PM Modi Speech At Hyderabad BJP Activists Meeting - Sakshi
Sakshi News home page

తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిమయం.. రాబోయేది బీజేపీ సర్కార్‌: ప్రధాని మోదీ

Published Thu, May 26 2022 1:36 PM | Last Updated on Fri, May 27 2022 10:53 AM

PM Modi Speech At Hyderabad BJP Activists Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్‌ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సాధిస్తున్న వరుస విజయాలు, సాగిస్తున్న పోరాటాలు చూస్తుంటే.. తెలంగాణలో పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని, బీజేపీని తప్పక గెలిపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని, కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని విమర్శించారు.

ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పాటు జరగలేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలనను ఊడబెరికి, ఈ పాలనకు అంతం పలికే పోరాటాన్ని తెలంగాణ సోదర, సోదరీమణులు, ప్రజలు ముందుకు తీసుకెళతారని భావిస్తున్నానన్నారు. గురువారం ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయం వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేర్లు ఎత్తకుండానే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

కుటుంబ పాలకులే దేశద్రోహులు.. 
కుటుంబ పాలన చేసేవారే దేశ ద్రోహులు. ఇలాంటి పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. దేశంలో కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతి మయం. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2023లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష.  తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి తెలంగాణను తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కుట్రకు కుటుంబ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏమి చేసినా ప్రజల హృదయాల నుంచి మాపై ప్రేమాభిమానాలను, మా పేరును మీరు తుడిచి వేయలేరు.  

రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి 
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష.     

దేశ ప్రజల కలలు సాకారం అవుతున్నాయ్‌ 
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం. ప్రపంచంలోనే మూడో స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా భారత్‌ ఉద్భవించింది. వంద యూనికార్న్‌ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ పురోగతిలో టెక్నాలజీ పాత్ర ముఖ్యమైనది. ఇందులో తెలంగాణ యువత, సాంకేతిక నిపుణుల నైపుణ్యం మరువలేనిది. కేంద్ర పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. 

బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు..నెగ్గేవాళ్లు 
నేను శాస్త్ర, సాంకేతికతలను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. 21వ శతాబ్దంలోనూ తెలంగాణలో అంధవిశ్వాసాలున్న వారున్నారు. వారితో తెలంగాణకు ప్రయోజనం కలగదు. వీరు తెలంగాణకు న్యాయం  చేయలేరు. గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందన్నారు. నేను ఢంకా భజాయించి మరీ పదేపదే ఆ ప్రదేశాలకు వెళ్లివచ్చాను. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. 

తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి 
ప్రధాని మొదట తెలుగులో మాట్లాడుతూ.. ‘పట్టుదలకు, ధృఢ సంకల్పానికి, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు..’ అంటూ సభికులకు అభివాదం చేశారు. ‘నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దెత్తున అపూర్వమైన రీతిలో స్వాగతించారు. ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు, స్నేహానికి కృతజ్ఞతలు. 2013లో నేను ప్రధానిని కాదు. అయినా అప్పుడు హైదరాబాద్‌లో నా సభ జరిగితే దానికి టికెట్టు కొనుగోలు చేసి మరీ నా ప్రసంగం వినడానికి వచ్చారు. ఇదొక అద్భుతం. ఇది యావత్‌ దేశంలో పరివర్తనకు కారణమైంది. నా జీవితంలో అదొక టర్నింగ్‌ పాయింట్‌. దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ విధంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తనదైన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జెండా నాటాలి.   

గవర్నర్, తలసాని స్వాగతం 
విమానాశ్రయంలో మోదీకి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, సీఎస్‌ సోమేశ్‌కు మార్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. 

సంజయ్‌ ఇంకా పోరాడు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుకరించిన మోదీ.. ‘పాదయాత్ర ఎలా సాగుతోంది? ఆరోగ్యం ఎలా ఉంది ?’ అంటూ ప్రశ్నిం చారు. ‘ఇంకా పోరాడు..’ అని అన్నారు. సభా వేదికపై మూడువరసల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఆసీనులయ్యారు. స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తలసాని వీడ్కోలు సందర్భంగా కనబడలేదు.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement