పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయండి : నాగం
నాగర్‌కర్నూల్ : జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి 8లక్షల ఎకరాలకు సాగునీరందించాలని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ పీఆర్ అతిధిగృహంలో బుధవారం ఆయన విలేకరుతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. 1944లోనే తుంగభద్ర నదీజలాలపై ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్ రాష్ట్రానికి లక్ష, మద్రాస్ రెసిడెన్సీకి లక్ష ఎకరాలకు నీరందించాలని, ఆర్డీఎస్ ఎత్తు పెంచి పాలమూరు జిల్లాలో 87 వేల ఎకరాలకు నీరివ్వాల్సిందిగా ఒప్పందం జరిగిందని, అనుమానం ఉంటే ఆంధ్ర ప్రభుత్వం నిజాంకాలం నాటి పత్రాలను చూడాలని సూచించారు.
1956లో అప్పర్ కృష్ణ, భీమా రూపకల్పన జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రెండోపంచవర్ష ప్రణాళికలో నిధుల మంజూరుకు ఒప్పుకుందని, ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులుగా నిర్మించాలనుకున్న వీటి ద్వారా రంగారెడ్డి, పాలమూరు జిల్లాలో 14లక్షల ఎకరాలకు నీరందేదన్నారు. కానీ ఆంధ్రా పాలకులు దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్టులు చేపట్టలేదని గుర్తుచేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాలైన పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని భూములకు నీరిచ్చిన తర్వాతే కృష్ణా నీటిని వేరే చోటికి తరలించాలన్నారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి,లక్ష్మీనారాయణ, నసీర్, షఫీ పాల్గొన్నారు.