నల్లమల అభయారణ్యంలో దొరికే భూచక్ర గడ్డ
ఈ మధుర దుంపతో గిరిజనులకు అవినాభావ సంబంధం
భూగర్భంలో 10 నుంచి 15 అడుగుల మేర పెరుగుదల
ఇందులో ఎనలేని ఔషధ గుణాలున్నాయని నమ్మకం
పెద్దదోర్నాల: భూచక్ర గడ్డ.. ఇది నల్లమల అభయారణ్యంలో దొరికే ఓ దుంప. లక్ష్మీగడ్డ.. లచ్చిగడ్డ.. మాగడ్డ పేర్లతోనూ పిలిచే ఈ మధుర దుంపలో ఎనలేని ఔషధాలు ఉన్నాయని చెబుతారు. తీగ జాతి మొక్క కాండంగా భూమి అడుగు భాగంలో ఇది పెరుగుతుంది.
కేవలం అడవుల్లో మాత్రమే.. తక్కువ ఎత్తులో పెరిగే అరుదైన తీగ జాతి మొక్క. దీని పూలు ఆకర్షణీయంగా తెల్లగా, మంచి సువాసన కలిగి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలంలోని నల్లమల అభయారణ్యంతోపాటు భద్రాచలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది.
ఈ మొక్క భూమి అంతర్భాగంలో సుమారు 6 నుంచి 15 అడుగుల లోతులో 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెరుగుతుంది. దుంప పైభాగమంతా ఎర్రగా ఉండి.. లోపలంతా తెల్లగా, అత్యంత రుచి కలిగి ఉంటుంది. భూచక్ర గడ్డ ఉన్న ప్రాంతంలో భూమి పైభాగంలో తెల్లపూలు కలిగిన ఓ రకమైన తీగ ఉంటుందని, ఇది ఓ రకమైన మత్తుతో పాటు మంచి సువాసన కలిగి ఉంటుందని ఈ గడ్డను సేకరించే చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు.
ఈ వాసనను పసిగట్టిన చెంచు గిరిజనులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. తీగ ఆధారంగా గడ్డ ఇక్కడే ఉంటుంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే గడ్డ కోసం తవ్వకం మొదలు పెడతారు.
చెంచులకు అవినాభావ సంబంధం
చెంచు గిరిజనులకు భూచక్ర గడ్డతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చెంచులు ఈ గడ్డను లచ్చిగడ్డ, లక్ష్మీగడ్డగా పిలుచుకుంటారు. భూచక్ర గడ్డతో ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ గడ్డ వాడకం వల్ల బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి, మధురంగా ఉండే ఓ దుంప జాతి గడ్డ. – మంతన్న, కో–ఆర్డినేటర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్, పెద్దదోర్నాల
ఎన్నో ఔషధ గుణాలు
భూచక్ర గడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెంచు గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ గడ్డను ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని ఔషధంలా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా తింటే మంచిదని, దాహం అనిపించినప్పుడు ఇది ఎక్కువగా తినటం వల్ల దప్పిక వేయదని వారు పేర్కొంటున్నారు. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి దీనిని తినటం వల్ల వేడి, వాతం, కడుపులో మంట, కడుపులో గడ్డలు, రాళ్లు ఉన్నా కరిగిపోతాయని స్పష్టం చేస్తున్నారు.
అరికాళ్ల మంటలు, తిమ్మిర్లు, షుగరు, బీపీ వ్యాధులకు ఈ గడ్డ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ గడ్డను వారం రోజులు పరగడుపున తింటే కడుపులో గ్యాస్ సమస్యలు ఉండవని, క్రమం తప్పకుండా నెల రోజులు తింటే బీపీ, షుగర్ లాంటి వ్యాధులు పూర్తిగా నయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ గడ్డను శ్రీశైలంతోపాటు పెద్దదోర్నాలలోని శ్రీశైలం రహదారిలో విక్రయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment