
రాజేంద్రనగర్: టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు మినహాయింపు ఇవ్వరా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ తాడ్‌బన్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ సిద్దిఖీ (49) రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సర్వే అండ్ రికార్డు సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ వైపు వచ్చాడు. టోల్ గేట్ వద్ద సిబ్బంది వాహనాన్ని ఆపి డబ్బులు చెల్లించాలని కోరారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని... కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్నానంటూ ఐడీ కార్డు చూపించాడు.
సిబ్బంది మాత్రం కార్డు చెల్లదని డబ్బులు చెల్లించాలని సూచించారు. అయినా అతను వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మేనేజర్ డేవిడ్ రాజు కారును అడ్డుకుని డబ్బులు చెల్లించాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్దిఖీతో పాటు కుటుంబ సభ్యులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డేవిడ్ రాజుతో పాటు మరో ఉద్యోగికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.