యురేనియం అంటే.. యుద్ధమే..!
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో ఒకానొకటి నందికొండ. నందికొండ నుంచి ముంపువాసులుగా అక్కడి కుటుంబాలు చెట్టుకొకటి.. పుట్టకొకటిగా చెల్లాచెదురయ్యాయి. ఇదంతా యాభై ఏళ్ల కిందటి ముచ్చట. కానీ, ఆ ప్రాంతంతో పెనవేసుకున్న పేగు బంధాన్ని తెంచుకోలేని కొన్ని కుటుంబాలు నందికొండ నుంచి పెద్దగట్టుకు చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడా గ్రామంలో కనీసం 400 దాకా కుటుంబాలు.. 1400 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. రమారమి నాలుగు వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. పెద్దగట్టు చుట్టూ కనుచూపు మేరలో పచ్చగా పరుచుకున్న పత్తి చేలే కనిపిస్తాయి. ఇలాంటి... ఈగ్రామం మరోమారు ఉలిక్కి పడింది. మళ్లీ పోరాటం చేస్తాం తప్ప ఇక్కడినుంచి కదిలేదని లేదని మూకుమ్మడిగా చెబుతున్నారు. యురేనియం ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
సాక్షి, నల్లగొండ : ప్రభుత్వం తాజాగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్న వార్తలతో నంబాపురం, పెద్దగట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలోనే యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన తాము.. ఊర్లను ఇప్పుడెలా వదిలిపోతామని ప్రశ్నిస్తున్నారు. మరోమారు పోరాటం చేస్తాం తప్ప ఇక్కడినుంచి కదిలేదని లేదని మూకుమ్మడిగా చెబుతున్నారు. యురేనియం పరిశోధనల కోసం అధికారులు వస్తే వారిని అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
దేవరకొండ నియోజకవర్గం పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని పెద్దగట్టు ప్రాంతంలో భూగర్భంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. దానిని వెలికితీసేందుకు పరీక్షలు నిర్వహించిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) గనుల కోసం తమకు ఈ ప్రాంతంలో 1300 పైచిలుకు ఎకరాల లీజు కావాలని 2002లోనే నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. 2003 నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను కూడా రూపొందించింది. కానీ, ఈ ప్రాంతంలో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనకడుగు వేసింది. కేవలం పెద్దగట్టు తండా మాత్రమే కాకుండా.. కొత్తగా ఏర్పాటైన పెద్దగట్టు పం చాయతీ ఆవాసమైన బూడిద గుట్ట తండా, నంబాపురం (యూసీఐఎల్ నివేదికల్లో లంబాపురం అని పేర్కొంటున్నారు), ఎల్లాపురం, పులిచర్ల తదితర గ్రామాలు సైతం యురేనియం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల జాబితాలో ఉన్నాయి. ‘ఒక సారి ఇప్పటికే ఇళ్లూ గొడ్డూ–గోదా పోగొట్టుకుని నందికొండ నుంచి లేచి వచ్చి పెద్దగట్టుపై పడ్డాం.
ఎన్ని సమస్యలున్నా ఇక్కడే బతుకుతున్నాం. పదుల ఎకరాలను నందికొండ ముంపులో పోగొట్టుకున్నా.. కుటుంబానికి 5 ఎకరాలే ఇక్కడ మాకు పునరావాసం కింద ఇచ్చారు. మళ్లీ ఇక్కడి నుంచి తరిమితే మేం ఎక్కడికి పోవాలి....’ పెద్దగట్టు సర్పంచి నరేందర్ ఆవేదన ఇది. ఈ ఒక్క తండానుంచే.. ప్రస్తుతం ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసు, పోస్టల్ తదితర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గ్రామంలో ఐదో తరగతి వరకు ఆశ్రమ పాఠశాల పక్కా భవనంలో నడుస్తోంది. రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండుమూడేళ్ల కిందటే పెద్దగట్టుకు రూ.7కోట్ల పైచిలుకు నిధులతో బీటీ రోడ్డు కూడా నిర్మించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 40వేల లీటర్ల తాగునీటిని అందించే ట్యాంకూ నిర్మించారు. ఇన్ని సౌకర్యాలు ఒనగూరాకా .. అన్నీ వదిలి మళ్లీ తట్టాబుట్టా ఎలా సర్దుకుపోవాలన్నది వీరి వాదన.
ప్రాజెక్టు .. కథాకమామీషు
లంబాపూర్–పెద్దగట్టు ప్రాంతంలో యురేనియం నిక్షేపాలను గుర్తించాక యూసీఐల్ రాంచీకి చెందిన మెకాన్ సంస్థతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించింది. ఈ ప్రాంతంలో పరీక్షల కోసం వేసిన బోర్లు ఇప్పటికీ రైతుల పొల్లాలో దర్శన మిస్తున్నాయి. ఇప్పటికీ నెలా నెలా నీటి నమూనాలు తీసుకెళ్తున్నారని పెద్దగట్టు వాసులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు కోసం మొత్తంగా 1301.35 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో 1,104.64 ఎకరాల భూమి అటవీ భూమిగా తేల్చారు. ఇక, మిగిలిన 196.7 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, సర్వేనంబర్లు 23/16 నుంచి 23/46 వరకు తమ భూములే ఉన్నాయని, నందికొండ పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇందులోనే 180 ఎకరాల దాకా ఉంటుందని పెద్దగట్టు వాసి పాండు చెప్పారు.
ఇది కాకుండా లంబాపూర్ ప్రాంతంలో 468 ఎకరాల విస్తీర్ణంలో యురేనియం నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ఇదంతా గుట్టపైన (హిల్టాప్) ఉన్నందున సంప్రదాయ పద్ధతిలో ఓపెన్ కాస్ట్ గనిలో తవ్వాలన్న ప్రతిపాదన ఉందంటున్నారు. ఇక్కడే మరో భూగర్భ గని, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో మరో మూడు భూగర్భ గనులు తవ్వాలన్న నివేదికలను యూసీఐఎల్ వద్ద సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఒక్కసారి తవ్వకాలు అంటూ మొదలైతే.. లంబాపూర్ గనులు 12 ఏళ్లపాటు, పెద్దగట్టు గనులు 20 ఏళ్ల పాటు కొనసాగనున్నాయి. ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నందున అనివార్యంగా పేలుళ్లు (బ్లాస్టింగ్స్) జరపాల్సి ఉంటుంది. ఇలా వారానికి మూడు సార్లు చొప్పున ఏటా కనీసం 162 పర్యాయాలు బ్లాస్టింగ్స్ జరుపుతారని తెలుస్తోంది.
నంబాపురానిది మరో కథ
యురేనియం కార్పొరేషన్ అధికారులు నంబాపురం తండాను లంబాపూర్ అంటున్నారు. తమ గ్రామం పేరెలా మారిందో తెలవదని గ్రామస్తులు అంటున్నారు. కృష్ణా బ్యాక్ వాటర్ తండాను తాకుతున్నా.. తమకు తాగునీరు లేదని వీరంటున్నారు. గతంలోనే యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడమని, ఇప్పుడెలా ఊరిని వదులుతామని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో నంబాపురం ఒకటి. ఈ గ్రామానికి చెందిన వారు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా.. కొన్ని గిరిజన కుటుంబాలు మాత్రం కృష్ణమ్మ ఒడిలో మునిగిపోయిన తమ గ్రామానికి గుర్తుగా అదే నంబాపురం పేరుతో తండాను ఏర్పాటు చేసుకున్నారు.
‘ఇక్కడ తాగునీటికి కష్టం. చెంతనే కృష్ణమ్మ ఉన్నా.. చుక్క నీరు పొలాలకు పారవు. నా యకుల మీద మాకు నమ్మకం పోయిం ది. రాగ్యానాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంబాపురానికి లిఫ్ట్ స్కీమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. రవీంద్రకుమార్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినా.. బాలూనాయక్ ఎమ్మె ల్యే అయినా.. జెడ్పీ చైర్మన్ అయినా.. ఇన్నేళ్లుగా మా సమస్య మాత్రం తీరలేదు. పొలాలకు నీరిచ్చేందుకు ఎత్తిపోతల పథకం రాలేదు. పిల్లలంతా బతకడానికి హైదరా బాద్, ఒంగోలు , ఇతర ప్రాంతాలకు వెళ్లారు.. అ యినా, ఊరిని విడవలేక ఇక్కడే బతుకుతున్నాం... అని రమావత్ లస్క ర్ చెప్పుకొచ్చాడు.
పెద్దగట్టుతండాకు చెందిన ఓ రెతు పొలంలో వేసిన బోరు. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా ఈ బోరు వేసినట్లు తండావాసులు చెబుతున్నారు. అందులోనుంచి ప్రత్యేకమైన పదార్థాలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నెలనెలా పరీక్షల కోసం నీటిని తీసుకెళ్తుం టారని పెద్దగట్టు తండా వాసులు చెబుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధి లోని రిజర్వ్ఫారెస్ట్లో, ఇక్కడ కూడా యురేనియం తవ్వకాలంటూ వస్తున్న వార్తలు ఇక్కడి ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
మా జీవితాలపై దెబ్బ కొట్టకండి
‘పదహారేళ్ల కిందట ఏం చేశామో.. ఇప్పుడదే చేస్తాం. యూసీఐఎల్ కార్యకలాపాలను కచ్చితంగా అడ్డుకుని తీరుతాం. మా బువ్వ మెతుకును ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు’.. అని దేపావత్ శ్రీను ఒకింత ఆవేశంగానే చెప్పాడు. ప్రభుత్వం తాజాగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్న వార్తలతో బెంబేలెత్తుతున్నారు. కాగా, పెద్దగట్టు ప్రాంతంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అటవీ భూములకు పట్టాలు ఇవ్వలేదు. దీంతో తమకు రైతు బంధు అందకుండా అయ్యిందని చెప్పారు. పట్టాలు కావాలని ధర్నాలు కూడా చేశారు. అధికారిక సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం అటవీ భూముల సరిహద్దులు ఖరారు చేసేందుకు, వారికి పట్టా పుస్తకాలు ఇచ్చేందుకు సర్వే కోసం వెళుతున్నారని సమాచారం. ఇందులో మతలబు ఏమన్నా దాగి ఉందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
గతంలోనే వ్యతిరేకించాం
యురేనియం తవ్వకాలను గతంలోనే వ్యతిరేకించాం. ఎంతోమంది ఈ ఇక్కడి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మా బతుకులను దెబ్బతీసే యురేనియం తవ్వకాలు చేపట్టవద్దు. యురేనియం వెలికి తీస్తే అనార్థాలే ఎక్కువగా ఉంటాయి. అధికారులు మా గోడును విని తమ ప్రయత్నాలను విరమించుకోవాలి. యురేనియం తవ్వకాల కోసం వస్తే ఊరుకునేది లేదు.
– దేపావత్ నరేందర్నాయక్, సర్పంచ్, పెద్దగట్టు
కృష్ణా జలాలు కలుషితం అవుతాయి
యురేనియం వెలికితీయడం వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయి. కృష్ణా వెనుక జలా లను ఆనుకొని ఎన్నో కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. వాతావరణంతో పాటు జీవరాశుల ఉనికికి ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలు వద్దు. అధికారులు మొండికి పోతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. యురేనియం తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం.
– సపావత్ ఖీమా, పెద్దగట్టు