ఎర్రచందనం దొంగల అరెస్ట్
ఆళ్లగడ్డ: ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు తమిళ కూలీలతో కలిసి నల్లమల అడవిలో నుంచి ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈమేరకు గురువారం రాత్రి ఆళ్లగడ్డ సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రామయ్యలు ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు అటవీ సిబ్బందితో కలిసి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేశారు. అదే సమయంలో తెలుగు గంగ కాల్వ సమీపంలో కొందరు వ్యక్తులు అడవిలో నుంచి దుంగలను తెచ్చి ముళ్ల పొదల్లో దాచే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పటికే అక్కడే మాటేసిన పోలీసులు అహోబిలం గ్రామానికి చెందిన మోకు సంజీవ, ఓజీ తండాకు చెందిన మూడేశివనాయక్, బుక్కేవాసునాయక్, బాచేపల్లి తండాకు చెందిన మూడే శంకర్‌నాయక్, కోటకొండకు చెందిన షేక్షావలి, బజ్జరిరాజు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.