► మొన్న తుక్కాపూర్ తాజాగా కోరంపల్లిలో సంచారం
► పత్తి చేనులో నక్కిన చిరుత
► అతి సమీపం నుంచి చూసిన కూలీలు
► భయంతో పరుగులు గాలిస్తున్న అధికారులు
► వణుకుతున్న జనం అప్రమత్తంగా ఉండాలని
► పలు గ్రామాల్లో దండోరా
టేక్మాల్: చిరుత పులుల సంచారంతో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల కొల్చారం మండలం తుక్కాపూర్‌లోకి ప్రవేశించిన చిరుత స్వైర విహారం చేసింది. ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసి గాయపరిచింది. ఇదీగాకుండా జిల్లాలోని పలుచోట్ల చిరుతల సంచారాన్ని స్థానికులు గుర్తించారు. ఇదిలావుంటే తాజాగా బుధవారం టేక్మాల్ మండలం కోరంపల్లిలోని ఓ పత్తి చేనులో నక్కిన చిరుతను కూలీలు గుర్తించారు. అది గుక్కపెట్టి నిద్రిస్తుండడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. మంజీర నది పరీవాహక ప్రాంతంలో గ్రామానికి చెందిన బాగారెడ్డి పత్తి చేనులో పది మంది కూలీలు పత్తి తీస్తున్నారు.
చాకలి సత్యమ్మ సాలులో చిరుత నిద్రిస్తూ కనిపించింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మరో కూలీ యాదమ్మతో చెప్పగా ఆమె కూడా చిరుతను చూసి పరుగులు తీశారు. వారంతా గ్రామంలోకి వెళ్లి విషయాన్ని చెప్పారు. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ తులసీరాం, మెదక్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యామ్‌కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హశ్వక్, సెక్షన్ ఆఫీసర్ యాదయ్యతోపాటు సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పత్తి చేనులోకి వెళ్లి వెతికారు. ఎక్కడా కన్పించ లేదు. అయితే చిరుత పాద ముద్రలు గుర్తించారు.
అంతకుముందు ఎస్‌ఐ, తహశీల్దార్ గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒంటరిగా తిరగకూడదని, ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు గాలింపులు జరుగుతాయన్నారు. మండలంలోని కోరంపల్లితోపాటు దనూర, ఎలకుర్తి, శేర్‌పల్లి తదితర గ్రామాల్లోనూ చిరుత సంచరిస్తుందని, అంతా జాగ్రత్తగా ఉండాలంటూ దండోర వేయించారు.
పానం పోయినట్టయింది...
నా పత్తి సాలులోనే నాలుగు అడుగుల దూరంలో గుక్కపెట్టి నిద్రపోతున్న పులిని చూసే సరికి పానం పోయినట్టయింది. భయంతో పత్తి సంచిని తీసుకొని పరిగెత్తా. ప్రాణాలతో భయటపడ్డా కాని ఆలోచిస్తేనే భయంగా ఉంది.
- చాకలి సత్యమ్మ
చాలా భయమేసింది...
టీవీలో చూసే పులిని స్వయంగా చూసే సరికి చాలా భయమేసింది. పెద్దటి మీసాలతో ఓ పక్కకు తలపెట్టి పడుకుంది. ఒక్కసారిగా మాట ఆగిపోయింది. కాళ్లు చేతులు ఆడలేవు.
- కల్లు యాదమ్మ
వామ్మో.. చిరుత
Published Thu, Dec 17 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM
Advertisement
Advertisement