పులి వచ్చినట్టు గిరిజనులు చెబుతున్న అనంతగిరి అటవీ ప్రాంతం
అనంతగిరి: మండల కేంద్రమైన అనంతగిరి వాసులు బుధవారం భయంతో వణికిపోయారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిందనే ప్రచారం జరగడమే. ఉదయం నుంచి సాయింత్రం వరకూ అనంతగిరిలోని శ్రీరామ గుడి సమీపంలో ఉన్న తుప్పల్లో చిరుత ఉన్నట్టు స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న పీహెచ్‌సీ కాలనీ సమీపంలో ఉన్న కొండ నుంచి ఉదయం దిగివచ్చిన చిరుతపులి శ్రీరాముని గుడి వద్దకు వచ్చి తుప్పల్లోకి వెళ్లడం తాము చూశామని కొంతమంది చెబుతున్నారు. ఉదయం పూట కావడంతో జనసంచారం తక్కువగా ఉండడంతో పులిని కొద్దిమంది మాత్రమే చూశామంటున్నారు. గత ఏడాది కూడా అనంతగిరి అటవీ ప్రాంత గ్రామాల్లో జన్మభూమి మా–ఊరు కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందికి ఎగువశోభ పంచాయతీకి వెళ్లే మార్గమధ్యలో చిరుతపులి కనిపించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో గాలించిన అటవీశాఖ అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో పులి లేదని.. అధికారులు కనిపించింది దుమ్మలగుండగా తేల్చిచెప్పారు. అయితే తాజాగా మరోసారి అనంతగిరి ప్రాంతంలో చిరుత కనిపించిందని గిరిజనులు చెబుతుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment