మాయమయింది మళ్లీ వచ్చింది | Wild Buffalo in Nalla mala Forest | Sakshi
Sakshi News home page

మాయమయింది మళ్లీ వచ్చింది

Published Tue, Jul 2 2024 5:17 AM | Last Updated on Tue, Jul 2 2024 5:17 AM

Wild Buffalo in Nalla mala Forest

నల్లమల అడవుల్లో ప్రత్యక్షమైన అడవి దున్న

పూర్వమే అదృశ్యమైన వీటిని పాపికొండల నుంచి నల్లమలకు రప్పించాలని ప్రణాళిక 

అప్రయత్నంగానే సాకారమైన అటవీ శాఖ అధికారుల స్వప్నం

అనుకోని అతిథి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్‌లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడి అడవుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.

ఆత్మకూరు రూరల్‌: నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత అడవి దున్న (ఇండియన్‌ బైసన్‌)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నాగార్జున సాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్‌లో బైర్లూటి, వెలుగోడు నార్త్‌ బీట్‌లలో కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. çకర్ణాటకలోని పశి్చమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే.  

నెల క్రితమే కనిపించినా.. 
నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని బైర్లూటి రేంజ్‌ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది. ఆ వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఆ తరువాత ఇదే అటవీ డివిజన్‌లోని వెలుగోడు రేంజ్‌లో గల నార్త్‌ బీట్‌ జీరో పాయింట్‌ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది.

అప్రయత్నంగానే సాకారం 
ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌(డబ్లూడబ్ల్యూఎఫ్‌) సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు.  

ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు 
ఆత్మకూరు అటవీ డివిజన్‌లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యమైనదేమీ కాదు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement