
నల్లమలలో అలజడి
ఆత్మకూరు: నల్లమల అడవిలో మళ్లీ అలజడి రేగింది. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో మావోయిస్టునేత ఆర్‌కే అనుచరుడు బాబురావుతో పాటు విమల, భారతి అనే ముగ్గురు హతమవ్వగా, ఒకరు తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం, కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమలలో భారీ ఎత్తున పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్తగా సున్నిపెంట పోలీస్ ఔట్‌పోస్ట్‌ను శ్రీశైలానికి తరలించింది.మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన ఉన్న నల్లమలలో గతంలో పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీ ముమ్మరంగా కార్యకలాపాలను సాగించింది. దాదాపు 15 ఏళ్ల పాటు పోలీస్, నక్సల్స్ మధ్య నల్లమలలో యుద్ధం సాగింది. గతంలో కర్నూలు పరిధిలోని నల్లమల నక్సల్స్ షెల్టర్‌జోన్‌గా ఉండేది. మహబూబునగర్ జిల్లా పరిధిలోని పోలీసుల నిఘా అధికమైతే కర్నూలు వైపు, జిల్లా పరిధిలో కూంబింగ్ జరిగితే మహబూబ్‌నగర్ జిల్లా వైపు తమ కార్యకలాపాలను నక్సల్స్ మార్చుకునేవారు.
కర్నూలు జిల్లా పరిధిలోని కొత్తపల్లి నుంచి శ్రీశైలం అటవీ పరిధి వర కు అప్పట్లో నక్సల్స్‌కు షెల్టర్ జోన్‌గా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రం విడిపోయినా భౌగోళికంగా ఒకే పరిధి కావడంతో జిల్లా మళ్లీ షెల్టర్‌జోన్ గా వారికి ఉపయోగ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారిగా 1984లో అప్పటి పీపుల్స్‌వార్‌గ్రూప్ జానాల గూడెంలో జెండా ఎగురవేసి కార్యకలాపాలను ప్రారంభించింది. జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, ఆళ్లగడ్డ, అహోబిలం, రుద్రవరం మండలాల్లో పీపుల్స్‌వార్ అప్పట్లో కార్యక లాపాలను కొనసాగించింది. అప్పట్లో ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డిని మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్, అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, మాట్టా రవికుమార్‌లు ఎన్‌కౌంటర్‌లో బలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు నల్లమల నుంచి ఏఓ బీ, చత్తీస్‌ఘడ్‌కు మకాం మార్చారు.
మావోల రిక్రూట్‌మెంట్:
ప్రస్తుతం నల్లమల అటవీపరిధిలోని మహ బూబ్‌నగర్, కర్నూలు జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ భారీగా జరుగుతున్నట్లు విశ్వనీయ సమాచారం. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయినా మావోలు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో న ల్లమల అటవీ పరిధిలోని అన్ని జిల్లాల్లో వీరు తమ రిక్రూట్‌మెంట్ కార్యక్రమాలు అధికం చేసి కేడర్ బలపరుచుకుంటున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఎన్‌కౌంటర్ల కేంద్రంగా
ఆత్మకూరు డివిజన్: ఆత్మకూరు డివిజన్‌లో 2002లో భానుముక్కుల మలుపు వద్ద తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో వడ్లరామాపురం గ్రామానికి చెందిన లింగస్వామి మృతి చెందారు. అలాగే 2003లో బావాపురం గ్రామం వద్ద శ్రీధర్, 2004లో నల్లకాలువ సమీపంలో వేణు అనే మావోలు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మావోల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో మావోల కార్యకలాపాలు ఏమీ లేవని పోలీసు వర్గాలు పేర్కొంటున్నా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో వారు అప్రమత్తమయ్యారు.