ఆత్మకూరురూరల్: నల్లమలలో ఒక పెద్ద పులి మరణించింది. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని శ్రీశైలం రేంజ్ పరిధిలో నరమామిడి చెరువు ప్రాంతంలో మంగళవారం చనిపోయింది. వృద్ధాప్యం మీదపడిన పెద్దపులి తన పాలిత ప్రాంతంలోకి చొరబడ్డ యువ పులిని తరిమివేసే యత్నంలో దానితో పోరాడుతూ మరణించినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి మరణించిందన్న సమాచారం మేరకు ఆత్మకూరు నుంచి డీఎఫ్‌ఓ సెల్వం, శ్రీశైలం – నాగార్జున సాగర్ ఫీల్డ్ డైరెక్టర్ శర్వణన్, ఎఫ్‌ఆర్‌వో జయరాములు, శ్రీశైలానికి చెందిన అదనపు సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన జరిగిన ప్రాంతం అత్యంత లోతట్టు అటవీ ప్రాంతం కావడంతో పాటు అక్కడ ఎలాంటి సెల్ సిగ్నల్స్ అందవు. కావున రాత్రి 10 గంటల వరకు స్పష్టమైన సమాచారం బయటపడలేదు.
వృద్ధాప్యం.. ఓ శాపం
నల్లమలలో రారాజులా తిరిగే జాతీయ జంతువు పెద్దపులికి వృద్ధాప్యం మాత్రం పెద్ద శాపంగా ఉంటోంది.అడవిలో సుమారు 16 ఏళ్లు మాత్రమే జీవించే పెద్దపులి.. జంతు ప్రదర్శనశాలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతుకుతుంది. ఒంటరిగా తన ఆహార జంతువులను వేటాడే పులులకు వయసు పెరిగే కొద్దీ వేటలో నైపుణ్యం తగ్గుతుంది. దీంతో ఆహార సేకరణ కష్టమవుతుంది. తద్వారా అవి తొందరగా చనిపోతాయి. సాధారణంగా ఒక ప్రౌఢ వయసు పులి నల్లమలలో సుమారు 40 చ.కి.మీ ప్రాంతాన్ని తన పాలిత ప్రాంతంగా(టైగర్ టెరిటరీ) చేసుకుని తిరుగుతూ ఉంటుంది. మరో పులిని ఆ ప్రాంతంలోకి అనుమతించదు. అయితే.. వయసు మీద పడే కొద్దీ వృద్ధ పులులకు యువ పులుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. యువ పులి.. వృద్ధపులిని పోరాటంలో ఓడించి చంపివేసి.. దాని పాలిత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ పరిస్థితి అన్ని పులులకూ ఎదురు కాకపోవచ్చు. కొన్ని పెద్దపులులు వృద్ధాప్యం కారణంగా వేటాడే శక్తి కోల్పోయి ఆహారం లభించక ఆకలి చావులకు గురవుతుంటాయి. ఈ సమయంలో పులి ఎత్తయిన ప్రదేశానికి వెళ్లి ఏరాతి గుట్ట మాటునో ప్రాణాలు విడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment