నల్లమలలో గుర్తించిన కొత్త జీవరాశులివే.. | Nallamala Forest Animals New Species Special Story In Prakasam District | Sakshi
Sakshi News home page

నల్లమల.. అద్భుత ప్రపంచం

Published Sun, Dec 27 2020 10:26 AM | Last Updated on Sun, Dec 27 2020 3:01 PM

Nallamala Forest Animals New Species Special Story In Prakasam District - Sakshi

సాక్షి, పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న జీవవైవిధ్య పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించడంతోపాటు అరుదైన కొత్త జీవులను సైతం గుర్తిస్తున్నారు. నాగర్జున సాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా ఉంది. అటవీశాఖ చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో నల్లమలలో గత పదేళ్లుగా వన్యప్రాణుల సంతతి పెరగడమేకాదు దట్టమైన అడవులు విస్తరిస్తున్నాయి.  

నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. నల్లమలలో 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. ఇక వీటికి అదనంగా వివిధ జాతుల కీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పరిధిలో  బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్తరకం జీవరాశులను కనుగొన్నారు. ఎస్‌టీఆర్‌ పరిధిలో ఉండే ల్యాబ్‌లో వన్యప్రాణులు, సరీసృపాలు, క్షీరదాలు, కీటకాలు, వృక్షజాతుల ఫొటో లైబ్రరినీ ఏర్పాటు చేశారు. 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో ఆయా జాతులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు.

నల్లమల  అభయారణ్యంలో శాస్త్రవేత్తలు కనుగొన్న గద్ద  
2014–15లో నల్లమల అభయారణ్యంలో కనుగొన్న జీవరాసులను పరిశీలిస్తే.. మెటోక్రొమాస్‌టిస్‌ నైగ్రోఫి యొరేటో, మారస్‌ శ్రీశైల యెన్సిస్‌(సాలీడు), నాగార్జునసాగర్‌ రేజర్‌(పాము), స్లెండర్‌ కోరల్‌ స్నేక్‌ (పాము), ఫ్రీనికస్‌ ఆంధ్రాయెన్సిస్‌(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్‌(సాలీడు), సిరాప్టిరస్‌ లాటిప్స్‌(కీటకాలు), డారిస్తీన్స్‌ రోస్ట్రాటస్‌(గొల్లభామ), శ్రీలంకన్‌ ఫ్లైయింగ్‌ స్నేక్, స్యాండ్‌ స్నేక్, వీటితో పాటు కృష్ణానది జలాల్లో టు స్పాటెడ్‌బార్బ్‌ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు. వర్షాకాలంలోనూ, వరదలు వచ్చే సమయాన మాత్రమే కృష్ణా జలాల్లో కనిపించే నీటిì æపిల్లులపై కూడా పరిశోధన చేస్తున్నారు. ఆ సమయం వాటి సంతానోత్పత్తికి సంబంధించినదిగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

జింకలకు ప్రసిద్ధి 
నల్లమలలో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక. దీనిని బుర్ర జింకగా, మౌస్‌ డీర్‌గా అభివరి్ణస్తారు. నల్లమలలో అతి పెద్ద జింక కణితి. దీనిని సాంబార్‌ డీర్‌గా పిలుస్తారు. కొమ్మలుగా విస్తరించిన భారీ కొమ్ములతో ఉండే కణితులు సుమారు 150 కేజీల బరువు తూగుతాయి. పొడ దుప్పులు.. అందానికి ఇవి ప్రతి రూపాలు. బంగారు వర్ణంలో ఉన్న చర్మంపై నల్లమచ్చలతో ఉండే ఈ జింకలు నల్లమలలో విస్తారంగా ఉన్నాయి. పెద్ద పులి ఆహార మెనూలో ఇవి ప్రధానమైనవి. నిటారు కొమ్ములు కలిగిన జింకల్లో మనిమేగం(నీల్‌గాయ్‌) భారీ జంతువు.

శ్రీలంకన్‌ ఫ్లైయింగ్‌ స్నేక్‌ 
పురి తిరిగిన కొమ్ములతో కాల్లలో స్ప్రింగ్‌లున్నాయా అన్నట్లుగా గెంతుతూ స్వేచ్ఛకు ప్రతిరూపంగా కనిపించే కృష్ణజింకలకూ నల్లమలలో కొదవలేదు. ఉత్తర భారతదేశంలో చౌసింగా పేరుతో పిలుచుకునే కొండ గొర్రె(బార్కింగ్‌ డీర్‌) అడవి సాంద్రతను కొలిచే జింకగా చెప్పుకుంటారు. కొండ గొర్రె ఏ అటవీ ప్రాంతంలో కనిపించిందంటే ఆ ప్రాంతంలో అడవి దట్టంగా ఉందని అర్థం. నల్లమల అడవుల్లో లోతట్టు అటవీ ప్రాంతంలో కనిపించే కొండ గొర్రె ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంత సరిహద్దుల్లో కూడా దర్శనమివ్వడం విశేషం.

జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ
జీవ వైవిధ్యంతోనే మానవుల మనుగడ కొనసాగుతోంది. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ప్రకృతిలో ప్రతి జీవరాశి ఒక దాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. వీటిలో ఎక్కడ లోపం కనిపించినా జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి.  – మందా రమేశ్‌, సీనియర్‌ రీసెర్చి అసిస్టెంట్, బయోడైవర్సిటీ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement