పీ ఎం.ఎన్.నాగరాజు, మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్ పాల్గొన్నారు.
ఆర్‌డీఎస్ పనులకు సహకరించండి
Published Fri, Jul 25 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement