అనుమానాలెన్నో..! | So many Doubts | Sakshi
Sakshi News home page

అనుమానాలెన్నో..!

Published Sun, Mar 4 2018 4:47 PM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM

So many Doubts - Sakshi

స్వామి మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యం

భద్రాచలం: ఎన్‌కౌంటర్‌ మృతుల వివరాలను వెల్లడించడంలో పోలీసు యంత్రాంగం తీవ్ర జాప్యం చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ సాగు తోంది. ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులతోపాటు ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ కూడా మృతి చెందడంతో తడపలగుట్ట వద్ద భీకర పోరు సాగిందని అంతా అనుకున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసు యంత్రాంగం స్పష్టమైన వివరాలను సకాలంలో వెల్లడించకపోవటంపై హక్కుల సంఘాల నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలు కుళ్లి కంపు కొడుతుండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని పూజారి కాంకేర్‌ అటవీ ప్రాంతంలో గల తడపలగుట్టపై శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, తమ బలగాలు ప్రతిఘటించటంతో పది మంది మావోయిస్టులతోపాటు ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడని ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా వెల్లడించారు. శుక్రవారం ఇద్దరు మావోయిస్టులతోపాటు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పోస్టుమార్టంపై పౌరహక్కుల సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించగా, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోనే ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని మధ్యాహ్నం తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం మృతదేహాలను తీసుకొచ్చేందుకు హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపించారు. కానీ సాంకేతిక ఇబ్బందులతో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాలేదని చెప్పి, వెనుదిరిగారు. దీంతో మిగిలిన ఎనిమిది మృతదేహాలను శనివారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
మృతదేహాల నుంచి తీవ్ర దుర్గంధం 
భద్రాచలం ఏరియా ఆస్పత్రికి శనివారం తీసుకొచ్చిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లి కంపుకొట్టాయి. అంబులెన్స్‌ నుంచి మృతదేహాలను పోస్టుమార్టం గది వద్దకు చేర్చే సమయంలో అక్కడున్న కొందరు సిబ్బంది ఆ వాసన భరించలేక వాంతులు చేసుకోవడం గమనార్హం. విధుల్లో ఉన్న సిబ్బంది, వైద్యులు అంతా ముక్కు మూసుకుని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను సకాలంలో పోస్టుమార్టం కోసం తరలించకపోవటం వల్లే అవి కుళ్లిపోయి, దుర్గంధం వస్తున్నాయని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కుల సంఘాల నాయకులు అన్నారు. పోలీసుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వివరాల వెల్లడిపై తర్జన భర్జన 
ఎన్‌కౌంటర్‌ మృతుల వివరాలను వెల్లడించటంలో పోలీసులు తర్జన భర్జన పడినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ మృతుల వివరాలను వెల్లడిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టినప్పటికీ పోలీసులు దీనిపై ఏమాత్రం స్పందించలేదు. మృతుల్లో మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు దడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్, రత్న ఉన్నారని, మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారని ప్రకటించారు.

ఇది సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగిన తర్వాత ఎస్పీ అంబర్‌ కిశోర్‌ ఝా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఇంకా మృతుల వివరాలను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా దడబోయిన స్వామి, అలియాస్‌ ప్రభాకర్, రత్నను గుర్తించామని చెప్పారు. అయితే అస్పత్రి వద్దకు మావోయిస్టుల బంధుమిత్రులు, పౌర హక్కుల సంఘాల నేతలు చేరుకోవటంతో మీడియాను అక్కడి నుంచి హడావిడిగా పంపించారనే ప్రచారం సాగింది. 

హరిభూషణ్‌ తెలియదా..?  
తడపల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, అతడి భార్య సమ్మక్క, బడే చొక్కారావు, అలియాస్‌ దామోదర్, కంకణాల రాజిరెడ్డి, ఆజాద్‌ వంటి కీలక నేతలు మృతి చెందారని ప్రచారం జరిగింది. హరిభూషణ్, అతడి భార్య సమ్మక్క ఉన్నారని పోలీసులు సైతం లీకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హరిభూషణ్‌ కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌ జిల్లా నుంచి భద్రాచలానికి శుక్రవారమే చేరుకున్నారు.

మృతదేహాలన్నీ శనివారం నాటికి భద్రాచలం చేరుకోవటంతో హరిభూషణ్‌ సోదరి యాప భారతి, అశోక్‌ పోస్టుమార్టం గదిలోకి వెళ్లి పరిశీలించారు. మృతుల్లో హరిభూషణ్‌ లేడని నిర్ధారించుకుని తిరిగి వెళ్లిపోయారు. అయితే మృతదేహాలను భద్రాచలం తరలించాక కూడా మృతుల్లో హరిభూషణ్‌ ఉన్నాడనే ప్రచారం సాగినప్పటికీ, దీనిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ ఎలా ఉంటాడనేది పోలీసులకు తెలియదా..? వివరాలను వెల్లడించటంలో ఎందుకిలా జాప్యం చేశారని పౌరహక్కుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement