దీనంగా చెంచు మహిళలు
సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): ఆదిమానవుడి ఆనవాలుగా భావించే ఆదిమ గిరిజన చెంచులు ఆంత్రోపాలజీ నేపథ్యంలో అమూల్యమైనవారు. జన్యువైవిధ్య లేమివల్ల వారి సగటు జీవన ప్రమాణమే 45 ఏళ్లు. అయితే వారిలో ఉన్న విపరీతమైన మద్యపాన వ్యసనం కారణంగా అది మరింతగా తగ్గిపో యింది. ఫలితంగా ఏ గూడెం చూసినా ఈ వ్యసనంతో మృతి చెందిన వారే అధికం. తద్వారా పాతికేళ్లు నిండకుండానే వారి భార్యలు వితం తువులుగా మారుతున్నారు. వీరంతా ఆ జాబితాలో పింఛన్ కోసం ప్రతి నెలా గ్రామ సచివాలయాల వద్ద బారులు తీరి కనిపిస్తుంటారు. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీర పాండియన్ కొత్తగా పంచాయతీగా మారిన బైర్లూటి చెంచుగూడెం సందర్శన సందర్భంగా 91 మంది(బైర్లూటి, నాగలూటిలో) వితంతు పింఛన్ తీసుకుంటున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో కూడా ఒక చెంచు కుటుంబం 5 లీటర్లలోపు నాటుసారా కలిగి ఉండడం ఆమోదయోగ్యమే. అయితే క్రమేపి చెంచులను పునరావాసం పేరిట అడవికి దూరం చేయడం, బైర్లూటి లాంటి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే గూడేల్లో బయటి ప్రపంచ విష సంస్కృతి నేరుగా ప్రవేశించడం వంటి కారణాలతో ఆహారపు అలవాటులో భాగంగా నాటుసారా కాసుకునే చెంచులు.. లిక్కర్ వ్యాపారుల దొంగదందాతో తయారయ్యే అత్యంత విషతుల్యమైన సారా సేవనానికి అలవాటు పడిపోయారు. బెల్లం ఊట, తుమ్మ చెక్కతో మురగబెట్టి నాటు సారా తయారు చేసుకునే చెంచులు అసలు తుమ్మ చెట్టన్నది నల్లమల అటవీ సమీప గ్రామాల్లో విలుప్తమై పోవడంతో యూరియా, పాత ప్లాస్టిక్ చెప్పులు, నవాసగ్రం(రసాయనం) వినియోగిస్తున్నారు. ఇలాంటి సారా తాగి జీవశ్చవాలుగా మారి చివరకు చిన్నవయసులోనే మరణిస్తున్నారు.
ప్రాణాంతకంగా చెంచుల ఆహారపు అలవాటు..
నాటుసారా సేవనం అనాదిగా చెంచుల ఆహారపు అలవాటులో భాగంగా మారింది. సారా కాసే పద్ధతి వారికి వంశపారంపర్యంగా అలవడింది. ఔషధయుతమైన వన అవశేషాల నుంచి సారా కాసుకునేవారు. తీయని .. మత్తెక్కించే వాసనతో ఉండే విప్పలను సేకరించి సారా తయారు చేసుకునేవారు. తీయదనం కోసం తునికి పండ్లు, చిటిమిటి పండ్ల గుజ్జు వినియోగించేవారు. చెంచులు నాటుసారా కాయడం, తమ వద్ద ఉంచుకోవడాన్ని బ్రిటీష్ వారి హయాంలో నేరంగా పరిగణించేవారు కాదు.
గిరిజనుల పాలిట మృత్యుపాశం..
అమాయకపు ఆదిమ చెంచు గిరిజనుల పాలిట నాటుసారా.. మృత్యుపాశంగా మారింది. మితిమీరి తాగుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. క్రమంగా శరీరం శుష్కించి చిన్న వయసులోనే పురుషులు మరణిస్తుంటే వారి భార్యలు అంతకంటే చిన్న వయసులో వితంతువులుగా మారుతున్నారు. ఫలితంగా గూడేల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వారే కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చెంచుల మనుగడకే ఆటంకంగా మారిన నాటుసారా తయారీ, రవాణాను అరికట్టడంలో దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల సమష్టి కృషి కనిపించడంలేదు.
14 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే వైదవ్యం..
సాంస్కృతిక వెనుకబాటు కారణంగా చెంచులు తమ పిల్లలకు అతిపిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. 13 ఏళ్లు నిండక ముందే చెంచు బాలికలకు వివాహ యత్నాలు మొదలవుతాయి. 14 ఏళ్లకే పెళ్లిళ్లవుతాయి. 16ఏళ్లలోపే గర్భవతులయ్యే చెంచు బాలికలు రక్తహీనత కారణంగా ప్రసవంలో మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రసవాల్లో చచ్చి బతికే చెంచు బాలికలకు విపరీతమైన మద్యపాన వ్యసనపరులైన భర్తల అనారోగ్యం పెద్ద సమస్యగా మారుతోంది. తీవ్ర మద్యపాన సేవనంతో పెళ్లయిన నాలుగేళ్లకే మరణించే చెంచులు ఎందరో ఉన్నారు. ఈ కారణంగా కనీసం ఇరవై ఏళ్లు నిండకుండానే వారి భార్యలు వైదవ్యానికి గురవుతున్నారు.
గూడెంలో మా బతుకులు మారాలి..
సారాయి తాగితాగి గూడెంలో చిన్న వయసులో మొగోళ్లు సచ్చి పోతున్నారు. వాళ్ల పెండ్లాలు ఇరవై ఏళ్లు నిండకుండానే విధవలై చంటిపిల్లలతో నానాయాతన పడుతున్నారు. గూడెంలో సారా కాయొద్దని ఎంత సెప్పినా వినడం లేదు. గూడేల నుంచి సారా పోయినప్పుడే మా బతుకులు మారేది.
– గొలుసమ్మ, గూడెం పెద్ద, బైర్లూటి
ఆరో తరగతిలోనే పెళ్లయింది..
మా పెద్దలు ఆరోతరగతిలోనే బడి మాన్పించి పెళ్లి సేసినారు. పెళ్లయిన నాలుగేళ్లకే నా మొగుడు నాగన్న సారాయి తాగితాగి అనారోగ్యంతో సచ్చిపోయినాడు. ఒక బిడ్డతో బతుకు నెట్టుకొస్తున్నాను. మా గూడెంలో ఎక్కడ చూసినా నాలాంటోళ్లే ఉన్నారు.
– అర్తి నాగమ్మ, వితంతు పింఛన్‌దారు, బైర్లూటి
కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు..
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాన్ని హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రంగా మార్చబోతోంది. ఈ కేంద్రాల్లో డీ –అడిక్షన్ సెంటర్లు కూడా ఉంటాయి. చెంచులను సారా మాన్పించేందుకు ఈ కేంద్రాలు కృషి చేస్తాయి.
– డాక్టర్ సి.గోపాల్ ,బైర్లూటి
Comments
Please login to add a commentAdd a comment