sunkesula reservoir
-
అడుగంటిన సుంకేసుల
కర్నూలు, గూడూరు: సుంకేసుల రిజర్వాయర్ అడుగంటి పోయింది. ఫలితంగా కర్నూలునగర ప్రజలతో పాటు తుంగభద్ర నదీతీరంలోని 30 గ్రామాల ప్రజలకు తాగునీటి ముప్పు ఏర్పడనుంది. సుంకేసుల రిజర్వాయర్ సామర్థ్యం 1.20 టీఎంసీలు. ఆదివారానికి 0. 28 టీఎంసీ నీటి నిలువ మాత్రమే ఉంది. ఈ నీరు మరో 15 రోజుల వరకు మాత్రమే సరి పోతుందని డ్యామ్ అధికారులు అంచనా వేస్తున్నారు. సుంకేసుల పై ప్రాంతం నుంచి నీటి నిల్వ ఏ మాత్రం లేదని, అకాల వర్షాలు పడితే తప్ప రిజర్వాయర్‌కు నీటి చేరిక రాదని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని అధికారులు.. సుంకేసుల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గి పోతున్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులు దృష్టి సారించడం లేదు. హొస్పెట్లోని టీబీ డ్యామ్ అధికారులతో ఉన్నతాధి కారులు మాట్లాడి తుంగభద్ర నదికి నీటిని విడిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లీకేజీ నీరే గతి: గూడూరు పట్టణంలో తాగు నీటి ఎధ్దడి ఎక్కువగా ఉంది. పడమర బీసీ కాలనీ, పడఖాన వీధి, సంజావయ్య నగర్, తూర్పు బీసీ కాలనీ, దైవం కట్ట, తెలుగు వీధి, తదితర ప్రాంతాల్లో చుక్క నీరు దొరకడం లేదు. పడమర బీసీ కా>లనీలో పైప్‌లైన్ లీకేజీ నీటినే కాలనీ వాసులు తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. నంద్యాల నీటి పథకం గ్రామాలలో తీవ్ర నీటి ఎద్దడి సుంకేసుల కేంద్రంగా పనిచేస్తున్న నంద్యాల నీటి పథకం నుంచి గూడూరు, కోడుమూరు, కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలోని 30 గ్రామాలకు నీరు అందుతుంది. సుంకేసుల రిజర్వాయర్ అడుగంటి పోతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తాగునీరు అందడం లేదు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలుకు జీడీపీ నీరు ఇస్తున్నాం:సుంకేసుల రిజర్వాయర్ నుంచి కర్నూలుకు ప్రతి రోజూ 104 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నాం. అలాగే జీడీపీ నీరు కూడా 50 క్యూసెక్కులు అందిస్తున్నాం. తాగునీటి ఇభ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి, జేఈ, సుంకేసుల -
సుంకేసుల నుంచి నిలిచిన నీటి విడుదల
నంద్యాలకు తప్పని తాగునీటి కష్టాలు నంద్యాల: సుంకేసుల రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటి విడుదల నిలిచిపోయింది. గత వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెల 9వ తేదీన సుంకేసుల డ్యాం వద్ద 500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నీటితో పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు గట్టెక్కుతాయని చైర్పర్సన్ దేశం సులోచన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. నీటిని విడుదల చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే 9వ తేదీ విడుదల చేసిన నీరు 13వ తేదీ సాయంత్రం నంద్యాలకు చేరింది. ఈ నీటిలో చిన్న చెరువును సగం నింపారు. పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకులను నింపడానికి అధికారులు ఏర్పాటు చేస్తుండగా.. సుంకేసుల నుంచి నీటి సరఫరాను నిలిపి వేశారు. సుంకేసులకు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో నీటి విడుదలను నిలిపి వేశారని డీఈ షాకీర్ హుసేన్ తెలిపారు. ప్రస్తుత ం నంద్యాలలోని పాత, కొత్త ఎస్ఎస్ ట్యాంకుల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరింది. వీటికి నీరు చేరకుంటే నంద్యాల ప్రజలు దాహం తో అల్లాడాల్సిందే. విభేదాల కారణంగా స్థానిక టీడీపీ నేతలు ప్ర‘జల’ కష్టాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
వేసవిలో తాగునీటి గండం
►మార్చి నెలాఖరుకు సుంకేసుల ఖాళీ ►ఏప్రిల్ నుంచి కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి సమస్య ►ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే తీరనున్న దాహం ►సుంకేసుల రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు కర్నూలు(అర్బన్) : కర్నూలు నగరానికి తీవ్ర తాగునీటి గండం పొంచి వుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సుంకేసులలో ఉన్న ఒక టీఎంసీ నీరు మార్చి 31 నాటికి ఖాళీ కానుంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగర ప్రజల గొంతు ఎండనుంది. ప్రతి ఏడాది వేసవిలో నగర ప్రజల దాహార్తిని సుంకేసుల జలాశయం తీరుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం కేసీ కెనాల్‌కు టీబీ డ్యామ్ నుంచి మన వాటా కోటాలో కోత పడడం.. సుంకేసుల జలాశయంలోని నీటిని ఇటు కర్నూలు, అటు మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాల ప్రజలు వాడుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో వేసవిలో నగర ప్రజలు తీవ్ర మంచి నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. తాగునీటి అవసరాల దృష్ట్యా సుంకేసుల జలాశయంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ వుంచుకొని మార్చి నెల ఒకటో తేదీ నుంచి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అయితే సుంకేసులలో నిల్వ వుంచి నీటిని పాలమూరు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కూడా రోజుకు 450 నుంచి 500 క్యూసెక్కుల నీటిని వాడుకునే అవకాశం వుంది. ఆయా ప్రాంతాల్లో 18 మంచి నీటి సరఫరా పథకాలు, దాదాపు 3 వేల పంప్ సెట్లు వున్నాయి. వీటికి ప్రతి రోజు నీటిని వాడుకునే అవకాశం వుంది. ఈ లెక్కన కర్నూలు నగరానికి రోజుకు 200 క్యూసెక్కులు, పాలమూరు జిల్లాకు 450 నుంచి 500 క్యూసెక్కులు వాడుకుంటే సుంకేసులలో నిల్వ వున్న ఒక టీఎంసీ నీరు మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. మిగిలిన ఏప్రిల్, మే నెలల్లో నగర ప్రజల దాహార్తి తీర్చే వారెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జూన్‌లో తొలకరి వర్షాలు కురిసేంతవరకు ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే.. సుంకేసుల జలాశయం నీటిని వాడుకుంటూనే.. మరో వైపు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నీటి పారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హంద్రీనీవా నీటితో గాజులదిన్నె ప్రాజెక్టును నింపి ఆ నీటిని కర్నూలుకు మళ్లిస్తే కొంత వరకు ఉపశమనం వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం అరకొరగానే హంద్రీనీవా నీటిని జీడీపీకి వదులుతున్నారని, అలా కాకుండా డ్యామ్‌ను పూర్తిగా నింపాలన్నారు. నగర ప్రజలకు రోజుకు 71.76 ఎంఎల్ అవసరం.. నగరంలోని దాదాపు 5 లక్షల జనాభాకు ప్రస్తుతం 71.76 మిలియన్ లీటర్ల (ఎంఎల్) నీరు అవసరముంది. వేసవిలో నీటి అసవరాలు మరింత పెరగనున్నాయి. అయితే ప్రస్తుతం 67 ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 85 శాతం ప్రాంతాల ప్రజలకు రోజుకు రెండు నుంచి మూడు గంటలు, మిగిలిన 15 శాతం ప్రాంతాల ప్రజలకు రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నట్లు నగర పాలక అధికారులు చెబుతున్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాజులదిన్నె నీటిపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని నగర పాలక నీటి సరఫరా విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.