వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి నారాయణ స్వామి
సాక్షి, కర్నూలు: అక్రమ మద్యం, నాటుసారా తయారీపై సరిహద్దుల్లో నిఘా పెంచాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానం అమల్లో భాగంగా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించనున్న ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాంబశివరావు, ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్‌తో కలిసి గురువారం జిల్లాల వారీగా డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావు, ఎక్సైజ్ సూపరింంటెండెంట్లు ఆర్.సుధాకర్, మధుసూదన్ రెడ్డి, కర్నూలు, నంద్యాల డిపో మేనేజర్లు వేణుగోపాల్, సుధాకర్‌రెడ్డిలతో పాటు అన్ని స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎక్సైజ్ అధికారులు మరింత పటిష్టంగా పని చేయాలన్నారు.
జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాట్లపై తీసుకున్న చర్యల గురించి డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవరావును అగిడి తెలుసుకున్నారు. ఫైలెల్ ప్రాజెక్టు కింద మొదటి విడత సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో 21 ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రారంభించనున్నట్లు చెన్నకేశవరావు మంత్రి దృష్టికి తెచ్చారు. అద్దె భవనాలు, డిపో నుంచి దుకాణాలకు మద్యం రవాణా ఫర్నిఛర్ ఏర్పాటు తదితర వాటికి కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, అద్దె దుకాణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీ.. మంత్రికి వివరించారు. మొదటి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 205 దుకాణాలను 164కు కుదించినట్లు వివరించారు. అక్టోబర్ 1 నుంచి రెండో విడత 143 దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీసీ వెల్లడించారు. దుకాణాల ఏర్పాటు, నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల మద్యం రవాణా కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment