ఉల్లి కోసం కుళ్లబొడిచారు సార్
కర్నూలు : అభంశుభం తెలియని తమను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులు కుళ్లబొడిచేస్తున్నారంటూ నల్లమల్ల అటవీ ప్రాంతానికి చెందిన చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇటీవల ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దాంతో లారీలోని 15 టన్నుల ఉల్లిపాయలు స్థానిక చెంచులు తీసుకువెళ్లారని డ్రైవర్ ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన 15 మంది చెంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని స్టేషన్కు తరలించి...చిత్రహింసలకు గురి చేశారు. తమ వారిని విడిచిపెట్టలేదని కోపంతో ఉన్న చెంచులు శుక్రవారం భారీగా పోలీస్ స్టేషన్కి తరలి వచ్చారు. దీంతో 15 మందిని విడిచిపెట్టారు. పోలీసుల వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న చెంచులు శనివారం జిల్లా న్యాయమూర్తిని కలిశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి తమను పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు.
తాము ఉల్లిగడ్డలు చోరీ చేయలేదని... వాటి గురించే అసలు తమకు తెలియదని వారు పేర్కొన్నారు. ఉల్లిగడ్డల చోరీ కేసుతో చెంచులకు సంబంధం లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పినా పోలీసులు పట్టించుకోకుండా తమ వారిని కుళ్లపొడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.