వేసవిలో తాగునీటి గండం | Posed the problem of drinking water | Sakshi
Sakshi News home page

వేసవిలో తాగునీటి గండం

Published Tue, Feb 10 2015 2:27 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

వేసవిలో తాగునీటి గండం - Sakshi

వేసవిలో తాగునీటి గండం

►మార్చి నెలాఖరుకు సుంకేసుల ఖాళీ
►ఏప్రిల్ నుంచి కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి సమస్య
►ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే తీరనున్న దాహం
►సుంకేసుల రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు

 
 
కర్నూలు(అర్బన్) : కర్నూలు నగరానికి తీవ్ర తాగునీటి గండం పొంచి వుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సుంకేసులలో ఉన్న ఒక టీఎంసీ నీరు మార్చి 31 నాటికి ఖాళీ కానుంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగర ప్రజల గొంతు ఎండనుంది. ప్రతి ఏడాది వేసవిలో నగర ప్రజల దాహార్తిని సుంకేసుల జలాశయం తీరుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం కేసీ కెనాల్‌కు టీబీ డ్యామ్ నుంచి మన వాటా కోటాలో కోత పడడం.. సుంకేసుల జలాశయంలోని నీటిని ఇటు కర్నూలు, అటు మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాల ప్రజలు వాడుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో వేసవిలో నగర ప్రజలు తీవ్ర మంచి నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు.

తాగునీటి అవసరాల దృష్ట్యా సుంకేసుల జలాశయంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ వుంచుకొని మార్చి నెల ఒకటో తేదీ నుంచి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అయితే సుంకేసులలో నిల్వ వుంచి నీటిని పాలమూరు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కూడా రోజుకు 450 నుంచి 500 క్యూసెక్కుల నీటిని వాడుకునే అవకాశం వుంది. ఆయా ప్రాంతాల్లో 18 మంచి నీటి సరఫరా పథకాలు, దాదాపు 3 వేల పంప్ సెట్లు వున్నాయి. వీటికి ప్రతి రోజు నీటిని వాడుకునే అవకాశం వుంది.

ఈ లెక్కన కర్నూలు నగరానికి రోజుకు 200 క్యూసెక్కులు, పాలమూరు జిల్లాకు 450 నుంచి 500 క్యూసెక్కులు వాడుకుంటే సుంకేసులలో నిల్వ వున్న ఒక టీఎంసీ నీరు మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. మిగిలిన ఏప్రిల్, మే నెలల్లో నగర ప్రజల దాహార్తి తీర్చే వారెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జూన్‌లో తొలకరి వర్షాలు కురిసేంతవరకు ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే..

సుంకేసుల జలాశయం నీటిని వాడుకుంటూనే.. మరో వైపు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నీటి పారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హంద్రీనీవా నీటితో గాజులదిన్నె ప్రాజెక్టును నింపి ఆ నీటిని కర్నూలుకు మళ్లిస్తే కొంత వరకు ఉపశమనం వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం అరకొరగానే హంద్రీనీవా నీటిని జీడీపీకి వదులుతున్నారని, అలా కాకుండా డ్యామ్‌ను పూర్తిగా నింపాలన్నారు.

నగర ప్రజలకు రోజుకు 71.76 ఎంఎల్ అవసరం..

నగరంలోని దాదాపు 5 లక్షల జనాభాకు ప్రస్తుతం 71.76 మిలియన్ లీటర్ల (ఎంఎల్) నీరు అవసరముంది. వేసవిలో నీటి అసవరాలు మరింత పెరగనున్నాయి. అయితే ప్రస్తుతం 67 ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 85 శాతం ప్రాంతాల ప్రజలకు రోజుకు రెండు నుంచి మూడు గంటలు, మిగిలిన 15 శాతం ప్రాంతాల ప్రజలకు రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నట్లు నగర పాలక అధికారులు చెబుతున్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాజులదిన్నె నీటిపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని నగర పాలక నీటి సరఫరా విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement