
ఎదురు కాల్పులా..? ఎన్‌కౌంటరా..?
యర్రగొండపాలెం: నల్లమల అడవిలో మావోయిస్టులు హతమైన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం యర్రగొండపాలెం మండలంలోని పాలుట్లకు సమీపంలో మోకాళ్లకురువ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు జానాబాబూరావు, విమల, నిర్మలలు హతమయ్యారు. పోలీసులు అడవిలో కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురపడి కాల్పులు జరిపారని, చేసేదిలేక తమ పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని గుంటూరు ఐజీ సునీల్‌కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియడం లేదు.
= గుంటూరు జిల్లాకు చెందిన పోలీసు ప్రత్యేక దళాలు అడవిలోని సుదూర ప్రాంతంలో కూబింగ్ ఎందుకు జరిపారో అర్థం కావడం లేదు. సమాచారం మేరకు అక్కడికి వచ్చి కూబింగ్ నిర్వహించి ఉండవచ్చు.
= పోలీసులు చెప్పినట్లు ఎదురు కాల్పులు జరిపిన ప్రాంతం ప్రకాశం జిల్లాలోనిది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలతో ఈ ప్రాంతానికి దగ్గరి సంబంధం ఉంది. అటువంటిది ఈ జిల్లాల పోలీసులు స్పందించకుండా గుంటూరు జిల్లాకు చెందిన పోలీసులు స్పందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
= ఎదురుకాల్పుల సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మావోయిస్టు విక్రమ్ తప్పించుకొని పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కూంబింగ్ సమయంలో పోలీసు ప్రత్యేక దళాలు సహజంగా వలయంగా ఏర్పడతాయి. ఇటువంటిది విక్రమ్ తప్పించుకునే అవకాశం ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు.
= అసలు విక్రమ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులను ముందుగానే పట్టుకొని ఆ తరువాత ఎన్‌కౌంటర్ చేసి ఉంటారన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
= ఈ అనుమానాలు కర్నూలు జిల్లా సున్నిపెంట ప్రాంతానికి చెందిన వారుకూడా వ్యక్తం చేస్తున్నారు.
= 3, 4 నెలల నుంచి హతమైన మావోయిస్టులు సున్నిపెంటకు సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న వజ్రాలమడుగు వద్ద తలదాచుకునేవారని తెలిసింది.
= వీరితోపాటు ఉంటున్న విక్రమ్ అనే మావోయిస్టు సాధారణ దుస్తుల్లో సంచరిస్తుండేవాడని, లింగాలగట్టు వద్దకు వచ్చి తమకు కావలసిన నిత్యావసర వస్తువులను తీసుకెళ్లేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని ముందుగా క స్టడీలోకి తీసుకొని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అటవీ అధికారులపై జరిగిన దాడులతో సంబంధం ఉందా?
కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకునే మత్స్యకారులపై గతనెల 29న యర్రగొండపాలెం మండలంలోని గంజివారిపల్లె బీట్‌కు చెందిన అటవీ అధికారులు దాడులు నిర్వహించారు. మత్స్యకారులు చేపలు పట్టుకోకుండా నెక్కంటివాగులో నుంచి అడవిలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడటం, చెట్లను నరికి కలపను కృష్ణానది నుంచి అక్రమంగా తరలించడం లాంటివి చేస్తున్నారన్న ఆరోపణలపై అటవీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో మత్స్యకారులు అటవీ అధికారులపై తిరుగుబాటు చేసి దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. అటవీ సిబ్బందిపై మత్స్యకారులు జరిపిన దాడులకు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
= హతమైన మావోయిస్టులకు కొంతకాలం నుంచి మత్స్యకారులతో సంబంధం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు రెచ్చకొట్టడం వల్లనే మత్స్యకారులు అటవీ సిబ్బందిపై దాడులకు దిగి ఉండవచ్చన్న అనుమానం లేకపోలేదు. మత్స్యకారులపై అటవీశాఖ సిబ్బంది యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మత్స్యకారులు మావోయిస్టులు తలదాచుకునే స్థావరాన్ని పోలీసులకు సమాచారం అందించి ఉంటారన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మత్స్యకారులకు పోలీసులు డబ్బులు ఎందుకిచ్చారు?
అటవీ సిబ్బంది దాడులు నిర్వహించి తమ జీవన భృతికి ఉపయోగపడే ఖరీదైన వలలు, బుట్ట పడవలు, గుడారాలు ధ్వంసం చేశారని మత్స్యకారులు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో నష్ట పరిహారం కింద పోలీసులు మత్స్యకారులకు పెద్ద మొత్తంలో సహాయం చేశారు. ఈ సహాయం ప్రకాశం జిల్లాకు చెందిన పోలీసులు, అటవీశాఖాధికారులు కాకుండా కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులు ఎందుకు చేశారో అర్థంకావడంలేదు. కర్నూలు ఓఎస్‌డీ ఇటీవల కాలంలో * 50 వేలు సహాయాన్ని అందజేశారు. పరిస్థితులను బట్టి చూస్తే మత్స్యకారులను పోలీసులు ఇన్‌ఫార్మర్లుగా ఉపయోగించుకొని మావోయిస్టులను పట్టుకొని ఉండవచ్చని తెలుస్తోంది.