అడవిలో అగ్నిశిఖ | Rare Medicine In the Nallamala Forest | Sakshi
Sakshi News home page

అడవిలో అగ్నిశిఖ

Nov 15 2022 8:39 AM | Updated on Nov 15 2022 10:13 AM

Rare Medicine In the Nallamala Forest - Sakshi

పెద్దదోర్నాల (ప్రకాశం):  ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని వివిధ ప్రాంతాల్లో కనువిందు చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని పులిచెరువు, తుమ్మలబైలు తదితర ప్రాంతాల్లో ఈ తీగజాతి మొక్కలు విరివిగా పెరుగుతున్నాయి. అందమైన పుష్పాలతో ఆకట్టుకునే అగ్నిశిఖ మొక్కలు అత్యంత విషపూరితమైనవి. ఇందులో విషపూరితమైన కోల్చీసిన్‌ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. దీనిని ఇంగ్లిష్‌లో ఫ్లేమ్‌ లిల్లీ, ఫైర్‌ లిల్లీ, గ్లోరియసా లిల్లీ అని.. వాడుకలో నాగేటిగడ్డ, నీరుపిప్పిలి అని పిలుస్తుంటారు. ఇవి పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. వీటి పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు రంగు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి.  

ఆయుర్వేదంలో దివ్యౌషధం
ఆయుర్వేదంలో దీనిని దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలు అన్నీ విషపూరితమైనవే. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గాయాలకు మందులుగా వాడతారు. ఉదర క్రిములను బయటకు పంపించే మందుగాను, దీర్ఘకాలిక వ్రణాలు, కుష్టువల్ల కలిగే గాయాలు, మొలలు, పొత్తి కడుపు నొప్పి నివారణకు వినియోగిస్తారు. శరీరానికి బలవర్ధకమే కాక వీర్యవృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మన్యూనత లాంటి మానసిక రోగాలతో పాటు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక రోగ నివారణకు దీనిని వినియోగిస్తారు. సుఖవ్యాధుల చికిత్సలోనూ అడవినాభి ఉపయోగపడుతుంది. గర్భధారణ అవకాశాలను పెంచటంలో ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

అడవినాభి అద్భుతమైన ఔషధి  
నల్లమల అభయారణ్యంలోని కొన్ని ప్రాంతాల్లో లభించే అడవినాభి అరుదైన ఔషధ గుణాలు ఉన్న మొక్క. దీన్ని పలు పేర్లతో పిలుస్తుంటారు. పాముకాటు, తేలుకాటు, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలకు సంబంధించిన మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.  
– ఎం.రమేష్, సైంటిస్ట్, బయోడైవర్సిటీ, శ్రీశైలం ప్రాజెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement