అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు.
– నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి
ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది.
ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఇక్కడ అవి సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ 37 మాత్రమే పులులుండగా, ఇప్పుడవి 73కి పెరిగాయి. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది.
63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే..
అడవిలోనే పుట్టి పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మ గా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు.
అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చేపడుతున్నారు.
ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్‌లైన్‌లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు.
చెంచులు ఏం చేస్తారంటే..
►చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్‌లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమెరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు.
►ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు.
►ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు.
►బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్‌లెస్ సెట్‌లో అధికారులకు సమాచారమిస్తారు.
►అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది.
►మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు.
►ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది.
►ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్‌టీఎస్‌ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది.
►ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు.
పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది
ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది.
–శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు
చెంచులది కీలకపాత్ర
పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం.
– సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్‌ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్
పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం
ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది.
– దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్
మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం
మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి.
– దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్
పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం
పులుల క్రాసింగ్ టైమ్ లో చాలాజాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో అవి కలిసే(మేటింగ్) సమయం. అప్పుడు ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే ట ప్పుడూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని దాడి చేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది.
– అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్
Comments
Please login to add a commentAdd a comment