కొబ్బరి చెట్టుపై చిరుతపులి (ఫైల్)
తూర్పుగోదావరి, ఆత్రేయపురం: చిరుతపులి ఆచూకీ కోసం బుధవారం మూడురోజూ వేట కొనసాగింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు చిరుత పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. అంకంపాలెం గ్రామంలో ఈనెల 4న చిరుతపులి బీభత్సం సృష్టించి నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరిన సంగతి పాఠకులకు విదితమే. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికార్లు లైట్లు ఆపివేయడంతో చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది.
అప్పటి నుంచి అధికారులు చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిరుతపులి దాడిలో గాయపడిన వ్యక్తులు రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడో రోజు బుధవారం కాకినాడ అటవీ శాఖ రేంజ్ బృందం ఆపరేషన్ కొనసాగించింది. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ ప్రాంత ప్రజల భయాందోళనపై స్పందిస్తూ వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపి చిరుత పులి ఆచూకీ పసిగట్టి పట్టుకోవాలన్నారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా కొందరు చిరుత పులి దాడికి గురయ్యారన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టకుండా కేవలం పది మందితో కంటి తుడుపు చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు.
ప్రజల్లో ఆందోళన..
మూడు రోజుల నుంచి అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించకుండా, చిరుతపులిని పట్టుకోకుండా, కాలక్షేపం చేయడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో గౌతమీ, వశిష్టా గోదావరి సమీపంలో ఉండడంతో చిరుతపులి పారిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అటవీ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. చిరుత పులిని ఇప్పట్లో బంధించే అవకాశాలు లేకపోవడంతో కంటి మీద కునుకు లేకుండా ఈ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలంవెల్లదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment