mouse deer
-
లోసింగి అటవీ ప్రాంతంలో బుల్లి జింక స్వాధీనం
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని రోలుగుంట మండలం లోసింగిలో మౌస్ డీర్ (బుల్లి జింక)ను అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసు కలిగిన వింత ప్రాణితో లోసింగి గ్రామంలో చిన్నారులు ఆడుకుంటుండగా జాన్ అనే వ్యక్తి గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు, సిబ్బందితో లోసింగి గ్రామం వెళ్లి పిల్లల దగ్గర ఉన్న మౌస్ డీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మౌస్ డీర్‌ను డీఎఫ్‌వో సూర్యనారాయణ పరిశీలించి, ఇది అరుదైన ప్రాణి అని చెప్పారు. అటవీ అధికారుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంచారు. ఆదివారం విశాఖ జూకు అప్పగిస్తున్నట్లు రేంజర్ తెలిపారు. -
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2017 నుంచి మౌస్‌డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్‌లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్‌లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్‌లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
మెదక్‌లో అరుదైన జీవజాతి.. మూషిక జింకలు
సాక్షి, మెదక్: అరుదైన జీవ జాతుల్లో మూషిక జింక ఒక్కటి. ప్రభుత్వం వీటి మనుగడకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటి పునరుత్పత్తికి అభయారణ్యాల పరిధిలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలోని పోచారం అభయారణ్యంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మెదక్ జిల్లాకు 15 కిలోమీటర్లు.. హైదరాబాద్‌కు 115 కి.మీల దూరంలో ఉన్న పోచారం అభయారణ్యంలో అందమైన సరస్సుతో పాటు అపారమైన జంతు, వృక్ష జాతులు ఉన్నాయి. 1989లో ఈ అభయారణ్యం పరిధిలోని పర్యావరణ పర్యాటక కేంద్రంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 158 హెక్టార్ల అటవీ స్థలాన్ని రెండు బ్లాక్‌లుగా విభజించారు. 124 హెక్టార్లలో ఒక బ్లాక్, 34 హెక్టార్లలో మరో బ్లాక్‌గా ఏర్పాటు చేసి జింకల సంరక్షణ చేపట్టారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం చుక్కల దుప్పులు 350 నుంచి 450, మనుబోతులు 8 నుంచి 10, సాంబార్ దుప్పులు సైతం 8 నుంచి 10, కొండ గొర్రెలు 12 వరకు ఉన్నాయని జిల్లా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: పత్తిపై ‘గులాబీ’ పంజా) చిల్కూరు, నెహ్రూ పార్కు తర్వాత ఇక్కడే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని డీర్ పార్కులో మూషిక జింక సంతతి పెంపునకు అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన ప్రయోగం ఫలించింది. మూడేళ్ల క్రితం నాలుగు మూషిక జింకలను ఆ పార్కులో వదలగా.. గత ఏడాది ఓ మూషిక జింక పురుడు పోసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వీటి పునరుత్పత్తికి చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సమీపంలోని చిల్కూరు మృగవాణి నేషనల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రెండు మగ, ఆరు ఆడ మూషిక జింకలను వదిలారు. ఆ తర్వాత నెహ్రూ జూపార్క్‌లో రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను వదిలి.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని పోచారంలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలో మూషిక జింకలను వదిలేందుకు రంగం సిద్ధమైంది. రూ.5 లక్షల వ్యయంతో ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. కాగా, జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజారాణిని సంప్రదించగా.. ఎన్‌క్లోజర్ నిర్మాణం పూర్తయిన వెంటనే మూషిక జింకలు వస్తాయని తెలిపారు. పర్యాటకులు, సందర్శకుల సౌకర్యార్థం కేంద్రం లోపల ప్రత్యేక వాహనంలో తిరిగేలా 4.5 కి.మీల మేర మట్టి ట్రాక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి మేరకే వాహనాల్లో వెళ్లి చూడొచ్చని పేర్కొన్నారు. -
మూషిక జింకకు మళ్లీ ప్రాణం!
► విజయవంతమైన అటవీశాఖ అరుదైన ప్రయత్నం అంతరించిపోతున్న ►జాతికి పునరుజ్జీవం నెహ్రూ జూపార్క్లోప్రాణం పోసి.. నల్లమల అడవుల్లోకి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీ శాఖ చేసిన ఓ అరుదైన ప్రయత్నం విజయవం తమైంది. నల్లమల అడవుల్లో గతంలో విరివిగా కనిపించే మూషిక జింకలు (మౌజ్ డీర్) అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో అటవీ శాఖ మూషిక జింకల జాతికి పునరుజ్జీవం కల్పించాలని సంకల్పించింది. ‘జర్ని పంది’గా కూడా పిలిచే ఈ రకమైన జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడవుల్లోనే జీవిస్తాయి. అయితే అడవులు తగ్గిపోవటం, వేటగాళ్ల వల్ల ఇవి క్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రత్యేకమైన జాతిని సంరక్షించాలని అటవీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యుత్పత్తి కేంద్రం అటవీ ప్రాంతం నుంచి సేకరించిన కొన్ని మూషిక జింకలను నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యేకంగా సంరక్షించటంతో పాటు, ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2010లో మొదలైన ఈ ప్రయత్నం అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతో పూర్తి విజయవంత మయింది. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల సంఖ్య క్రమంగా పెరిగి 172కు చేరింది. వీటిలో 96 మగవి, 76 ఆడవి ఉన్నాయి. వీటిని ప్రయో గాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధి కారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండున్నర హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో అన్ని ఏర్పాట్లు చేసి మంగళవారం విడిచి పెట్టారు. కొద్ది రోజుల పాటు పరిశీలించి అడవిలోకి వదిలిపెట్టనున్నారు. దేశంలో ఇదే మొదటిసారి.. రెండు వారాల పాటు వీటిని గమనించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అడవిలోకి విడిచిపెడతాం. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం జరగటం ఇదే మొదటిసారి. విడతల వారీగా అన్ని మూషిక జింకలను నల్లమలలో విడిచిపెడతాం. మా ప్రయత్నం ఫలిస్తే నల్లమల అడవుల్లో మళ్లీ మూషిక జింకలు బాగా విస్తరిస్తాయి. – అమ్రాబాద్ టీఆర్ఎఫ్డీ ఎంసీ.పర్గేయిన్ -
వనవిజ్ఞాన్కు మూషిక జింకలు
హన్మకొండ అర్బన్ : వరంగల్ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన్ (వీవీకే)లోకి అధికారులు మౌస్ డీర్ (మూషిక జింక)లను కొత్తగా తీసుకొచ్చారు. ఈ మేరకు జింకల కోసం ఏర్పాటు చేసిన ఆవాసాన్ని ఎమ్మెల్యేలు వినయ్భా స్కర్, అరూరి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. వనవిజ్ఞాన్కు తీసుకొచ్చిన నాలుగు మూషిక జింకల్లో రెండు మగ, రెండు ఆడవి ఉన్నాయి. నల్లమల, మలేషియాల్లో మాత్రమే ఉండే మూషిక జింకలను హైదరాబాద్ జూపార్క్ నుంచి తీసుకొచ్చినట్లు డీఎఫ్ఓ పురుషోత్తం తెలిపారు. అనంతరం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనవిజ్ఞాన్ ఆవరణలో పులుల సంరక్షణపై సెమినార్ నిర్వహించారు. తర్వాత జూ ఆవరణలో ఎమ్మెల్యేలు, అధికారులు మొక్కలు నాటారు. సీసీఎఫ్ఓ జలాలుద్దీన్, రాజారావు, వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పురుషోత్తం, రేంజ్ అధికారి పూర్ణచందర్, కార్పొరేటర్ మాధవి, వార్డెన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.