
సాక్షి, హైదరాబాద్: యురేనియం మైనింగ్ ప్రతిపాదిత మండలాల్లో పర్యటనకు అనుమతించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్).. డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డిలు మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 3వ తేదీన మావోయిస్టు అమరుల వారోత్సవాల పేరిట, 14వ తేదీన అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించలేమన్న సాకుతో తమను, తమపార్టీ సభ్యుల్ని అడ్డుకుని సెక్షన్ 151 సీఆర్‌పీసీ కింద అరెస్టు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం మైనింగ్ నిక్షేపాలు గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో పర్యటించి, ప్రజలను కలుసుకునేందుకు అనుమతించాలని కోరారు.