ప్రేమ జంట ఆత్మహత్య
నల్లమలలో అనుమానాస్పదస్థితిలో మృతి
ఇద్దరూ సమీప బంధువులు. వరుసకు బావ మరదలు అవుతారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. అయినా బావ మరదలు ప్రేమను చంపుకోలేక ఒక్కటవ్వాలనుకున్నారు. ఇద్దరూ నెల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. పెద్దలు వారిని పిలిపించి పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా మార్పు రాలేదు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి శుక్రవారం నల్లమలలో విగత జీవులుగా కనిపించారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఎవరైనా చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - మహానంది
మహానందిలోని ఈశ్వర్‌నగర్‌కు చెందిన నాసరి అశోక్(25)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నాడు. అహోబిలం గ్రామానికి చెందిన అశోక్ మేనత్త కుమార్తె రజిత(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వరుసకు బావమరదులు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నెల క్రి తం పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి వారు వెళ్లిపోయారు. అనంతరం విషయం తెలుసుకున్న పెద్దలు, పోలీసులు వారిని పిలిపించి అశోక్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు. అయితే వారు ప్రేమను చంపుకోలేక మూడు రోజుల క్రితం మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం తాము నల్లమల అడవిలోని ఎంసీ ఫారం కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలోని తెలుగుగంగ కాల్వ వద్ద ఉన్నామని, ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అశోక్ తన పెద్దనాన్న కుమారుడు సుంకన్నకు ఫోన్ చేశాడు.
వెంటనే సుంకన్న విషయాన్ని కుటుంబీకులకు చెప్పడంతో కొందరు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రజిత, అశోక్ శవాలై కనిపించారు. శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయినట్లుగా ఉంది. కాగా ఇద్దరు బతికిఉన్నప్పుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటే మంటలు తాళలేక ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో పడి ఉండాలి. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే ఉండటంతో ఎవరైనా చంపేసి మృతదేహాలను తగులబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, మహానంది ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రజిత తల్లిదండ్రులు వీరభద్రుడు, వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రులకు క్షోభ కలిగించవద్దు
ఆకాశమంత పందిళ్లు వేసి పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే విడాకులకు దారి తీస్తున్న ఈ రోజుల్లో ప్రేమ పట్ల ఆకర్షితులై యువతీ యువకులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. యువతీ, యువకులు ప్రేమ కోసం మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు. పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలి. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి.పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే అనుమానాలు వీడుతాయన్నారు.
హరినాథరెడ్డి, డీఎస్పీ, నంద్యాల