నల్లమలలో సంచరిస్తున్న చిరుత
ప్రకాశం, పెద్దదోర్నాల: నల్లమల ఘాట్ రోడ్డులో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వాహనాలకు అడ్డువస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనెల 4వ తేదీ నల్లమల అభయారణ్యంలోని ఎకో టూరిజం వద్ద ఓ చిరుత రోడ్డుపై సంచరిస్తుండటంతో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని పెద్దదోర్నాల మండల కేంద్రంలోని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండల పరిధిలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో సంఘటనా స్థలంలోనే ఆ చిరుత మృతి చెందింది. ఈ సంఘటన కర్నూలు– గుంటూరు రోడ్డులో జనవరి 23వ తేదీన చోటు చేసుకుంది. అనంతరం అటవీశాఖ అధికారులు చిరుతను పోస్టుమార్టం నిర్వహించి నల్గమలలో దహనం చేశారు. జనవరి 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో శ్రీశైలం వెళ్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనానికి ఓ చిరుత అడ్డుగా రావటంతో వాహనం కొద్ది నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది.
ఈ సంఘటన శ్రీశైలం రోడ్డులోని తుమ్మలబైలుసమీపంలో చోటు చేసుకుంది. దీంతో పాటు రోళ్లపెంట బేస్ క్యాంపు ఎదుట తరచూ ఓ చిరుత సంచరిస్తుండటంతో బేస్ క్యాంపు సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖ ద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాతపడ్డాయి. చిరుతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించటానికి కారణం నల్లమలలో నీటి కొరతే అని అని పలువురు పేర్కొంటున్నారు. కాగా ఈ సంఘటనలపై అటవీశాఖాధికారులు మాత్రం వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల అవి విచ్చల విడిగా సంచరిస్తున్నాయని, అందు వల్లే ప్రమాదాలు జరుగుతుగున్నాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇలా క్రమం తప్పకుండా వన్యప్రాణులు రోడ్లపై సంచరిస్తూ వాహన ప్రమాదాలలో మృత్యువాత పడుతుండటంపై పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వన్యప్రాణులకు పొంచి ఉన్న నీటి ఎద్దడి:
వేసవి ఆరంభంలో ఎండలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వన్యప్రాణులతో పాటు పెద్ద పులులకూ నీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. అరణ్యంలోని కొన్ని చోట్ల జంతువులు పగటి వేళల్లోనూ రోడ్డు దాటుతున్నాయి. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఎకో టూరిజం వద్ద చిరుతపులి రోడ్డుపై సంచరిస్తూ కనబడటంపై వాహనదారుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే కొన్నేళ్లుగా చిరుత పులులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చిన్నపాటి చెక్‌డ్యాంలు, నీటి తొట్టెలు, కుంటలు, సాసర్ పిట్స్‌లను నిర్మించింది. వీటి నిర్వహణ కోసం వేసవి సీజన్‌లో లక్షల రూపాయలు ఖర్చు చేసి మొబైల్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం చెక్‌డ్యాంలలో నీరులేకపోవటంతో అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో జంతువులు పలు చోట్ల రోడ్లను దాటుతూ మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి.
సంరక్షణ చర్యలపై దృష్టి సారించాలి: వేసవి కాలంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యామ్నాయ చర్యలపై సమగ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అభయారణ్యం పరిధిలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే రేంజ్‌ల వారీగా పెద్దపులులు, చిరుత పులుల సంచారం అధికంగా ఉంటే ఏరియాల్లో నీటి నిల్వలను పెంచాలి. వన్యప్రాణులకు దాహార్తి తీర్చే టెస్టింగ్ సాల్ట్ వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం సోలార్‌తో నడిచే మోటార్లను సిద్ధం చేసుకోవాలి.
విభజనతో అభయారణ్యంఏపీలోనే అధికం
తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లోకే అధికంగా చేరింది. మొత్తం విస్తీర్ణం 2,444 చ.కి.మీ. అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. మార్కాపురం, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలో పెద్దపులులు, చిరుత పులుల సంఖ్య అధికంగా ఉంది. ఏటా జనవరిలో దేశవ్యాప్త (కేంద్ర స్థాయి) అభయారణ్యాల్లోనూ పులుల గణన జరుగుతుండగా ఏటా మే నెలలో రాష్ట్ర స్థాయి అభయారణ్యంలో పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో గణన ఆధారంగా పులుల సంఖ్య పెరుగుతోందని అటవీశాఖ పేర్కొంటోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 50 కు పైగా, చిరుతలు లెక్కకు మించి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment