బెంగ తీర్చే ‘తుంగ’.. కృష్ణమ్మ ఉత్తుంగ   | Tungabhadra River Water Inflow Increased At Kurnool | Sakshi
Sakshi News home page

బెంగ తీర్చే ‘తుంగ’.. కృష్ణమ్మ ఉత్తుంగ  

Published Thu, Aug 8 2019 10:55 AM | Last Updated on Thu, Aug 8 2019 10:56 AM

Tungabhadra River Water Inflow Increased At Kurnool - Sakshi

తుంగ ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తి టీబీ డ్యాంకు నీటిని వదులుతున్న దృశ్యం 

సాక్షి, కర్నూలు : బెంగ తీర్చడానికి ‘తుంగ’ ఉధృతంగా ముందుకు సాగుతోంది. ‘తుంగభద్రమ్మ’ను చేరుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు కృష్ణమ్మ ఉత్తుంగ తరంగమై మహోధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలాన్ని వేగంగా నింపుతూ..ముందుకు కదలడానికి సమాయత్తమవుతోంది. ఈ పరిణామాలతో  ‘సీమ’ రైతుల గుండెల్లో సంతోషం ఉప్పొంగుతోంది.

అప్పర్‌ తుంగ నుంచి భారీ వరద 
ఇన్నాళ్లూ హెచ్చుతగ్గుల నీటి చేరికతో ఉన్న తుంగభద్ర డ్యాంలోకి ప్రస్తుతం భారీ ప్రవాహం మొదలుకానుంది. ఎగువన శివమొగ్గ జిల్లాలో నిర్మించిన అప్పర్‌ తుంగ(గాజనూరు) ప్రాజెక్ట్‌ నుంచి దిగువకు 95,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు గురువారం సాయంత్రానికి తుంగభద్ర జలాశయానికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి  ఇన్‌ఫ్లో 40,781 క్యూసెక్కులు ఉంది. అప్పర్‌ తుంగ ప్రాజెక్ట్‌ నుంచి విడుదలయిన నీటితో గురువారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటవచ్చని జలాశయం అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమలలోని వర్శపర్వతాలతో పాటు చిక్‌మగళూరు, హావేరి జిల్లాల్లో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తుంగ నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. తుంగ డ్యాంలోకి 95,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 3.24 టీఎంసీలు. డ్యాంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు 20 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

భద్రలోనూ పోటెత్తిన వరద 
శివమొగ్గ జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షాలతో భద్ర నదిలోనూ వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. భద్రావతి వద్ద నిర్మించిన భద్ర ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో బుధవారం 41,487 క్యూసెక్కులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో భారీగా ఉండడంతో నీటి నిల్వ 38 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్‌ నీటి నిల్వ సామర్థ్యం 63 టీఎంసీలు. మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో భద్ర నుంచి కూడా దిగువన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.  ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1610.8 అడుగుల వద్ద 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 40,781 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో 1011 క్యూసెక్కులు. జలాశయంలోకి భారీ వరద ప్రవాహాన్ని అంచనా వేసిన కర్ణాటక ఇరిగేషన్‌ అధికారులు బుధవారం కర్ణాటక పరిధిలోని ఎల్లెల్సీ కుడి, ఎడమ కాలువలు, రాయబసవన కెనాల్, విజయనగర కెనాల్‌ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో జిల్లా ఇరిగేషన్‌ అధికారులు కూడా తుంగభద్ర దిగువ కాలువ కింద ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఖరీఫ్‌ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పోటెత్తుతున్న కృష్ణమ్మ
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. నదిలో నీటి ప్రవాహం సుమారు 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. ఆల్మట్టి డ్యాంకు ఎగువ భాగంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో నీటి ప్రవాహం ఉంది. వచ్చిన నీటినంతా ఆల్మట్టి గేట్లన్నీ పైకెత్తి దిగువకు వదిలేస్తున్నారు.  అలాగే నారాయణపూర్‌ జలాశయం నుంచి 4.65 లక్షల క్యూసెక్కులు, జూరాల నుంచి 3,41,512 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 872.70 అడుగుల నీటి మట్టంతో 153.16 టీఎంసీల నీరు నిల్వఉంది. డ్యాంలోకి ఎగువ నుంచి వస్తున్న నీరు నేటి ఉదయానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉంది. ఫలితంగా డ్యాంలో నీటినిల్వ 175 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. ఎగువ నుంచి వచ్చే నీటిని బట్టి శుక్రవారం ఉదయానికి 205 టీఎంసీలకు చేరితే గేట్లు ఎత్తి దిగువకు వదిలేందుకు ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ సాగర్‌ వైపు 74,496 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా బుధవారం సాయంత్రానికి 10 వేల క్యూసెక్కుల వరద జలాలను, హంద్రీ–నీవా ద్వారా 1013 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి స్కీమ్‌ ద్వారా 1,600 క్యూసెక్కులు, ముచ్చుమర్రి లిఫ్ట్‌ ద్వారా కేసీకి 245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement