సాక్షి, అమరావతి: నల్లమల అడవుల్లోని వన్యప్రాణులు ప్లాస్టిక్ ప్రభావానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ కారణంగా ఈ అటవీ ప్రాంతంలోని జంతువుల ప్రవర్తనలో మార్పులు వస్తున్నట్లు అటవీ శాఖ అధ్యయనంలో తేలింది. వాటి శరీరాల్లోను మార్పులు వస్తున్నట్లు స్పష్టమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న బయోడైవర్సిటీ రీసెర్చి సెంటర్ నల్లమల అడవుల్లో పర్యావరణం, జీవావరణానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది.
విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతం (నల్లమల అడవులు) పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు వంటి అనేక జంతువులకు ఆలవాలం. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలానికి వెళ్లే మార్గం ఈ అడవిలోంచే ఉంది. లక్షలమంది యాత్రికులు వచ్చే ప్రాంతం కావడంతో ఇక్కడ ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు యాత్రికులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ప్లాస్టిక్ పెట్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు వంటి వాటిని అటవీ ప్రాంతంలో రోడ్డు వెంబడి పడేస్తున్నారు.
ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఆకర్షిస్తుండడంంతో వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల పాలవుతున్నాయి. తెలియకుండా ప్లాస్టిక్‌ను తింటున్న అడవి జంతువులకు అనారోగ్యాలు వస్తున్నాయి. వన్యప్రాణుల శరీరంలో బయో–అక్యుమ్యులేషన్, బయో–మాగ్నిఫికేషన్ జరిగి ప్లాస్టిక్ కెమికల్స్ ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీంతో అడవి జంతువుల సహజ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. వాటి శరీర హార్మోన్లలో మార్పులు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఆకలి తగ్గిపోవడంతో తినడం తగ్గి శక్తిహీనం అవుతున్నాయి. వాటి ఆహారపు అలవాట్లలోను తేడాలు కనిపిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్)కు చెందిన అటవీ బృందం సాంకేతిక, శాస్త్రీయ పద్ధతుల ద్వారా నల్లమలలోని విభిన్నమైన పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. నల్లమల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడమే అత్యంత కీలకమైన అంశం కావడంతో అక్కడి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ‘మన ఎన్‌ఎస్‌టీఆర్–క్లీన్ అండ్ గ్రీన్ ఎన్‌ఎస్‌టీఆర్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది.
స్థానికంగా ఉండే చెంచు గిరిజనులను ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేయడానికి స్వచ్ఛ సేవక్‌లుగా నియమించింది. తద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వేరు చేయించడంతోపాటు ప్రామాణిక పద్ధతుల్లో వాటిని రీసైక్లింగ్ చేస్తోంది.
ప్రతి స్వచ్ఛ సేవక్‌కు అడవిలో జనసంచారం ఉండేచోట కొంత ప్రాంతాన్ని కేటాయించి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే బాధ్యతను అప్పగించింది. ఘాట్‌రోడ్డు పక్కన చెత్తకుండీలు ఏర్పాటు చేసి యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో వేసేలా సూచికలు పెట్టింది.
ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న నష్టాలను తెలిపేలా పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. ఈ చర్యల ద్వారా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వల్ల సమస్యలు రాకుండా చేసేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం
నల్లమలను ప్లాస్టిక్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛ సేవక్‌ల ద్వారా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లను ఏరివేయించి రీసైక్లింగ్‌కు పంపుతున్నాం. ప్లాస్టిక్ అడవి జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాíస్టిక్‌ను శ్రీశైలం ప్రాంతానికి తీసుకురాకూడదు. యాత్రికులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలి.
– వై.శ్రీనివాసరెడ్డి, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్, శ్రీశైలం
నల్లమల వన్యప్రాణులకు ప్లాస్టిక్ ముప్పు
Published Mon, Oct 3 2022 4:22 AM | Last Updated on Mon, Oct 3 2022 4:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment