12 సూర్య నమస్కారాలు, వేసే పద్దతులు
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం.
మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.
సూర్యనమస్కారాల విశిష్టత
సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు.
సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం
నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.
ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి
1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.
2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి.
3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి.
4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.
యువతను చైతన్య పరుస్తున్నాం..
సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్‌తో పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్‌తో పాటు అమెరికా, లండన్‌లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం.
1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )
చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.
2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.
3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)
శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.
4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )
ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
5. దండాసనం (ఓం ఖగాయనమః)
శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్‌లో ఉంచాలి
6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)
ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.
8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)
ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)
శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.
చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!
10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)
శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద
ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.
11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః)
శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.
12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)
నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment