Nallamala chenchu
-
చరిత్రను కాటేయ జూస్తున్నారు!
తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ మీద భీమిరెడ్డి ఫైరింగ్. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి, పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్ సైన్యం! నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్ పటేల్‌ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. బీఎన్ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్ జాగ్రత్త! - వర్ధెల్లి వెంకటేశ్వర్లు సీనియర్ జర్నలిస్టు, పరిశోధక రచయిత -
నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు.. చెంచులదే కీలకపాత్ర
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఇక్కడ అవి సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ 37 మాత్రమే పులులుండగా, ఇప్పుడవి 73కి పెరిగాయి. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మ గా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ►చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమెరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ►ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ►ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ►బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ►అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ►మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ►ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ►ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ►ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. –శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులుల క్రాసింగ్ టైమ్ లో చాలాజాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో అవి కలిసే(మేటింగ్) సమయం. అప్పుడు ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే ట ప్పుడూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని దాడి చేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
అభివృద్ధి పేరుతో అంతం చేస్తారా?
చర్ల: అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ తెగలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాయని గోండ్వానా సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. సోమవారం చర్లలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు వాసం నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివాసీ తెగలను అందమొందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆరోపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. నల్లమల ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాల నైజర్గిక స్వరూపాన్ని కలిగి ఉండగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఆదిమ జాతి తెగలలోని చెంచు కులస్తులు సుమారు 45 వేల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల 10 వేలకు పడిపోయిందని ఆరోపించారు. ఆదిమ తెగలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీ తెగలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 10 వేల మంది ఉన్న చెంచు తెగలో కేవలం 150 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారంటే ఆ తెగను ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తుందో గ్రహించవచ్చని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టాలని యోచిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాలను కలుపుకుని విస్తరించి ఉండగా ఆ అటవీ ప్రాంతంలో 250 రకాల పక్షిజాతులు, వేలాది రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని అన్నారు. యురేనియం తవ్వకాల వల్ల వీటి మనుగడ లేకుండా పోతుందని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాల ఇటువంటి నష్టాలు కలుగనున్న నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గతంలో మంచినీటి పరీక్షల పేరుతో 40 బోర్లు వేశారని మళ్లీ కేంద్ర ప్రభుత్వం 2 వేల ఎకరాల్లో 4 వేలకు పైగా బోరు వేసి భూగర్భంలో ఉన్న యురేనియాన్ని బయటకు తీయాలని చూస్తోందని అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల అటవులు అంతమవ్వడంతో పాటు అటవీ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న చెంచు తెగ అంతరించిపోతుందని అన్నారు. తక్షణమే అలాంటి ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవడాన్ని బుర్జువా రాజకీయ వేత్తలు కుట్రలు చేస్తున్నారని వీటిని ప్రతీ ఆదివాసీ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లేకుంటే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనేతరలు స్వాధీనంలోకి వెళ్లిన భూ వ్యవహరంపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలైన 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వాలు గుర్తించి వాటిని కాపాడాలని అన్నారు. ఇత్తు పండగ, కొత్తల పండగలకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
తరతరాలుగా తండాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): ఆదిమానవుడి ఆనవాలుగా భావించే ఆదిమ గిరిజన చెంచులు ఆంత్రోపాలజీ నేపథ్యంలో అమూల్యమైనవారు. జన్యువైవిధ్య లేమివల్ల వారి సగటు జీవన ప్రమాణమే 45 ఏళ్లు. అయితే వారిలో ఉన్న విపరీతమైన మద్యపాన వ్యసనం కారణంగా అది మరింతగా తగ్గిపో యింది. ఫలితంగా ఏ గూడెం చూసినా ఈ వ్యసనంతో మృతి చెందిన వారే అధికం. తద్వారా పాతికేళ్లు నిండకుండానే వారి భార్యలు వితం తువులుగా మారుతున్నారు. వీరంతా ఆ జాబితాలో పింఛన్ కోసం ప్రతి నెలా గ్రామ సచివాలయాల వద్ద బారులు తీరి కనిపిస్తుంటారు. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీర పాండియన్ కొత్తగా పంచాయతీగా మారిన బైర్లూటి చెంచుగూడెం సందర్శన సందర్భంగా 91 మంది(బైర్లూటి, నాగలూటిలో) వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో కూడా ఒక చెంచు కుటుంబం 5 లీటర్లలోపు నాటుసారా కలిగి ఉండడం ఆమోదయోగ్యమే. అయితే క్రమేపి చెంచులను పునరావాసం పేరిట అడవికి దూరం చేయడం, బైర్లూటి లాంటి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే గూడేల్లో బయటి ప్రపంచ విష సంస్కృతి నేరుగా ప్రవేశించడం వంటి కారణాలతో ఆహారపు అలవాటులో భాగంగా నాటుసారా కాసుకునే చెంచులు.. లిక్కర్ వ్యాపారుల దొంగదందాతో తయారయ్యే అత్యంత విషతుల్యమైన సారా సేవనానికి అలవాటు పడిపోయారు. బెల్లం ఊట, తుమ్మ చెక్కతో మురగబెట్టి నాటు సారా తయారు చేసుకునే చెంచులు అసలు తుమ్మ చెట్టన్నది నల్లమల అటవీ సమీప గ్రామాల్లో విలుప్తమై పోవడంతో యూరియా, పాత ప్లాస్టిక్ చెప్పులు, నవాసగ్రం(రసాయనం) వినియోగిస్తున్నారు. ఇలాంటి సారా తాగి జీవశ్చవాలుగా మారి చివరకు చిన్నవయసులోనే మరణిస్తున్నారు. ప్రాణాంతకంగా చెంచుల ఆహారపు అలవాటు.. నాటుసారా సేవనం అనాదిగా చెంచుల ఆహారపు అలవాటులో భాగంగా మారింది. సారా కాసే పద్ధతి వారికి వంశపారంపర్యంగా అలవడింది. ఔషధయుతమైన వన అవశేషాల నుంచి సారా కాసుకునేవారు. తీయని .. మత్తెక్కించే వాసనతో ఉండే విప్పలను సేకరించి సారా తయారు చేసుకునేవారు. తీయదనం కోసం తునికి పండ్లు, చిటిమిటి పండ్ల గుజ్జు వినియోగించేవారు. చెంచులు నాటుసారా కాయడం, తమ వద్ద ఉంచుకోవడాన్ని బ్రిటీష్ వారి హయాంలో నేరంగా పరిగణించేవారు కాదు. గిరిజనుల పాలిట మృత్యుపాశం.. అమాయకపు ఆదిమ చెంచు గిరిజనుల పాలిట నాటుసారా.. మృత్యుపాశంగా మారింది. మితిమీరి తాగుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. క్రమంగా శరీరం శుష్కించి చిన్న వయసులోనే పురుషులు మరణిస్తుంటే వారి భార్యలు అంతకంటే చిన్న వయసులో వితంతువులుగా మారుతున్నారు. ఫలితంగా గూడేల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వారే కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చెంచుల మనుగడకే ఆటంకంగా మారిన నాటుసారా తయారీ, రవాణాను అరికట్టడంలో దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల సమష్టి కృషి కనిపించడంలేదు. 14 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే వైదవ్యం.. సాంస్కృతిక వెనుకబాటు కారణంగా చెంచులు తమ పిల్లలకు అతిపిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. 13 ఏళ్లు నిండక ముందే చెంచు బాలికలకు వివాహ యత్నాలు మొదలవుతాయి. 14 ఏళ్లకే పెళ్లిళ్లవుతాయి. 16ఏళ్లలోపే గర్భవతులయ్యే చెంచు బాలికలు రక్తహీనత కారణంగా ప్రసవంలో మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రసవాల్లో చచ్చి బతికే చెంచు బాలికలకు విపరీతమైన మద్యపాన వ్యసనపరులైన భర్తల అనారోగ్యం పెద్ద సమస్యగా మారుతోంది. తీవ్ర మద్యపాన సేవనంతో పెళ్లయిన నాలుగేళ్లకే మరణించే చెంచులు ఎందరో ఉన్నారు. ఈ కారణంగా కనీసం ఇరవై ఏళ్లు నిండకుండానే వారి భార్యలు వైదవ్యానికి గురవుతున్నారు. గూడెంలో మా బతుకులు మారాలి.. సారాయి తాగితాగి గూడెంలో చిన్న వయసులో మొగోళ్లు సచ్చి పోతున్నారు. వాళ్ల పెండ్లాలు ఇరవై ఏళ్లు నిండకుండానే విధవలై చంటిపిల్లలతో నానాయాతన పడుతున్నారు. గూడెంలో సారా కాయొద్దని ఎంత సెప్పినా వినడం లేదు. గూడేల నుంచి సారా పోయినప్పుడే మా బతుకులు మారేది. – గొలుసమ్మ, గూడెం పెద్ద, బైర్లూటి ఆరో తరగతిలోనే పెళ్లయింది.. మా పెద్దలు ఆరోతరగతిలోనే బడి మాన్పించి పెళ్లి సేసినారు. పెళ్లయిన నాలుగేళ్లకే నా మొగుడు నాగన్న సారాయి తాగితాగి అనారోగ్యంతో సచ్చిపోయినాడు. ఒక బిడ్డతో బతుకు నెట్టుకొస్తున్నాను. మా గూడెంలో ఎక్కడ చూసినా నాలాంటోళ్లే ఉన్నారు. – అర్తి నాగమ్మ, వితంతు పింఛన్‌దారు, బైర్లూటి కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రంగా మార్చబోతోంది. ఈ కేంద్రాల్లో డీ –అడిక్షన్ సెంటర్లు కూడా ఉంటాయి. చెంచులను సారా మాన్పించేందుకు ఈ కేంద్రాలు కృషి చేస్తాయి. – డాక్టర్ సి.గోపాల్ ,బైర్లూటి -
నల్లమల వీరుడు ఈ బాలుడు
సాక్షి, అప్పాపూర్ : ప్రకృతి ఓ అద్భుతం.. అందులోకి అడుగుపెట్టాలేగానీ మనసు గాల్లో తేలుతుంది. ఎంతపెద్దవాళ్లయినా పసిపిల్లల మాదిరిగా మారిపోతారు.. ఆ కాసేపు కష్టాలు కనుమరుగువుతాయి.. ప్రతి చెట్టూ ప్రతి పుట్టా ప్రతి పువ్వు, పక్షులు ఇలా ఒక్కటేమిటి ప్రతి అణువూ పలకరిస్తుంది. దాంతో ఒళ్లు పులకరిస్తుంది. నాగరికత పేరుతో నగరాల్లో బతికేవారికి భౌతిక సుఖాలుంటేయేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం మానసిక ఆనందం టన్నుల్లో ఉంటుంది. భౌతిక నగరంలో ఉన్నోళ్లు డబ్బుతో, అధికారంతో, పదవులతో ధైర్యాన్ని అరవు తెచ్చుకుంటారేమోగానీ ప్రకృతిలో పెరిగే వారికి మాత్రం ఇది వారితోపాటే సహజంగా పెరిగి పెద్దదవుతుంది. చిన్నచీమను చూస్తే అమ్మో అని గోల చేస్తారు నేటి నగర పిల్లలు.. కానీ, ప్రకృతిలో ఉండే పిల్లలు మాత్రం దేన్ని లెక్కచేయరు.. సాహసం అనేది వారికి రోజువారి క్రీడ. తేనేటీగల సంగతి తెలిసే ఉంటుందిగా.. అవి కుడితే కందిపోవాల్సిందే.. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. అలాంటి తేనే తుట్టెను రాలగొట్టడం ఈ ప్రకృతితో మమేకమై జీవించే పిల్లలకు పెద్ద కష్టమేమీ కాదు.. అదే విషయాన్ని రుజువు చేస్తూ ఓ పిల్లాడు తన పొడవు ఉన్న తేనెతుట్టెను సునాయాసంగా తెంపేసి చక్కగా ఫొటోకి ఫోజుచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. సాధారణంగా తేనేను చూస్తే నోరు ఊరిపోతుంటుంది. అలాంటిది తన పొడవున్న తేనెతుట్టెను పట్టుకొని దర్జాగా నిల్చున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని అంబ్రాబాద్ మండలం పరిధిలోని నల్లమల్ల అడవుల్లో అప్పాపూర్ అనే ఓ మారుమూల చెంచు గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన సురేష్ (టింకు) అనే చెంచు బాలుడు తనపొడవైన తేనెతుట్టెను పట్టుకొని కనిపించాడు. ఇదెక్కడిదని ప్రశ్నించగా తానే తీసుకొచ్చానని, అందులోని తేనెను పిండుతున్నానని తెలిపాడు. తాను ఖాళీ సమయాల్లో ఇలాంటి సాహసాలు ఇంకెన్నో చేయగలనంటూ వివరించాడు. ఈ మాటలు విన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో చెంచు సాహిత్యంపై పరిశోధన చేస్తున్న క్రిష్ణ గోపాల్ అనే పరిశోధకుడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాలో బందించి ఇలా పంచుకున్నారు. -
నల్లమలలో చెంచుల వేట!
ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితం మరణ శాసనం కాదా? నల్లమలలో పులుల జనాభాను పెంచి ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమల చెంచులు మన కళ్లముందే కాలగర్భంలోకనుమరుగైపోయేలా చూడటం విచిత్రం. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం మొదలవుతుంది. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో! ఏనాటిదో నల్లమల! ఆ కొండలు, దట్టమైన అడవుల పుట్టుక ఎప్పటిదో? ఆ లోయల్లో పలువంపులు తిరుగుతూ పరుగులు తీసే కృష్ణవేణమ్మ అక్కడికె ప్పుడు చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా తన ఉనికిని కాపాడుకుంటున్న పెద్దపులి జాతి ఎన్నాళ్లుగా నల్లమలను ఏలుతు న్నదో?... ఎక్కడా దొరకని అరుదైన దివ్యౌషధం సరస్వతి ఆకు (నాగరికులు పెట్టిన పేరు) అక్కడే ఎందుకు దొరుకుతున్నదో? రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మకు నీడనిచ్చిన సరాక అశోకవృక్షం లంకకు ఆవల కేవలం నల్ల మలలోనే ఎందుకు విస్తారంగా కనబడుతున్నదో? మరెక్కడాలేని ఓ బుల్లి రకం (అతి చిన్న జింకజాతి) ‘బుర్రజింక’ ఇక్కడ మాత్రమే ఎందుకు గంతు లేస్తున్నదో? సాలీడు రాకాసి సాలీడుగా, జెర్రిపురుగు రోకలిబండగా, ఉడుత బెట్టుడుతగా భారీగా ఆకారాలు పెంచుకొని ఎందుకలా ఉంటాయో? ఈ అడవిలోని చెట్లతో స్నేహం చేస్తూ, పశుపక్ష్యాదులతో కలియ దిరుగుతూ అనాదిగా సహజీవనం చేస్తున్న ఓ ఆదిమ తెగ ‘చెంచులు’ పేరుతో ఇక్కడెప్పుడు వెలిసిందో? నల్లమల చెంచులు ఇప్పటికీ ఆహార సేకరణ దశను పూర్తిగా దాటలేదు. ఒక పర్యావరణ చక్రాన్ని నిర్దేశించుకున్న ప్రకృతి సహజ సూత్రాలకు అనుగుణంగానే వారి జీవితం ఉంటుంది. చెట్ల నుంచి రాలిపడే కాయలు, పళ్లను తింటారు. కాలానుగుణంగా దుంపలను తవ్వుకుంటారు. వంట చెరకు కోసం చెట్లను కొట్టరు. ఎండిపోయిన కొమ్మలను, పుల్లలను వినియోగిస్తారు. ఎండిపోయిన పేడను వెలిగిం చుకొనే పాలు కాచుకోవడం ఆచారం. సాధారణంగా ఉడుతలు, ఉడుములు, ఎలుకలు, కుందేళ్లు, పక్షులను వేటాడుతారు. జింకల వేట మాత్రం అరుదు. ఏ రోజు అవసరానికి ఆరోజే వేట. రేపటి కోసం దాచుకొనే అలవాటు చెంచులకు లేదు. వేలయేళ్లుగా ఇదే జీవనశైలితో అటవీ ఆహార చక్రంలో చెంచులు ఇమిడిపోయారు. ఈ చక్రం నుంచి బయటపడి బతకలేని స్థితికి చెంచు జీవితం చేరుకుంది. వ్యవసాయం నేర్పించి వీరిని ఆ చట్రం నుంచి బయటపడేయడానికి గతంలో జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్ సిఫారసు మేరకు నల్లమల అడవి అంచున మైదాన ప్రాంతాల్లోని లక్ష ఎకరాల భూమిని గుర్తించి చెంచుల వ్యవసాయం కోసం కేటాయిస్తూ నైజాం సర్కార్ 1940వ దశకంలో ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. బ్రిటిష్ పాలకులు కూడా కర్నూలు జిల్లా పెచ్చెరువు ప్రాం తంలో చెంచుల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను, ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు. చెంచులకు ఉపాధి కల్పించడం కోసం వేల సంఖ్యలో టేకు చెట్లను నాటించారనేందుకు ఆధారాలున్నాయి. ఇదంతా ఎందుకంటే చెంచుల పట్ల బ్రిటిష్, నిజాం పాలకులు చూపినపాటి శ్రద్ధ మన ప్రజాప్రభుత్వాలకు లేకపోయిందని చెప్పడానికి. గిరిజనాభివృద్ధి కోసమే ఏర్పాటుచేసిన ఐటీడీఏ ఆచరణలో అటవీ సంపద దోపిడీకి ఉపయోగపడినంతగా గిరిజన జీవితాల్లో మార్పునకు ఉపకరించలేదు. నల్లమలలో ఈ సత్యం మరింత నగ్నంగా కనబడుతుంది. అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ, వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలనీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం చెంచు పెంటలను(ఆవాసాలను) తరలించే హడావుడి మొదలైంది. మొదటి దశ కింద తరలించాలని ప్రకటించిన పల్లెల్లో మహబూబ్‌నగర్ జిల్లా లోని వట్వార్లపెల్లి, సార్లపెల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచున బఫర్ జోన్లోనే ఉన్నాయి. పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న మల్లెల తీర్థానికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుల తరలింపును అమలు చేయడానికి వన్యప్రాణులు ఒక సాకు మాత్రమే అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. పైగా వందలు, వేలయేళ్లుగా వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అటవీ సంపదకు రక్షణగా నిలబడిన గిరిజనుల తరలింపువల్ల అటవీ సంపద దోపిడీకి, వన్యప్రాణుల విధ్యంసానికి ఇక ఎదురేముంటుంది? అడవిలోకి నాగరికుల చొరబాటు పెరిగిన దగ్గర్నుంచే అటవీ సంపద తరుగుతోందని చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజనుల నుంచి ఈ సంస్థ అటవీ ఉత్పత్తులను సేకరించి, వారికి ప్రతిఫలం ముట్టజెప్పడం ప్రారంభించింది. క్రమేపీ బినామీ పేర్లతో నాగరి కులు ఈ పనుల్లోకి చొరబడ్డారు. మన్ననూర్ గిరిజన సహకార కేంద్రానికి 2006లో 13 క్వింటాళ్ల నరమామిడి చెక్క అమ్మకానికి వస్తే 2010లో ఒక క్వింటాల్ మాత్రమే వచ్చింది. అరుదైన నరమామిడి చెట్ల నుంచి గిరిజనులైతే చెట్టు మొదలును ముట్టుకోకుండా పైభాగానున్న కొమ్మల నుంచి జాగ్రత్తగా చెక్కను తీస్తారు. మైదాన ప్రాంత బినామీలు డబ్బు కక్కుర్తితో చెట్లను మొద లంటా నరికిపారేసి, నాలుగేళ్లలో ఆ ప్రాంతంలో నరమామిడి చెట్టన్నదే లేకుం డా చేశారు. అడవిలో పెరిగే అడ్డాకు తీగలు చెట్ల మొదళ్లను అల్లుకుంటూ కొమ్మలమీదగా వ్యాపిస్తాయి. విస్తళ్ల తయారీకి ఉపయోగించే ఈ అడ్డాకులను గిరిజనులు ఒడుపుగా చెట్ల పెకైక్కి తీగకు గాయం కాకుండా సేకరిస్తారు. మైదానం నుంచి వచ్చే కిరాయి మనుషులు చెట్లను కూల్చి, తీగల్ని తెంపి మరీ అడ్డాకును సేకరిస్తారు. చెట్టుపైనే పాకానికి వచ్చి, ఎండి రాలిపోయిన కుంకు ళ్లను మాత్రమే గిరిజనులు సేకరిస్తారు. మైదాన వాసులు కొమ్మలను నరికి మరీ కుంకుళ్లను సేకరిస్తారు. వన్యప్రాణుల విషయంలోనూ అంతే. గిరిజను డికి అడవి తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమి స్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? కనుక, ఈ తరలింపు వెనుక ఏదో మతలబు ఉంది. దేశంలోని వివిధ అరణ్యాల గర్భాన దాగి ఉన్న అపార ఖనిజ సంపదల పైకి బహుళజాతి కంపెనీలు ఎన్నాళ్లుగానో గురిని ఎక్కుపెట్టాయి. యథాశక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరిస్తున్నాయి. నల్లమల అడవుల్లోనూ, కృష్ణాతీరం వెంట అత్యంత విలువైన కింబర్లైట్ రకం వజ్రాల నిక్షేపాలు, బంగారం, విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. నల్ల మల కేంద్రంగా కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ‘డీబీర్స్’ అనే బహుళ జాతి సంస్థ ఖనిజాన్వేషణ పర్మిట్ (ఆర్.పి.) తీసుకుంది. ఏ ప్రాం తంలో ఎంత పరిమాణంలో వజ్రాలు, బంగారం నిక్షేపాలు ఉన్నాయనే అం శంపై ఈ సంస్థ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఇక మైనింగ్ లెసైన్స్‌లు తీసుకొని వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తవ్విపోసుకోవాలి. కానీ, ఇందుకోసమే అంతరించిపోతున్న అతి పురాతనమైన, అరుదైన చెంచు జాతిని అడవి నుంచి వెళ్లగొట్టారన్న అపవాదు వస్తుందన్న భయంతో ప్రభు త్వాలు కొత్త నాటకాన్ని ప్రారంభించాయి. దీని ప్రకారం ముందుగా వన్య ప్రాణుల రక్షణ పేరిట చెంచులు అడవుల నుంచి బయటకు తరలి పోయేట్టు చేయాలి. అనంతరం గనుల తవ్వకం లెసైన్స్‌లతో బహుళ జాతి సంస్థలు అడవిలోకి ప్రవేశించాలి. మన దేశ చరిత్రను ఆర్యుల ఆగమనంతో మొదలుపెట్టి చదువు కోవడం పరిపాటి. కానీ వారి రాకకు వేల ఏళ్లకు ముందు నుంచే ఇక్కడ స్థిరపడ్డ వారు చెంచులు. లక్షల ఏళ్ల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి సాగిన మానవ మహా విస్తరణలో భారతావనిపై స్థిరపడ్డ అతి పురా తన తెగల వారసులు చెంచులు. అందుకు నిదర్శనం వారికి కొన్ని ఆఫ్రికా తెగలతో ఉన్న పోలికలే. ఈ ఆదిమ మానవ జాతి వారసులు మన అరుదైన జాతీయ సంపద. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాల పాలనలోనే వారు మరీ నిర్లక్ష్యానికి గురికావడం పెద్ద విషాదం. వారిప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరారు. ఐటీడీఏ లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు నాలుగు జిల్లాల్లో కలిసి 40 వేల జనాభా ఉన్నట్టు అధికారిక అంచనా. అయితే ఈ లెక్క తప్పులతడక. వాస్తవానికి చెంచు జనాభా అందులో 60 శాతం కూడా ఉండదు. గతంలో కూడా పునరావాసం పేర అడవి నుంచి చెంచులను బయటకు తరలించారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్యాకేజీ పేరిట ఇంటికో పది లక్షల రూపాయలు ఇస్తారు. రేపటికి ఆహారం దాచుకోవడమే తెలియని చెంచు పది లక్షలు దాచుకొని నాగరిక ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తాడు? ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితమంటే మరణ శాసనం కాదా? నల్లమలను పులుల అభయారణ్యాన్ని చేసి, వాటి జనాభాను పెంచి అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమలలోని దేశంలోనే అతి పురాతన తెగలలో ఒకరైన చెంచులు మన కళ్లముందే క్రమక్రమంగా చరిత్ర కాలగర్భంలోకి కనుమరుగై పోయేలా చూడటమే విచిత్రం. తప్పదు. డాలర్లు, రూపాయల వేటలో వెనుకా ముందూ కానక పరుగులు తీస్తూ మనం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గం ఇది. నల్లమల నుంచి చెంచుల నిష్ర్కమణతో పాటే చాపకింది నీరులా బహుళజాతి సంస్థల ప్రవేశం జరగబోతోంది. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను అత్యంత ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం కోసం ఆ పురాతన అరణ్యాలనే అంతరింపజేయవచ్చు. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో! (muralivardelli@yahoo.co.in)