సాక్షి, పెద్దదోర్నాల: నడకలో రాజసం.. వేటలో గాంభీర్యం వెరసి అడవిలో రారాజుగా వెలుగొందుతోంది పెద్దపులి. దట్టమైన అడువులతో పాటు విస్తారమైన వర్షాలు కురిసే చోటే పెద్దపులి ఆవాసం. ప్రస్తుతం ప్రభుత్వాల కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పులులు కాస్త ఊపిరి తీసుకుంటున్నాయి. కొద్ది కొద్దిగా తమ సంఖ్యను పెంచుకుంటూ మనుగడ కోసం పోరాడుతున్నాయి. అటువంటి పెద్దపులుల లెక్క తేల్చే పని ప్రారంభమైంది.
దీనికి సంబంధించి ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. జాతీయ జంతువు పెద్దపులులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు అటవీశాఖ గణన మొదలు పెట్టింది. అధునాతన కెమెరాలు ఉపయోగించి పులుల సర్వే చేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పక్రియ పూర్తి కావస్తోంది.
నల్లమలకు రాజసం పెద్దపులి
అడవికి రారాజు పెద్దపులి, అడవిలో ఎన్ని పులులు ఉన్నా వాటి పరిధి వాటివే. దేని రాజసం దానితే. దేని రాజ్యం దానిదే. మగ పులి 150 నుంచి 200 చదరపు కిలో మీటర్ల పరిధిని తన ఏలికలో ఉండాలని గట్టిగా కోరుకుంటుంది. అదే ఆడపులి 70 నుంచి 80 కిలో మీటర్లను తన సామ్రాజ్యంగా భావిస్తుంది. ఓ మోస్తరు అడవి లేకుంటే అస్సలు సహించవు. రాజులు రాజ్యాలు ఏలినట్లుగా పులులు కూడా తమ తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని తమ ఆదీనంలో ఉంచుకుంటాయి. ఇది పలానా పులి ఏరియా..అంటూ తన శరీరం నుంచి ప్రత్యేక రసాయనాన్ని విడుదల చేస్తుంది. లేదంటే అక్కడి చెట్లపై గోళ్లలో గీకుతుంది. పులుల సంభోగ సమయంలో ఈ పక్రియ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం నల్లమలలో 60 వరకు పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు
పులుల గణన ఎందుకంటే..?
అభయారణ్యాల్లో పులుల గణనను ఏటా చేపడతారు. గణన ముఖ్య ఉద్దేశం అభయారణ్యాల్లో పెద్ద పులులు ఎన్ని ఉన్నాయో ఏటా గుర్తిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు అభయారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయా? గతేడాది గుర్తించిన పులులు మళ్లీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయా.. లేదా? సంచరిస్తుంటే వాటి కదలికలు ఎలా ఉన్నాయి? దీంలో పాటు వాటి అభివృద్ధి ఎలా ఉంది? సంతానోత్పత్తి జరుగుతుందా? ఆవి ఆరోగ్యంగా ఉన్నాయా? అనే విషయాలు గుర్తించేందుకు పులుల గణనను చేపడతారు. గతంలో కెమెరాల్లో చిత్రీకరించిన పులులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు వస్తే వాటిని అవలీలగా గుర్తించవచ్చు. లేదా మిస్ అయిన పులులను సైతం గుర్తించేందుకు వీలుగా గణనను పకడ్బందీగా నిర్వహిస్తారు.
పులుల గణన కోసం శాస్త్రీయ పద్ధతులు
పులుల గణనలో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తున్నారు. ఫేస్ పోర్ మానిటరింగ్‌లో భాగంగా ఏటా పులుల గణన చేపడతారు. దీని కోసం ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పులుల లెక్కింపు గతంలో వాటి పాదముద్రలు ఆధారంగా జరిగేది. దాని వల్ల కచ్చితమైన లెక్క తేలేది కాదు. ఏ రెండు పులుల పాదముద్రలు ఒకేలా ఉండవు. పులికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచే చారికలు కూడా ఒకేలా ఉండవు.
మనుషుల వేలిముద్రలు మాదిరిగానే పులి చారికలు కూడా వేటికవే ప్రత్యేకం. ఇదే పులుల లెక్కింపులో కీలకం. అన్ని పులుల చిత్రాలు కెమెరాలో నిక్షిప్తం అయ్యాక కెమెరాలకు చిక్కిన పులుల లెక్కను సరి చూసుకుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు, ఇతర జీవులు ఎన్ని ఉంటాయో లెక్క చూసుకుంటారు. ఇలా సేకరించిన పులుల డేటాను బయోలాజికల్ రీసెర్చి సెంటర్‌కు పంపుతారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు తరలించి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment