సాక్షి, కర్నూలు : నల్లమల అడవి పరిసర గ్రామాల్లో మరోసారి పెద్దపులి ఉందంటూ అలజడి మొదలైంది. ఆవుపై దాడి చేసి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం సింగవరం గ్రామం నల్లమల అడవికి సమీపంలో ఉంది. గ్రామ సమీపంలోని పొలాల వద్ద మేత మేస్తున్న ఆవు అనుమానస్పదంగా చనిపోయింది. పెద్దపులి దాడిచేసినట్లుగా గుర్తించిన గ్రామస్తులు భయంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పులివిగా భావిస్తున్న పాదముద్రలను, చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులు నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. సమీపంలో అడవి ఉండటంతో ఇటీవల తరచూ అడవి జంతువులు గ్రామాపరిసరాలలో కనిపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామానికి పక్కనే ఉన్న ప్రసిద్ధ క్షేత్రం ఓంకారం ఆలయానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment