
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రథయాత్రలకు రాష్ట్ర బీజేపీ సమాయత్తమైంది. డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో, షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌ల పరిధిలో బస్సుయాత్ర చేయాలని బీజేపీ సంకల్పించింది. ఈనెల 26న బాసర, సోమశిల ఆలయం (కొల్లాపూర్), భద్రాచలం రాములోరిగుడి నుంచి మూడు రథయాత్రలు ప్రారంభం కానున్నాయి.
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఇతర ముఖ్యనేతలు ఈ యాత్రల్లో పాల్గొంటారు. మొత్తం 119 నియోజకవర్గాల మీదుగా 19 రోజుల పాటు 4,040 కిలోమీటర్ల మేర ఈ యాత్రలు సాగనున్నాయి. ఈ మూడు యాత్రలు అక్టోబర్ 14న హైదరాబాద్‌కు చేరుకుంటాయి. యాత్రల ముగింపు సందర్భంగా నగరంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది.
రథయాత్రలు ఇలా...
రూట్–1 కొమురంభీం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ –1 ( మొత్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు :1,100)
రూట్–2 కృష్ణా: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరా బాద్–2(మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,290)
రూట్–3 గోదావరి: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైద రాబాద్–3 (మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందు లో హైదరాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,650)