మల్లెల తీర్థం
-
నాగర్‌కర్నూల్ జిల్లాకు అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టు
-
అచ్చంపేట, కొల్లాపూర్‌లో అధిక విస్తీర్ణం భూమి
-
అరుదైన జంతువులతో పాటు ఔషధ మొక్కలు
జాలువారే జలపాతాల సోయగాలు.. పచ్చదనంతో కనువిందు చేసే గిరులు, కొండల మధ్య ప్రవహించే కృష్ణమ్మ, నదిలో మత్య్సకారుల చేపల వేట, పక్షుల రాగాలు.. వన్యప్రాణుల అరుపులు.. చూపరులను ఇట్టే ఆకట్టుకునే అందాలు.. ఇలా ఎన్నో ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం నల్లమల సొంతం. ప్రస్తుతం కొత్త జిల్లాకు నల్లమల తలమానికం కానుంది. దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు జిల్లాల పునర్విభజనలో నాగర్‌కర్నూల్ జిల్లాలోకి రానుంది.
– అచ్చంపేట
టైగర్ ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 2,484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అడవి విస్తరించి ఉంది. ఇందులో 1750చదరపు కి.మీ. విస్తీర్ణాన్ని కోర్ ఏరియాగా, 445చదరపు కి.మీ.లలో బంపర్ ఏరియాగా, 289.47చదరపు కి.మీ.ల విస్తీర్ణాన్ని రిజర్వు ఫారెస్టుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీశాఖ సబ్ డివిజన్‌లు ఉన్నాయి. ఇందులో అచ్చంపేట సబ్‌డివిజన్ ఈ జిల్లాలో ఉండబోతుంది. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్‌టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల అభయారణ్యల్లో ఇదీ ఒక్కటి. రాష్ట్ర విభజనలో నాగార్జునసాగర్–శ్రీశైలం రాజీవ్ టైగర్ ప్రాజెక్టును నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రవాహిస్తున్న కృష్ణానది ఎడమ వైపు తెలంగాణ, కుడివైపు ఆంద్రప్రదేశ్‌కు కేటాయించారు. ఇదీ మొత్తం ఇప్పుడు నాగర్‌కర్నూల్‌కు రావడంతో ఇక్కడి వనరులు ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణ అటవీ పరిధిలో 15–20 వరకు పెద్ద పులులు ఉంటాయన్నది అధికారులు లెక్కలు. వివిధ రకాల వన్యప్రాణులకు నిలయంగా మారిన అభయారణ్యంలో పెద్దపులులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు, రేసులు, లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు,అడవిపందులు, అడవికుక్కలు, వంటి అనేక జంతువులు పక్షులు సేదతీరుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన 800ల రకాల ఔషధ, అలంకార మొక్కలు ఇక్కడ లభ్యమవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో కొనసాగుతున్న టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం అచ్చంపేటలో ఏర్పాటు చేయాల్సి ఉన్న ఇంత వరకు ఏర్పాటుకు నోచుకోలేదు.
జలవిద్యుత్ కేంద్రం..
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు భూగర్భ పవర్‌హౌస్‡నాగర్‌కర్నూల్ జిల్లాలోకి రానుంది. భూగర్భ పవర్ హౌస్‌లోని రివర్స్‌బుల్ పంపుల ద్వారా నీటిని వెనక్కి తొక్కి కేంద్రంలోని ఆరు జనరేటర్ల ద్వారా 900మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిని చేసే సామర్థ్యం ఉంది. ఈగలపెంట జెన్‌కో శక్తి సదన్‌లో తెలంగాణ జలవిద్యుత్ కేంద్రాల ముఖ్య ఇంజనీర్ కార్యాలయం కొనసాగుతోంది. ఈశక్తి సదన్ నుంచి జెన్‌కో జలవిద్యుత్ కేంద్రాల పని తీరు, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపైన ఉన్న 60 మెగావాట్లు కేంద్రం, సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలోని 815.6మెగావాట్లు, నిర్మాణంలో ఉన్న పులిచింతల 90 మెగావాట్లు, జూరాల ఎగువ, దిగువ 240 మెగావాట్ల కేంద్రాల పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుంది.
– కొత్త జిల్లాకు ఏపీ సరిహద్దు కలవనుంది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలో ఎడమగట్టు పాతాళగంగ వద్ద శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో వారధిగా ఉన్న బ్రిడ్జి అవతల ఏపీ సరిహద్దు ఉంది. ఇదీ కొత్త జిల్లా నాగర్‌కర్నూల్ పరిధిలోకి వస్తోంది.
జాతీయ రహదారి..
హైదరాబాద్–శ్రీశైలం–తోకపల్లి (దోర్నాల, నంద్యాల) 280 కిలోమీటర్ల జాతీయ రహదారిలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి కడ్తాల్ నుంచి పాతాళగంగ వరకు సుమారు 175 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మన్ననూర్ కుంచోనిమూల వరకు త్రీ వే రోడ్డు పనులు పూర్తయ్యాయి. డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మన్ననూర్–తోకపల్లి వరకు రోడ్డు విస్తరణ కొనసాగితే కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.