కడప అర్బన్: ఎల్‌ఈడీ వ్యాపార ముసుగులో ఎర్ర చందనం అక్రమ రవాణాదారులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న చైనాకు చెందిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కె.ఎ.దావూద్ జాగీర్ అలియాస్ జాకీర్(52) కటకటాలపాలయ్యాడు. దావూద్ జాగీర్‌తోపాటు అతని అన్న కుమారుడు ఫిరోజ్ దస్తగిరిని కడప జిల్లా పోలీసులు రాజంపేట–రాయచోటి రహదారిలోని ఆకేపాడు క్రాస్ వద్ద శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు.
రాజంపేట పరిధిలోని ఆకేపాడుకు చెందిన జాకీర్ దావూద్ అంతర్జాతీయ స్మగ్లర్‌గా పేరుగాంచాడు. అతను మొదట్లో తమిళనాడు రాష్ట్రం చెన్నైకి వెళ్లి అక్కడున్న అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. తరువాత ఏకంగా చైనాకే మకాం మార్చాడు. ప్రస్తుతం చైన్నైలోని మన్నాడి పట్టణం సలై వినాయగర్ కోయిల్ స్ట్రీట్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. అతను వ్యాపారాల నిమిత్తం చైనా దేశం గ్వాన్‌డాంగ్ రాష్ట్రంలోని పెంగ్జియాంగ్ జిల్లా యాంగువాన్‌లోని వుయికంట్రీ గార్డెన్, శ్రీలంక రాజధాని కొలొంబోలోని డెమటగోడలో కూడా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఏడో తరగతి వరకు విద్యనభ్యసించాడు. అతను 1997లో చెన్నై నగరం నుంచి చైనాకు వెళ్లి అక్కడ లైటింగ్ వ్యాపారాన్ని (ఎల్‌ఈడీ బల్బులు) ప్రారంభించాడు. చెన్నై నుంచి తరచూ చైనాకి వెళ్లి వస్తుండటంతో ఆ దేశానికి చెందిన లీయాన్ అనే యువతితో సాన్నిహిత్యం ఏర్పడి వివాహం చేసుకున్నాడు. ఇతని అన్న జాఫర్ దస్తగిర్ చైనాలో స్థిరపడ్డాడు. ఎల్‌ఈడీ బల్బుల వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో జాగీర్ చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ కంపెనీలు, షోరూమ్‌లు, వ్యాపారవేత్తలను కలిసేవాడు. ఈ క్రమంలో చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన పలువురు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. చైనీస్ భాషపై పట్టు ఉండటంతో అక్కడి వ్యాపారులు దావూద్ జాగీర్‌ను మధ్యవర్తిగా(బ్రోకర్) ఏర్పాటు చేసుకున్నారు. తమిళం, ఇంగ్లిష్, చైనీస్, జర్మనీ, ఉర్దూ, హిందీ, బర్మిస్, జపనీస్ భాషలు మాట్లాడటంలో ఇతను దిట్ట. దీంతో ఆయా దేశాల్లో ఉన్న స్మగ్లర్లు చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించుటకు జాగీర్ సహకారం పొందేవారు.
చెన్నై స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు:
చైనాలో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి పరిజ్ఞానం సాధించడంతో చెన్నైకి చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెంచుకున్నాడు. వారు చూపే పెద్ద మొత్తాలకు ఆకర్షితుడై చెన్నైకి చెందిన ప్రధాన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు సంతాన్‌మీరన్ అలియాస్ చందన్ మీరన్, సాహుల్ హమీద్, సాహుల్ భాయ్, కందస్వామి, పార్థీబన్ అలియాస్ పార్తిపన్‌లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చైనా దేశానికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఆసియా దేశాలకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లకు మధ్య ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యాపార కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడ్డాడు.
హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు రవాణా:
చెన్నైకి చెందిన సాహు హమీద్‌తో సంబంధాలు ఏర్పరచుకుని 2000 సంవత్సరం నుంచి ఎర్ర చందనాన్ని కంటైనర్ల ద్వారా హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్‌లకు తరలించి అక్కడి కొనుగోలుదారులకు జాగీర్ విక్రయించేవాడు. ఆ సొమ్మును ‘హవాలా’ ద్వారా సాహుల్ హమీద్‌కు చేరవేసేవాడు. అందుకు గాను కొనుగోలుదారులు, విక్రయదారుల నుంచి భారీగా కమీషన్ పొందేవారు. కొంతకాలం తర్వాత తమిళనాడు, ఆంధ్రా, ఢిల్లీ రాష్ట్రాల్లోనే స్మగ్లర్ల నుంచి నేరుగా ఎర్ర చందనం దుంగలను కొనుగోలు చేసి చైనాకు అక్రమంగా తరలించి నిరాటంకంగా వ్యాపారం సాగించేవాడు. జాగీర్ ఎర్ర చందనం అక్రమ రవాణాలో చైనాకు చెందిన చెన్‌చెంగై, చెన్ చెంగ్‌వు, సంతన్‌మీరన్, జాంగ్‌యాంగ్, వాంగ్ లీ ఫా, హాంకాంగ్‌కు చెందిన జిమ్మి, సింగపూర్‌కు చెందిన హనీఫ్, డేవిడ్, మయన్మార్‌కు చెందిన షణ్ముగమ్‌లతో సంబంధాలు ఏర్పరచుకుని వారికి ఎర్ర చందనం దుంగలను విక్రయించేవాడు.
సీమలో 57 కేసులు
అతనిపై కడప జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో ఒకటి, మొత్తం 57 ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. చైనా, దుబాయ్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇతనికి ఆస్తులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆయా దేశాల స్మగ్లర్లతో జాగీర్‌కు ఉన్న లావాదేవీలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఐజీ తెలిపారు. కొత్తగా సవరించిన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్, 1967 నిబంధనల మేరకు జాగీర్ ఆస్తుల వివరాలను సేకరించి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 2 వేల టన్నుల ఎర్ర చందనం దుంగలను ఎగుమతి చేసి విదేశాల్లో విక్రయించినట్లు జాగీర్ పోలీసు విచారణలో అంగీకరించాడు.
అన్న కుమారుడు సహకారం:
చెన్నైలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఫిరోజ్ దస్తగిరి.. దావూద్ జాగీర్ అన్న కుమారుడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసిన ఎర్ర చందనం దుంగలను వాహనాలలో జాగీర్ చెప్పిన ప్రదేశాలకు చేరుస్తూ అక్రమ రవాణాకు సహకరించాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని చిన్నాన్న జాగీర్ అక్రమ రవాణా వ్యాపారాలలో సహాయ సహకారాలు అందిస్తున్నాడు.
చెన్నై టు చైనా
Published Sun, Aug 21 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement