
నల్లమలలో మావోయిస్టులు లేనట్లేనా?
యర్రగొండపాలెం : నల్లమల అడవుల్లో మావోయిస్టులు దాదాపూ లేన ట్లేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మండలంలోని పాలుట్లకు సమీపంలో మోకాళ్ల కురువ వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. జానాబాబూరావు, విమల, నిర్మలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విక్రమ్‌లు నల్లమలలో మావోయిస్టు ఉద్యమం నిర్వహిస్తున్నారు. వీరు గుంటూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటి స్తూ పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్‌కౌంటర్‌లో విక్రమ్ బుల్లెట్ గాయంతో తప్పించుకుపోగా మిగిలిన ముగ్గురూ హతమయ్యారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపూ నిలిచిపోయినట్లయిందనిపోలీసు అధికారులు భావిస్తున్నారు.
= 2001లో యర్రగొండపాలెం పోలీసుస్టేషన్‌పై దాడి సంఘటనలో ఒక మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు.
= 2001 జూన్ 17న యర్రగొండపాలెం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాలకూరి సైదులు హతమయ్యాడు.
= 2002 ఆగస్టు 1న యర్రగొండపాలెం మండలం ఆలాటం కోట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల కమాండర్ గుడ్డి శేషన్న హతమయ్యాడు.
= 2003 జూలై 3వ తేదీన యర్రగొండపాలెం మండలం పాలుట్ల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నాగమణి అనే మహిళ మావోయిస్టు మృతి చెందింది.
= 2003 జూలై 4వ తేదీన యర్రగొండపాలెం మండలం నెక్కంటి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళ మావోయిస్టు మృతి చెందింది.
= 2004 ఏప్రిల్ 17న అర్ధవీడు మండలం యాచారం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మూగన్న, బయ్యన్నలు హతమయ్యారు.
= 2005 జనవరి 6వ తేదీన యర్రగొండపాలెం మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సింగా కృష్ణయ్య హతమయ్యాడు.
= 2005 జనవరి 8వ తేదీన రాచర్ల మండలం గంజివారిపుల్లలచెరువు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు లతక్క హతమైంది.
= 2005 జూలై 28న చీమకూర్తి మండలం దేవరపాలెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో డెంగూ శ్రీను హతమయ్యాడు.
= 2005 డిసెంబర్ 10వ తేదీన పుల్లలచెరువు మండలం మర్రివేముల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కుంకూరి వెంకటేశ్వర్లు, వింజమూరి మరియమ్మలు హతమయ్యారు.
= 2005 ఏప్రిల్ 20న పుల్లలచెరువు మండలం మర్రివేముల వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టులు వంసంత, సునీతలు హతమయ్యారు.
= 2006 ఏప్రిల్ 30వ తేదీన దోర్నాల మండలం పెద్దారూట్లవద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాదే శ్రీను, అతని భార్య మృతి చెందారు.
= 2006 మే 21వ తేదీన అర్ధవీడు మండలం మాగుటూరి తండా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళ మావోయిస్టు చంద్రకళ హతమైంది.
= 2006 ఫిబ్రవరి 5న రాచర్ల మండలం నెమలిగుండ్లరంగస్వామి ఆలయం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ఈశ్వరమ్మ, రంగయ్య, ఆంజనేయులు హతమయ్యారు.
= 2006 మే 17న అర్ధవీడు మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు షేక్ మీరాంబీ మృతి చెందింది.
= 2006 జూన్ 16వ తేదీన పుల్లలచెరువు మండలం పీఆర్‌సీ తండా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్రకమిటీ సభ్యుడు మట్టా రవికుమార్ హతమయ్యాడు.
= 2006 జూన్17న రాచర్ల మండలం సంగంపేట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నారాయణనాయక్, బోయ స్వర్ణ, చాకలి ఆదెమ్మలు మృతి చెందారు.
= 2006 జూలై 3న యర్రగొండపాలెం మండలం యక్కంటి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కార్యదర్శి మధవ్‌తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
= 2007 జూలై 22న పుల్లలచెరువు మండలం రాచకొండవద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్ హతమయ్యాడు.
= 2009 జనవరి 17వ తేదీన పుల్లలచెరువు మండలం మల్లపాలెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవిందనాయక్ హతమయ్యాడు.
= 2009 ఫిబ్రవరి 24న పెద్దారవీడు మండలం చింతలముడిపి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సండ్రపాటి ప్రసాద్, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, యనిమా, శాంతిలు చనిపోయారు.
= 2010 మార్చి 12న పుల్లలచెరువు మండలం మురికిమళ్లవద్ద వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు హతమయ్యాడు.
= 2007లో పుల్లలచెరువు మండలం అక్కపాలెంవద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంద్రవంక దళ కమాండర్ సునీల్, అతని భార్య హతమయ్యారు.
మవోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నేడు
యర్రగొండపాలెం : నల్లమలలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలకు మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. జానాబాబురావు అలియాస్ అశోక్ అలియాస్ చక్రవర్తి, విమల అలియాస్ భారతి, నిర్మల అలియాస్ లలిత మృతదేహాలను భారీ బందోబస్తు నడుమ ఆస్పత్రికి తెచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పోలీసులు శుక్రవారం వేకువ జామునే మోకాళ్ల కురువకు తరలి వెళ్లారు. అక్కడి నుంచి మృతదేహాలను కృష్ణానది ఒడ్డుకు చేర్చి లాంచీల్లో కర్నూలు జిల్లా లింగాల గట్టు వద్దకు తీసుకెళ్తారు. తొలుత సుండిపెంట వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించాలని భావించిన పోలీసులు.. చివరి క్షణంలో తమ నిర్ణయాన్ని మార్చుకుని మృతదేహాలను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు.
రాకెట్ లాంచర్ల ప్రయోగం ఇక్కడి నుంచే..
మావోయిస్టులు తయారు చేసిన రాకెట్ లాంచర్లను ఈ ప్రాంతం నుంచే ప్రయోగించారు. లాంచర్లు తయారైన తర్వాత మావోయిస్టు నాయకుడు టెక్ మధును బెంగళూరులో పట్టుకున్నారు. అందులో 98శాతం లాంచర్లు యర్రగొండపాలెం ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లచెరువు మండలం శతకోడువద్ద రాకెట్ లాంచర్ల డంపు, పాతచెరువు తండా వద్ద మరో డంపును పోలీసులు పట్టుకున్నారు. ఈ లాంచర్లను దేశంలో మొట్టమొదటి సారిగా గుంటూరు జిల్లా దుర్గి పోలీస్‌స్టేషన్‌పై ప్రయోగించారు. ఆ లాంచర్ గురితప్పి పక్కన పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.