leopord
-
కామారెడ్డి: హైవేపై చిరుత.. హడలిపోయిన ప్రయాణికులు
కామారెడ్డి : చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ అటవీ ప్రాంతంలో నేషనల్ హైవేపై చిరుత సంచరించింది.పులి సంచారంతో ఆందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష సాక్షి నుంచి వివరాలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించారు. అనంతరం, పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
చెరువులో పడి చిరుత మృతి
చిన్నశంకరంపేట (మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో ఓ చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోని పటేల్ చెరువులో రెండు మూడు రోజుల కిందటే ఏడేళ్ల వయసు గల చిరుత చెరువులో పడి మృతి చెందగా, మంగళవారం కళేబరం చెరువులో తేలింది. ఉదయం అక్కడికి వెళ్లిన స్థానిక రైతులు చిరుత కళేబరాన్ని గమ నించి సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్.. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణాగౌడ్, రామాయంపేట ఫారెస్ట్ రేంజర్ నజియాతబుసం, డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత కళేబరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముళ్ల పంది దాడి చేసినట్టు భావిస్తున్నారు. పొట్టభాగంలో గాయమైనట్లు గుర్తించారు. చిరుత అవయవ భాగాలను సేకరించి సంగారెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అనుమా నాస్పద స్థితిలో చెరువులో పడి చిరుత మృతి చెందిందని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. -
శ్రీశైలంలో చిరుతల సంచారం
శ్రీశైలం: శ్రీశైలం క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం రోడ్డు మార్గంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో దేవస్థానం మైకుల ద్వారా స్థానికులకు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. లాక్డౌన్ వల్ల శ్రీశైలానికి ఎలాంటి రాకపోకలూ లేవు. సున్నిపెంట– శ్రీశైలం మధ్య కూడా రాకపోకలపై నిషేధం ఉంది. అయితే.. సాక్షి గణపతి, హఠకేశ్వరం, చెక్‌పోస్ట్ తదితర ప్రదేశాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది శనివారం రాత్రి చిరుతల సంచారం గురించి తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు మైకుల ద్వారా స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణులు నీటి కోసం రహదారులను దాటుకుని వెళ్తుంటాయి. లాక్డౌన్ సందర్భంగా వాహన రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ఘాట్‌రోడ్లపై కనిపిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. -
‘చిరుత’ వీడియో ఆకతాయిల పనే!
జూబ్లీహిల్స్: సోషల్ మీడియాలో బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రి వైపు కేబీఆర్ పార్కు పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు వైరల్ అయిన వీడియో అవాస్తవం అని అధికారులు తేల్చేశారు. మంగళవారం తెలంగాణ యాంటీ పోచింగ్ స్క్వాడ్ బృందం కేబీఆర్ పార్కు పరిసరాల్లో విచారణ జరిపి ఈ వీడియో ఆకతాయిలు చేసిన పని అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ వీడియో తిరుమల కొండల్లోని సీసీ ఫుటేజీ వీడియో అని అనవసరంగా ఇక్కడి వీడియో అని కొంత మంది ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వైరల్ వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో అటవీ శాఖాధికారులు కౌసర్ అలీ, యాసిన్, మహేష్, సతీష్, శ్రీను పాల్గొన్నారు. -
చిరుతల కలకలం
ప్రకాశం, పెద్దదోర్నాల: నల్లమల ఘాట్ రోడ్డులో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. వాహనాలకు అడ్డువస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనెల 4వ తేదీ నల్లమల అభయారణ్యంలోని ఎకో టూరిజం వద్ద ఓ చిరుత రోడ్డుపై సంచరిస్తుండటంతో వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని పెద్దదోర్నాల మండల కేంద్రంలోని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మండల పరిధిలోని ఆర్.చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో సంఘటనా స్థలంలోనే ఆ చిరుత మృతి చెందింది. ఈ సంఘటన కర్నూలు– గుంటూరు రోడ్డులో జనవరి 23వ తేదీన చోటు చేసుకుంది. అనంతరం అటవీశాఖ అధికారులు చిరుతను పోస్టుమార్టం నిర్వహించి నల్గమలలో దహనం చేశారు. జనవరి 13వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో శ్రీశైలం వెళ్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనానికి ఓ చిరుత అడ్డుగా రావటంతో వాహనం కొద్ది నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. ఈ సంఘటన శ్రీశైలం రోడ్డులోని తుమ్మలబైలుసమీపంలో చోటు చేసుకుంది. దీంతో పాటు రోళ్లపెంట బేస్ క్యాంపు ఎదుట తరచూ ఓ చిరుత సంచరిస్తుండటంతో బేస్ క్యాంపు సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖ ద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాతపడ్డాయి. చిరుతలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించటానికి కారణం నల్లమలలో నీటి కొరతే అని అని పలువురు పేర్కొంటున్నారు. కాగా ఈ సంఘటనలపై అటవీశాఖాధికారులు మాత్రం వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల అవి విచ్చల విడిగా సంచరిస్తున్నాయని, అందు వల్లే ప్రమాదాలు జరుగుతుగున్నాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇలా క్రమం తప్పకుండా వన్యప్రాణులు రోడ్లపై సంచరిస్తూ వాహన ప్రమాదాలలో మృత్యువాత పడుతుండటంపై పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వన్యప్రాణులకు పొంచి ఉన్న నీటి ఎద్దడి: వేసవి ఆరంభంలో ఎండలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వన్యప్రాణులతో పాటు పెద్ద పులులకూ నీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. అరణ్యంలోని కొన్ని చోట్ల జంతువులు పగటి వేళల్లోనూ రోడ్డు దాటుతున్నాయి. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు తదితర ఎన్నో జంతువులు ఉన్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంపై అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ఎకో టూరిజం వద్ద చిరుతపులి రోడ్డుపై సంచరిస్తూ కనబడటంపై వాహనదారుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మూడు జిల్లాలకు ప్రధాన కార్యాలయంగా ఉన్న శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోనే కొన్నేళ్లుగా చిరుత పులులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చిన్నపాటి చెక్‌డ్యాంలు, నీటి తొట్టెలు, కుంటలు, సాసర్ పిట్స్‌లను నిర్మించింది. వీటి నిర్వహణ కోసం వేసవి సీజన్లో లక్షల రూపాయలు ఖర్చు చేసి మొబైల్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ప్రస్తుతం చెక్‌డ్యాంలలో నీరులేకపోవటంతో అవి చాలా చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. దీంతో తాగునీరు లేకపోవడంతో జంతువులు పలు చోట్ల రోడ్లను దాటుతూ మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు వినపడుతున్నాయి. సంరక్షణ చర్యలపై దృష్టి సారించాలి: వేసవి కాలంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యామ్నాయ చర్యలపై సమగ్ర దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అభయారణ్యం పరిధిలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే రేంజ్‌ల వారీగా పెద్దపులులు, చిరుత పులుల సంచారం అధికంగా ఉంటే ఏరియాల్లో నీటి నిల్వలను పెంచాలి. వన్యప్రాణులకు దాహార్తి తీర్చే టెస్టింగ్ సాల్ట్ వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం సోలార్‌తో నడిచే మోటార్లను సిద్ధం చేసుకోవాలి. విభజనతో అభయారణ్యంఏపీలోనే అధికం తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో పెద్ద పులులు అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లోకే అధికంగా చేరింది. మొత్తం విస్తీర్ణం 2,444 చ.కి.మీ. అభయారణ్యం ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఫలితంగా పులులు, చిరుతల సంఖ్య కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. మార్కాపురం, ఆత్మకూరు అటవీ డివిజన్ల పరిధిలో పెద్దపులులు, చిరుత పులుల సంఖ్య అధికంగా ఉంది. ఏటా జనవరిలో దేశవ్యాప్త (కేంద్ర స్థాయి) అభయారణ్యాల్లోనూ పులుల గణన జరుగుతుండగా ఏటా మే నెలలో రాష్ట్ర స్థాయి అభయారణ్యంలో పులుల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో గణన ఆధారంగా పులుల సంఖ్య పెరుగుతోందని అటవీశాఖ పేర్కొంటోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలోని అభయారణ్యంలో 50 కు పైగా, చిరుతలు లెక్కకు మించి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
చిరుత కలకలం!
అనంతగిరి: మండల కేంద్రమైన అనంతగిరి వాసులు బుధవారం భయంతో వణికిపోయారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిందనే ప్రచారం జరగడమే. ఉదయం నుంచి సాయింత్రం వరకూ అనంతగిరిలోని శ్రీరామ గుడి సమీపంలో ఉన్న తుప్పల్లో చిరుత ఉన్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న పీహెచ్సీ కాలనీ సమీపంలో ఉన్న కొండ నుంచి ఉదయం దిగివచ్చిన చిరుతపులి శ్రీరాముని గుడి వద్దకు వచ్చి తుప్పల్లోకి వెళ్లడం తాము చూశామని కొంతమంది చెబుతున్నారు. ఉదయం పూట కావడంతో జనసంచారం తక్కువగా ఉండడంతో పులిని కొద్దిమంది మాత్రమే చూశామంటున్నారు. గత ఏడాది కూడా అనంతగిరి అటవీ ప్రాంత గ్రామాల్లో జన్మభూమి మా–ఊరు కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందికి ఎగువశోభ పంచాయతీకి వెళ్లే మార్గమధ్యలో చిరుతపులి కనిపించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో గాలించిన అటవీశాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో పులి లేదని.. అధికారులు కనిపించింది దుమ్మలగుండగా తేల్చిచెప్పారు. అయితే తాజాగా మరోసారి అనంతగిరి ప్రాంతంలో చిరుత కనిపించిందని గిరిజనులు చెబుతుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
నంద్యాలలో చిరుత సంచారం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణం ఎస్సార్బీసీ కాలనీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జంతువు ఏదో సంచరిస్తుండగా అక్కడే పనిచేసే ముగ్గురు సెక్యూరిటీ గార్డ్లు టార్చ్‌లైట్ వేసి చూశారు. చిరుతపులి అని గ్రహించి భయంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. దాదాపు అరగంట పాటు పక్కనే ఉన్న పొలాల్లో చిరుత సంచరించింది. స్థానికులు అక్కడికి చేరుకోగానే పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. సెక్యూరిటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించటంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 7 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చిరుత అడుగు జాడలను గమనించినట్లు డీఎఫ్‌వో శివశంకర్ రెడ్డి తెలిపారు. రాత్రిళ్లు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టి ఎలాగైనా చిరుతను పట్టుకుంటామని స్పష్టం చేశారు. భయంతో పరుగులు తీశాం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏదో జంతువు మేము ఉన్న చోటికి రావటం గమనించాం. అనుమానంతో టార్చ్‌లైట్ వేసిచూస్తే చిరుతపులి కనిపించింది. గట్టిగా గాండ్రించటంతో భయంతో కాలనీలోకి పరుగులు తీశాం. స్థానికులకు పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందించాం. –ప్రకాశ్, సెక్యూరిటీ సిబ్బంది -
టార్గెట్ చిరుత
సాక్షి, సిటీబ్యూరో: వివిధ రాష్ట్రాల అడవుల్లోని చిరుతలు, పులులే లక్ష్యంగా వేట సాగించి వాటి చర్మం, గోళ్లను బ్లాక్ మార్కెట్లో రూ.లక్షలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి చిరుత చర్మం, నాలుగు గోళ్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి, డీఎఫ్ఓ శివయ్యలతో కమిషనర్ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. చిరుతలు, పులులు ఎక్కువగా సంచరించే సిర్పూర్ కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం, మహారాష్ట్ర తడోబా అటవీ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, వైజాగ్ అటవీ ప్రాంతాల్లో 8–10 మంది సభ్యుల ముఠా వేట కొనసాగించేది. చిరుత, పులి చర్మం, గోళ్లు బ్లాక్ మార్కెట్లో రూ.లక్షల్లో ధర పలుకుతుండడంతో ప్రొఫెషనల్ వేటగాళ్లు అయిన ఒడిశాకు చెందిన వీరు గత కొన్ని నెలలుగా వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ఆయా జంతువుల కదలికలపై వీరికి ఎక్కువగా అవగాహన ఉండడంతో... ఆయా ప్రాంతాల్లో తీగల ఉచ్చులు ఏర్పాటు చేసి వలపన్ని పట్టుకునేవారు. ఈ విధంగానే మూడు నెలల క్రితం ఓ మగ చిరుతను చంపి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి ఎండబెట్టారు. రెండేళ్ల వయసున్న ఈ చిరుత చర్మాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తామని తమ పరిచయస్తులకు ఒడిశాకు చెందిన బసుదేవ్ మస్తీ, జగన్నాథ్ సిసా, బలి పంగి చెప్పారు. అయితే వీరికి సహకరిస్తున్న విశాఖపట్టణానికి చెందిన నాగోతి భాను హైదరాబాద్‌లో విక్రయిద్దామని సూచించాడు. ఎల్బీనగర్లోని మయూరి హోటల్లో సోమవారం కస్టమర్ కోసం వేచి చూస్తుండగా... సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, సివిల్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. చిరుత చర్మం, గోళ్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. అవసరాన్ని బట్టి... కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా వీరు చిరుత, పులులను చాకచాక్యంగా వేటాడేవారు. తీగల ఉచ్చులో పడేలా చూసి చంపేవారు. ఆ తర్వాత జాగ్రత్తగా చర్మాన్ని తొలగించడంతో పాటు గోళ్లను తీసేసి కస్టమర్లకు విక్రయించేవారు. చిరుత చర్మాన్ని కొన్నిసార్లు రూ.5లక్షలకు, మరీ డిమాండ్ ఉంటే రూ.10 లక్షలకు అమ్మేవారు. పులి చర్మాన్ని మాత్రం రూ.25లక్షలకు విక్రయించే వారని సీపీ మహేశ్ భగవత్ వివరించారు. -
చిరుతపులి దాడిలో ఇద్దరికి గాయాలు
-
చిక్కని చిరుత
తూర్పుగోదావరి, ఆత్రేయపురం: చిరుతపులి ఆచూకీ కోసం బుధవారం మూడురోజూ వేట కొనసాగింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు చిరుత పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. అంకంపాలెం గ్రామంలో ఈనెల 4న చిరుతపులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి పాఠకులకు విదితమే. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికార్లు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. అప్పటి నుంచి అధికారులు చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిరుతపులి దాడిలో గాయపడిన వ్యక్తులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడో రోజు బుధవారం కాకినాడ అటవీ శాఖ రేంజ్ బృందం ఆపరేషన్ కొనసాగించింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ ప్రాంత ప్రజల భయాందోళనపై స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపి చిరుత పులి ఆచూకీ పసిగట్టి పట్టుకోవాలన్నారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా కొందరు చిరుత పులి దాడికి గురయ్యారన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా కేవలం పది మందితో కంటి తుడుపు చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. ప్రజల్లో ఆందోళన.. మూడు రోజుల నుంచి అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించకుండా, చిరుతపులిని పట్టుకోకుండా, కాలక్షేపం చేయడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో గౌతమీ, వశిష్టా గోదావరి సమీపంలో ఉండడంతో చిరుతపులి పారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటవీ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. చిరుత పులిని ఇప్పట్లో బంధించే అవకాశాలు లేకపోవడంతో కంటి మీద కునుకు లేకుండా ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలంవెల్లదీస్తున్నారు. -
క్షణ క్షణం భయం భయం
ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామంలో చిరుతపులి బీభత్సం నేపథ్యంలో, మంగళవారం అంకంపాలెంతో పాటు ర్యాలి, లొల్ల గ్రామాల్లో పరిస్థితి క్షణక్షణం భయం భయంగా ఉంది. అంకంపాలెంలో సోమవారం రాత్రి చిరుతపులి బీభత్సం సృష్టించి నలుగురి వ్యక్తులను గాయపర్చి చెట్టుపైకి చేరిన విషయం విదితమే. అంకంపాలెంలో సోమవారం రాత్రి కొబ్బరి చెట్టుపై ఉన్న చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు, ప్రజలు రాత్రంతా పహరా కాశారు. అర్ధరాత్రి దాటిన తరువాత పులి హఠాత్తుగా చెట్టు దిగి పొలాల వైపు పరుగుతీసింది. కటిక చీకటి కావడంతో ఆ పులిని పట్టుకోవడంలో అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ పరిణామానికి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ పొలాలు వైపు చూస్తూ రాత్రంతా గడిపారు. పరారైన పులిని పట్టుకునేందుకు జంతు ప్రదర్శన శాల ఎక్స్‌ఫర్ట్ శ్రీనివాసరావు, వెటర్నరీ వైద్య నిపుణులు ఫణీంద్ర ఆధ్వర్యంలో అటవీ, పోలీసు శాఖల అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎంత ప్రయత్నించినా.. చెట్టుపై ఉన్న చిరుతపులిని బంధించేందుకు సోమవారం రాత్రి అధికారులు విఫలయత్నం చేశారు. ర్యాలి రోడ్డు పక్క వన్యప్రాణుల రక్షణ వాహనంతో బోనును సిద్ధం చేసుకున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నుంచి చెట్లపై నుంచి దించడానికి క్రేన్, లిఫ్టును కూడా సిద్ధం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి నందనీ సలారియా సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులతో చిరుతపులిని బంధించేందుకు సమాయత్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంకంపాలెం చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా అటవీ, రెవెన్యూ, పోలీసు అధికార్లు దృష్టికి చిరుత పులి సంచారం గురించి తెలిపారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు ఒక సమయంలో లైట్లు ఆర్పివేయడంతో చిరుతపులి తప్పించుకుని పొలాల్లోకి పారిపోయిందని ప్రజలు చెబుతున్నారు. అధికారుల పరుగులు చెట్టుపై నుంచి పొలాల్లోకి చిరుతపులి పారిపోయిన నేపథ్యంలో, మంగళవారం అధికారులు హడావుడి తీవ్రమైంది. కాకినాడ అటవీ శాఖ రేంజ్ బృందం ఆపరేషన్ కొనసాగిస్తోంది. అమలాపురం అర్డీఓ వెంకటరమణ, డీఎస్పీ రమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసులు పులి వేటలో పడ్డారు. రావులపాలెం ఆటవీ శాఖ తనిఖీ అధికారి రవి, డిప్యూటీ రేంజ్ అధికారి కందికుప్ప సత్యనారాయణ, అటవీ బీట్ అధికారులు చంద్రరావు, శ్రీహరి, సత్యనారాయణ, శ్రీను, గోకవరం రేంజ్ రంగరావు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాన రాని పులి జాడ మంగళవారం రాత్రి వరకు చిరుతపులి జాడ తెలియలేదు. పంట పొలాలు , కాలువల మధ్య ఎక్కడ ఉందోనని రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో వశిష్టా గోదావరి సమీపం నుంచి చిరుతపులి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ నిపుణులు అంటున్నారు. విశాలమైన పంట పొలాలు, నదీకాలువలు మద్య చిరుతపులిని పట్టుకోవడంలో వివిధ శాఖల అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత పులిని బంధించేవరకు కంటిపై కునుకు ఉండదని ఈ ప్రాంతంలో ప్రజలు వాపోతున్నారు. పరిసర గ్రామాలు ప్రధానంగా లొల్ల, మెర్లపాలెం తదితర గ్రామాల వైపు చిరుతపులి వెళ్లి ఉంటుందన్న అభిప్రాయాలు రావడంతో ఆ ప్రాంతీయులు హడలిపోతున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం పులి దాడిలో గాయపడిన వారు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత.. అంకంపాలెం సమీప గ్రామాల్లో చిరుత పులిదాడి వల్ల వచ్చే నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా చిరుతపులి దాడికి ప్రజలు గురయ్యారని, ప్రత్యేక బృందాలతో చిరుతపులిని పట్టుకోవాలన్నారు. ప్రజలు చిరుత పులి సంచారం వల్ల గ్రామాల్లో సంచరించాలంటే భయపడిపోతున్నారు. అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని సకాలంలో రంగంలోకి దించలేదని విమర్శించారు. అధికారులు సమర్థంగా ఆపరేషన్ నిర్వహించకపోవడం వల్లే చిరుతపులి తప్పించుకుని పోయిందన్నారు. ప్రాణనష్టం జరిగినా అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
అమ్మో చిరుత!
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో చిరుత ఉందని మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి క్యాంపస్‌లోని గోప్స్ ప్రాంతంలో గేదె మృతి చెంది ఉండడంతో, దాన్ని చిరుతే చంపిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం ఉదయం వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లెన్స్ బృందం గమనించి, కుక్కలే దాడి చేసి ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే గేదె ముఖం భాగంలో గాయాలుండడం, భారీ రక్తస్రావం కావడంతో పలువురు చిరుతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గేదె మరణించిన ప్రదేశానికి సమీపంలోని బురదలో కాలి గుర్తులు పడ్డాయి. అవి చిరుతవని పలువురు అనుమానిస్తుండగా, కాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. నమ్మొద్దు... క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించిందని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లైన్ బృందం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి గమనించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో చిరుత క్యాంపస్‌లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. వదంతులను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు. వేటగాళ్ల బెడద... హెచ్‌సీయూ క్యాంపస్‌లో కుక్కల బెడదను తీర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్యాయంగా మూగజీవాలు బలవుతున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేటగాళ్లు తరచూ క్యాంపస్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి చొరబడి జంతువులను వేటాడుతున్నారని పేర్కొంటున్నారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వామ్మో.. చిరుత
► మొన్న తుక్కాపూర్ తాజాగా కోరంపల్లిలో సంచారం ► పత్తి చేనులో నక్కిన చిరుత ► అతి సమీపం నుంచి చూసిన కూలీలు ► భయంతో పరుగులు గాలిస్తున్న అధికారులు ► వణుకుతున్న జనం అప్రమత్తంగా ఉండాలని ► పలు గ్రామాల్లో దండోరా టేక్మాల్: చిరుత పులుల సంచారంతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల కొల్చారం మండలం తుక్కాపూర్లోకి ప్రవేశించిన చిరుత స్వైర విహారం చేసింది. ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచింది. ఇదీగాకుండా జిల్లాలోని పలుచోట్ల చిరుతల సంచారాన్ని స్థానికులు గుర్తించారు. ఇదిలావుంటే తాజాగా బుధవారం టేక్మాల్ మండలం కోరంపల్లిలోని ఓ పత్తి చేనులో నక్కిన చిరుతను కూలీలు గుర్తించారు. అది గుక్కపెట్టి నిద్రిస్తుండడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. మంజీర నది పరీవాహక ప్రాంతంలో గ్రామానికి చెందిన బాగారెడ్డి పత్తి చేనులో పది మంది కూలీలు పత్తి తీస్తున్నారు. చాకలి సత్యమ్మ సాలులో చిరుత నిద్రిస్తూ కనిపించింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మరో కూలీ యాదమ్మతో చెప్పగా ఆమె కూడా చిరుతను చూసి పరుగులు తీశారు. వారంతా గ్రామంలోకి వెళ్లి విషయాన్ని చెప్పారు. ఎస్ఐ శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ తులసీరాం, మెదక్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్‌కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హశ్వక్, సెక్షన్ ఆఫీసర్ యాదయ్యతోపాటు సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పత్తి చేనులోకి వెళ్లి వెతికారు. ఎక్కడా కన్పించ లేదు. అయితే చిరుత పాద ముద్రలు గుర్తించారు. అంతకుముందు ఎస్ఐ, తహశీల్దార్ గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒంటరిగా తిరగకూడదని, ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు గాలింపులు జరుగుతాయన్నారు. మండలంలోని కోరంపల్లితోపాటు దనూర, ఎలకుర్తి, శేర్పల్లి తదితర గ్రామాల్లోనూ చిరుత సంచరిస్తుందని, అంతా జాగ్రత్తగా ఉండాలంటూ దండోర వేయించారు. పానం పోయినట్టయింది... నా పత్తి సాలులోనే నాలుగు అడుగుల దూరంలో గుక్కపెట్టి నిద్రపోతున్న పులిని చూసే సరికి పానం పోయినట్టయింది. భయంతో పత్తి సంచిని తీసుకొని పరిగెత్తా. ప్రాణాలతో భయటపడ్డా కాని ఆలోచిస్తేనే భయంగా ఉంది. - చాకలి సత్యమ్మ చాలా భయమేసింది... టీవీలో చూసే పులిని స్వయంగా చూసే సరికి చాలా భయమేసింది. పెద్దటి మీసాలతో ఓ పక్కకు తలపెట్టి పడుకుంది. ఒక్కసారిగా మాట ఆగిపోయింది. కాళ్లు చేతులు ఆడలేవు. - కల్లు యాదమ్మ