మూషిక జింకకు మళ్లీ ప్రాణం!
► విజయవంతమైన అటవీశాఖ అరుదైన ప్రయత్నం అంతరించిపోతున్న
►జాతికి పునరుజ్జీవం నెహ్రూ జూపార్క్‌లోప్రాణం పోసి.. నల్లమల అడవుల్లోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అటవీ శాఖ చేసిన ఓ అరుదైన ప్రయత్నం విజయవం తమైంది. నల్లమల అడవుల్లో గతంలో విరివిగా కనిపించే మూషిక జింకలు (మౌజ్ డీర్) అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో అటవీ శాఖ మూషిక జింకల జాతికి పునరుజ్జీవం కల్పించాలని సంకల్పించింది. ‘జర్ని పంది’గా కూడా పిలిచే ఈ రకమైన జంతువులు దట్టమైన ఆకుపచ్చని అడవుల్లోనే జీవిస్తాయి. అయితే అడవులు తగ్గిపోవటం, వేటగాళ్ల వల్ల ఇవి క్రమంగా అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రత్యేకమైన జాతిని సంరక్షించాలని అటవీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యుత్పత్తి కేంద్రం
అటవీ ప్రాంతం నుంచి సేకరించిన కొన్ని మూషిక జింకలను నెహ్రూ జూపార్క్‌లో ప్రత్యేకంగా సంరక్షించటంతో పాటు, ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2010లో మొదలైన ఈ ప్రయత్నం అటవీ అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతో పూర్తి విజయవంత మయింది. ఆరేళ్ల తర్వాత ఈ మూషిక జింకల సంఖ్య క్రమంగా పెరిగి 172కు చేరింది. వీటిలో 96 మగవి, 76 ఆడవి ఉన్నాయి. వీటిని ప్రయో గాత్మకంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అధి కారులు నల్లమలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండున్నర హెక్టార్ల ఎన్‌క్లోజర్‌లో అన్ని ఏర్పాట్లు చేసి మంగళవారం విడిచి పెట్టారు. కొద్ది రోజుల పాటు పరిశీలించి అడవిలోకి వదిలిపెట్టనున్నారు.
దేశంలో ఇదే మొదటిసారి..
రెండు వారాల పాటు వీటిని గమనించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అడవిలోకి విడిచిపెడతాం. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం జరగటం ఇదే మొదటిసారి. విడతల వారీగా అన్ని మూషిక జింకలను నల్లమలలో విడిచిపెడతాం. మా ప్రయత్నం ఫలిస్తే నల్లమల అడవుల్లో మళ్లీ మూషిక జింకలు బాగా విస్తరిస్తాయి.
– అమ్రాబాద్ టీఆర్‌ఎఫ్‌డీ ఎంసీ.పర్గేయిన్