ముగ్గురు మావోయిస్టుల మృతి
బుల్లెట్ గాయాలతో పారిపోయిన మరో సభ్యుడు
సాక్షి, ఒంగోలు: నల్లమల అడవుల్లో మళ్లీ తుపాకులు పేలాయి... పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్లకు ఏడుకిలోమీటర్ల దూరానున్న మురారికురవ అడవిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో మావోయిస్టు జానా బాబూరావుతోపాటు మరో ఇద్దరు మహిళలు విమల, భారతి ఉన్నారు. మరో సభ్యుడు విక్రమ్ తప్పించుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల క్యాట్‌పార్టీ, ఏఎన్‌ఎస్ పోలీసు బృందాలు కలిసి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. సుమారు అర్ధగంటపాటు సాగిన కాల్పుల్లో మావోయిస్టు సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఘటనాస్థలంలో నాలుగుకిట్లుతోపాటు ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే 47, కొన్ని విప్లవసాహిత్య పుస్తకాలు దొరకడంతో.. మరో సభ్యుడు విక్రమ్ కాలికి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆర్కేకు సన్నిహితుడు
మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా ప్రారంభమైన జానా బాబూరావు ప్రస్తుత కేంద్రకమిటీ అగ్రజుడైన ఆర్కేకు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన జానా బాబూరావు రెండేళ్ల కిందటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకువచ్చినట్లు ప్రకటించినా.. పోలీసులకు మాత్రం లొంగలేదు. అతన్ని పట్టుకునేందుకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పోలీసులు దాదాపు 15 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. గతంలో ఇద్దరు మహిళా మావోయిస్టులను వివాహం చేసుకున్న బాబూరావు తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం, మందవాగిపల్లెకు చెంది న నాగమణి అలియాస్ భారతిని వివాహమాడారు. ఆమెతో పాటు విమలను కూడా తోడుచేసుకుని నల్లమలలోనే సంచరిస్తున్నారు. ఆయనపై రూ. 5 లక్షల పోలీ సు రివార్డు ఉంది. నల్లమల ఫారెస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా, చాంద్రాయణగిరి డివిజన్ కమిటీ కార్యదర్శిగా బాబూరావు కొనసాగుతున్నట్టు తెలిసింది.