జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్‌ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు.
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్‌ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది.
పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్‌లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్‌లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్‌ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్‌వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు.
గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి...
అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్‌వో కేడర్‌లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది.
ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో
ఒంగోలు నగరంలోని డీఎఫ్‌ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్‌ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్‌ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
– కే.మోహన రావు, డీఎఫ్‌ఓ, రెగ్యులర్ ఫారెస్ట్
Comments
Please login to add a commentAdd a comment