సుంకేసుల రిజర్వాయర్‌లో అడుగంటిన నీరు
కర్నూలు, గూడూరు: సుంకేసుల రిజర్వాయర్ అడుగంటి పోయింది. ఫలితంగా కర్నూలునగర ప్రజలతో పాటు తుంగభద్ర నదీతీరంలోని 30 గ్రామాల ప్రజలకు తాగునీటి ముప్పు ఏర్పడనుంది. సుంకేసుల రిజర్వాయర్ సామర్థ్యం 1.20 టీఎంసీలు. ఆదివారానికి 0. 28 టీఎంసీ నీటి నిలువ మాత్రమే ఉంది. ఈ నీరు మరో 15 రోజుల వరకు మాత్రమే సరి పోతుందని డ్యామ్ అధికారులు అంచనా వేస్తున్నారు. సుంకేసుల పై ప్రాంతం నుంచి నీటి నిల్వ ఏ మాత్రం లేదని, అకాల వర్షాలు పడితే తప్ప రిజర్వాయర్‌కు నీటి చేరిక రాదని అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి సారించని అధికారులు..
సుంకేసుల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గి పోతున్నప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులు దృష్టి సారించడం లేదు. హొస్పెట్‌లోని టీబీ డ్యామ్ అధికారులతో ఉన్నతాధి కారులు మాట్లాడి తుంగభద్ర నదికి నీటిని విడిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
లీకేజీ నీరే గతి:
గూడూరు పట్టణంలో తాగు నీటి ఎధ్దడి ఎక్కువగా ఉంది. పడమర బీసీ కాలనీ, పడఖాన వీధి, సంజావయ్య నగర్, తూర్పు బీసీ కాలనీ, దైవం కట్ట, తెలుగు వీధి, తదితర ప్రాంతాల్లో చుక్క నీరు దొరకడం లేదు. పడమర బీసీ కా>లనీలో పైప్‌లైన్ లీకేజీ నీటినే కాలనీ వాసులు తాగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
నంద్యాల నీటి పథకం గ్రామాలలో తీవ్ర నీటి ఎద్దడి
సుంకేసుల కేంద్రంగా పనిచేస్తున్న నంద్యాల నీటి పథకం నుంచి గూడూరు, కోడుమూరు, కర్నూలు, కల్లూరు మండలాల పరిధిలోని 30 గ్రామాలకు నీరు అందుతుంది. సుంకేసుల రిజర్వాయర్ అడుగంటి పోతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తాగునీరు అందడం లేదు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలుకు జీడీపీ నీరు ఇస్తున్నాం:సుంకేసుల రిజర్వాయర్ నుంచి కర్నూలుకు ప్రతి రోజూ 104 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నాం. అలాగే జీడీపీ నీరు కూడా 50 క్యూసెక్కులు అందిస్తున్నాం. తాగునీటి ఇభ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. శ్రీనివాసరెడ్డి, జేఈ, సుంకేసుల
Comments
Please login to add a commentAdd a comment