మార్కాపురం డివిజన్‌లోని నల్లమల సమీప గ్రామాల్లో పాముల బెడదతో రైతులు వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న సర్పాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములను చంపకుండా వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలేసేందుకు అటవీశాఖ స్నేక్ వాచర్‌లను నియమించి.. వందల సంఖ్యలో పాముల్ని రక్షించి వాటి ఆవాసాలకు చేరుస్తోంది.
మార్కాపురం(ప్రకాశం జిల్లా): పాము అంటే ప్రతి ఒక్కరికీ భయం. దేశంలో ఉన్న పాముల్లో అత్యంత విషపూరితమైన వాటిలో మొదటిది రక్తపింజర, తరువాత తాచుపాము, కట్లపాము. రక్తపింజర ఇటీవల కాలంలో మార్కాపురం ప్రాంతంలో ఎక్కువగా సంచరించటంతో ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్చి, పత్తి పొలాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. అత్యధికంగా నవంబర్ నెలలో మార్కాపురం ప్రాంతంలో అధికారికంగా స్నేక్ రెస్క్యూ టీం 103 పాములు పట్టుకోగా అందులో ఎక్కువగా ప్రమాదకరమైన రక్తపింజరలు ఉన్నాయి.
మార్కాపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో స్నేక్ వాచర్ నిరంజన్ 10 రోజుల వ్యవధిలో 8 రక్తపింజర పాములను పొలాల్లో పట్టుకున్నాడు. వేములకోటలో 4, కొండేపల్లి బ్రిడ్జి కింద 1, శివరాంపురం పొలాల్లో 1, ఎస్‌కొత్తపల్లిలో 1, పట్టణంలోని పీఎస్ కాలనీలో ఒక రక్తపింజర పామును పట్టుకున్నాడు. 5 అడుగుల పొడవుండే రక్తపింజర పాముల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. కాటేసిన 40 నిమిషాల్లోపు వైద్య చికిత్స అందకపోతే చనిపోతారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఒళ్లంతా చమటలు పట్టి రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో గుండె బలహీన పడుతుంది.
ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. ఎక్కువగా గడ్డి, పొదలు, పత్తి, మిరప, పొగాకు, కంది చేలల్లో రక్తపింజరలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొండచిలువలు కూడా మార్కాపురం ప్రాంతంలో జనావాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 18 అడుగుల పొడవు, 90 నుంచి 100 కిలోల బరువు ఉండే కొండచిలువలు 10 రోజుల వ్యవధిలో 3 ప్రాంతాల్లో పట్టుకుని అడవుల్లో వదిలేశారు. బుడ్డపల్లిలో 2, పొదిలి దగ్గర ఒక కొండచిలువను పట్టుకున్నారు. నల్లమల అడవుల్లో నుంచి సమీప గ్రామాల్లోకి కొండ చిలువలు వస్తున్నాయి. కోళ్లు, మేకలు, కుందేళ్లు, జింకలను తింటున్నాయి. మనిషిని చుట్టేస్తే కొండచిలువ నుంచి బయటపడటం చాలా కష్టం.
పాముల పట్టివేత ఇలా:
నవంబర్ నెలలో నల్లమల పరిధిలోని శ్రీశైలంలో 15, సున్నిపెంటలో 27, మార్కాపురంలో 103, వైపాలెంలో 55, దోర్నాలలో 14, విజయపురి సౌత్‌లో 23 కలిపి మొత్తం 237 పాములను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో 163 పాములను పట్టుకున్నారు.
పాముకాటు సంఘటనలు
అక్టోబర్ 23న కొనకనమిట్ల మండలం గనివెనపాడులో యద్దనపూడి మరియమ్మ పాటుకాటుతో మృతిచెందింది.
సిద్దవరంలో ఆగస్టులో ఒకేసారి 8 మంది పాముకాటుకు గురై చికిత్స పొందారు.
విషపూరితమైనవే కాదు..మేలు చేసేవీ ఉన్నాయి
నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాములు సంచరిస్తున్నాయి. ఇందులో అత్యంత విషపూరితమైన నాగుపాము, రక్తపింజర, కట్లపాము, చిన్నపింజర, కొండ చిలువలతో పాటు రైతులకు మేలు చేసే పాములు కూడా ఉన్నాయి. జర్రిపోతు, నీరుకట్టు పాము, చెక్డ్‌కిల్ బ్యాక్, బ్రౌన్‌జి, పసిరిక పాములు ఉన్నాయి. ఇవి పొలాల్లో పంటలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, తొండలు, బల్లులను తిని జీవిస్తుంటాయి. కొండ చిలువ మాత్రం కుందేళ్లు, పక్షులు, కోళ్లు, చిన్న మేకలను తింటుంది. పసిరికపాము చెట్లపైనే ఉండి తొండలను, పిట్టలను తింటుంది. అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర, నాగుపాము, కట్లపాము పట్ల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment